మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Operation Valentine: సినిమా ఎలా ఉందంటే.. !

ABN, Publish Date - Mar 01 , 2024 | 11:29 AM

తెలుగులో ఎయిర్ ఫోర్స్ యుద్ధం నేపథ్యంలో సినిమాలు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు వరుణ్ తేజ్ ఈ యుద్ధ నేపథ్యంలో 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.  శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్నాడు.

సినిమా: ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine Review)
నటీనటులు: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, అలీ రేజా, సర్వర్, అభినవ్ గోమాటం, సంపత్ తదితరులు
సంగీతం: మిక్కీ జె మేయర్
ఛాయాగ్రహణం: హరి కె వేదాంతం
నిర్మాణం: సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద
రచన, దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హదా (Sakti Pratap singh)

రేటింగ్: 2.5

-- సురేష్ కవిరాయని

తెలుగులో ఎయిర్ ఫోర్స్ యుద్ధం నేపథ్యంలో సినిమాలు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు వరుణ్ తేజ్ ఈ యుద్ధ నేపథ్యంలో 'ఆపరేషన్ వాలెంటైన్' (Operation Valentine) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.  శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్నాడు. మానుషి చిల్లర్ (Manushi Chillar) ఇందులో కథానాయక. ఈ సినిమాలో హిందీ తెలుగు నటులు మిశ్రమంగా కనిపిస్తారు. ఇంతకుముందు హిందీలో యుద్ధ నేపథ్యంలో సినిమాలు వచ్చాయి, ఈ మధ్యనే  'ఫైటర్' అనే సినిమా విడుదలైంది. అయితే ఆ 'ఫైటర్' కి ఈ 'ఆపరేషన్ వాలెంటైన్' కి పోలికలు ఉన్నాయా? వరుణ్ తేజ్ సినిమా ఎలా ఉందో చూద్దాం



Operation Valentine story కథ: (Review)
అర్జున్ రుద్ర దేవ్ అలియాస్ రుద్ర (వరుణ్ తేజ్- Varun Tej) భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్, యుద్ధ పైలట్ కూడా. ధైర్య సాహసాలకు పెట్టింది పేరు, దానివలన అప్పుడప్పుడు   పై అధికారులతో చివాట్లు కూడా తింటూ ఉంటాడు. అతని ప్రియురాలు అహన (మానుషి చిల్లర్) రాడార్ ఆపరేటర్ గా వైమానిక దళంలోనే పనిచేస్తూ ఉంటుంది. అర్జున్ ప్రాజెక్ట్ వజ్ర  సరిగా పని చేస్తోందో లేదో అని టెస్ట్ చేసే సమయంలో అతని మిత్రుడు (నవదీప్) ని కోల్పోతాడు. ఆ తరువాత పాకిస్తాన్ కి చెందిన టెర్రరిస్టులు భారత సైనికులను తీసుకు వెళుతున్న ట్రక్కులపై దాడి చేస్తారు, ఇందులో 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోతారు. దీనికి ప్రతిగా భారత వైమానిక దళం ఒక ఆపరేషన్ ప్లాన్ చేస్తుంది. ఏంటి ఆ ఆపరేషన్, అది ఎలా అమలు చేస్తారు, వజ్ర ప్రాజెక్ట్ నేపథ్యం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే 'ఆపరేషన్ వాలెంటైన్' చూడాల్సిందే.



విశ్లేషణ: (Operation Valentine Movie Review)

ఈ కథ నిజ సంఘటనల ఆధారంగా తీసిన కథ. పాకిస్తాన్ టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా దాడిలో 40 మంది భారత సైనికులను పొట్టను పెట్టుకున్న ఉదంతం అందరికీ తెలిసినదే. దానికి ప్రతిగా భారత వైమానిక దళం పాకిస్థాన్లోని టెర్రరిస్ట్ క్యాంపులను విచ్ఛిన్నం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ 'ఆపరేషన్ వాలెంటైన్' అనే సినిమా ఈ కథ ఆ సంఘటన ఆధారంగా తీసుకున్నదే. అయితే తెలుగులో ఇలాంటి యుద్ధ నేపథ్యం ఉన్న సినిమా రావటం ఇదే మొదటిసారి. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా కంప్యూటర్ గ్రాఫిక్స్ అవసరం, ప్రేక్షకులకి నమ్మించే విధంగా కూడా ఉండాలి, అలాంటి సన్నివేశాలు కూడా చూపించగలగాలి. ఇవన్నీ కాకుండా దేశభక్తి అనే భావోద్వేగంతో పాటు మనుషుల మధ్య కూడా ఆ భావోద్వేగాలు కనిపించాలి. అప్పుడే ఈ తరహా సినిమాలు విజయం సాధిస్తాయి. ఇక ఈ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు వస్తే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తన పరిధి మేరకు చేసాడు అని చెప్పొచ్చు, అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాట్లు వున్నా తెలుగు సినిమాలో ఇటువంటి కథా నేపథ్యం ఉన్న సినిమా తీయడం హర్షించదగ్గ విషయమే. ఇంతకుముందు హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన 'ఫైటర్' సినిమా కూడా ఇటువంటి కథా నేపథ్యం ఉన్న సినిమా అవడం ఆసక్తికరం. ఇప్పుడు ఈ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా కూడా అదే నేపద్యంలో వచ్చింది. ఇందులో దేశభక్తి కనిపిస్తుంది కానీ సినిమాలో భావోద్వేగాలు అంతగా కనిపించవు, కొన్ని దగ్గర్ల మరీ గ్రాఫిక్స్ అని అర్థం అయిపోతుంది. ఇది వ్యాపారాత్మకంగా నడుస్తుందా నడవదా అన్న విషయాన్ని పక్కన పెడితే వరుణ్ తేజ్ లాంటి నటుడు ఇలాంటి సినిమాతో ముందుకు రావడం హర్షనీయం.



ఇక నటీనటుల విషయానికి వస్తే వరుణ్ తేజ్ అర్జున్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. చక్కని  భావోద్వేగాలను కూడా చూపించగలిగాడు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుణ్ ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు చెయ్యడం అభినందనీయం. మానుషి చిల్లర్ అహన పాత్రలో బాగుంది. అలీ రేజాకి మంచి పాత్ర లభించింది. నవదీప్ పాత్రని ఎందుకో సినిమాలో ఎక్కువ చూపించకుండా తొలగించారు. అతనేంటి అనేది ప్రేక్షకులకు పజిల్ లాగ  ఉంటుంది. మిగతా నటీనటులందరూ త పాత్రల పరిధి మేరకు నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం బాగుంది. ఛాయాగ్రహణం కూడా సినిమాకి ఒక హైలైట్.

చివరగా, 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా దేశభక్తి ప్రధాన నేపధ్యంగా నిజ సంఘటనల ఆధారంగా తీసిన ఒక సినిమా. భావోద్వేగాలపై, గ్రాఫిక్స్, కథ మీద ఇంకా కొంచెం దృష్టి పెట్టి ఉంటే, ఇది ఒక మంచి సినిమా అయ్యుండేది. అయినా ఈ చిత్ర నిర్వహకులు, వరుణ్ తేజ్ ఇలాంటి వైవిధ్యమైన సినిమాతో రావటం అభినందనీయం. (Operation Valentine Review)

Updated Date - Mar 01 , 2024 | 02:57 PM