35 Chinna Katha Kaadu Review: ‘35 చిన్న కథ కాదు’ రివ్యూ
ABN, Publish Date - Sep 05 , 2024 | 11:43 AM
నివేథా థామస్ కథల ఎంపికలో పట్టున్న కథానాయిక. ఆమె ఓ సినిమా అంగీకరించిందీ అంటూ ఆ సినిమాలో ఏదో విషయం ఉంటుందనే ప్రేక్షకుల నమ్మకం.
సినిమా రివ్యూ: 35 చిన్న కథ కాదు.. (35 chinna katha kaadu)
నటీనటులు: నివేథా థామస్, విశ్వదేవ్ రాజకొండ, ప్రియదర్శి, భాగ్యరాజ్, గౌతమి, విశ్వతేజ్, అరుణ్, అభయ్ శంకర్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి
ఎడిటింగ్: టి.సి ప్రసన్న
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాతలు: సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి
సమర్పణ: రానా దగ్గుబాటి
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
రచన–దర్శకత్వం: నంద కిశోర్ ఈమాని
నివేథా థామస్ (Nivetha Thomas) కథల ఎంపికలో పట్టున్న కథానాయిక. ఆమె ఓ సినిమా అంగీకరించిందీ అంటూ ఆ సినిమాలో ఏదో విషయం ఉంటుందనే ప్రేక్షకుల నమ్మకం. వకీల్‌సాబ్‌తో హిట్ అందుకున్న ఆమె 'శాకిని–డాకిని’ చిత్రంతో పరాజయం చవిచూసింది. దాంతో ఏడాదిన్నపాటు తెలుగుతెరపై కనిపించలేదు. కొంత విరామం తర్వాత ఆమె నటించిన చిత్రం 35 చిన్న కథ కాదు(35 chinna katha kaadu)’. నూతన దర్శకుడు నంద కిశోర్ ఈమాని దర్శకత్వంలో వహించిన ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్. రానా దగ్గుబాటి సమర్పకులుగా వ్యవహరించారు. నివేథా హీరోయిన్ కావడం చడీచప్పుడు కాకుండా తెరకెక్కించిన ఈ చిత్రానికి రానా సమర్పకుడిగా వ్యవహరించడం పోస్టర్లు, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో జనాల దృష్టి ఈ సినిమాపై పడింది.
కథ:
సరస్వతి (నివేతా థామస్) ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ) తిరుపతిలో సాధారణ జీవితం సాగించే భార్యభర్తలు. ప్రసాద్ బస్సు కండెక్టర్. సరస్వతి టెన్త్ ఫెయిల్ అయిన గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్దోడు అరుణ్ (అరుణ్ దేవ్), చిన్నోడు వరుణ్ (అభయ్ శంకర్). చిన్నోడు చదువులో పర్వాలేదు కానీ పెద్దోడు లెక్కల్లో వీక్. అందుకే లెక్కల మాస్ట్టారు చాణక్య వర్మ( ప్రియదర్శి) అరుణ్‌ని ‘జీరో’ అని పిలుస్తాడు. అయితే లెక్కలకు సంబంధించి అరుణ్ ఎప్పుడూ లాజిక్కులు అడుగుతుంటాడు. ఆ లాజిక్కులకు మాస్టార్ల దగ్గర సమాధానం ఉండదు. లెక్కల్లో వరుసగా జీరోలు తెచ్చుకోవడం వల్ల ఒక సంవత్సరం డిమోట్ అయ్యి తమ్ముడు చదువుతున్న క్లాసులో కూర్చోవాల్సి వస్తుంది. స్నేహితులకు దూరమై, చదువు భారంగా మారిన అరుణ్ స్కూల్లో కొనసాగాలంటే లెక్కల్లో కనీసం ’35’ మార్కులు తెచ్చుకోవాల్సిందే. అప్పుడు అరుణ్ ఏం చేశాడు? స్నేహితులకు దగ్గర కావడానికి, ఏం చేశాడు. లెక్కలంటే భయపడుతున్న కొడుకుకి పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి పాఠాలు ఎలా చెప్పింది. చివరికి అరుణ్ లెక్కల్లో పాస్ అయ్యాడా లేదా అన్నది మిగిలిన కథ. (35 chinna katha kaadu)
విశ్లేషణ:
తిరుపతిలో నివశించే చిన్న కుటుంబం, ఇద్దరు పిల్లలు వారి భవిష్యత్తు కోసం తపన పడే తల్లిదండ్రులు చుట్టూ తిరిగే కథ ఇది. ప్రథమార్ధం సరస్వతి కుటుంబం, పిల్లలు, స్కూలు, లెక్కల్లో జీరో అయిన అరుణ్ గురించి చూపించారు. బ్రాహ్మణ కుటుంబం, ఇంట్లో వారి పద్దతులు, మాట తీరూ అన్ని కూడా సన్నివేశాల రూపంలో చూపించారు దర్శకుడు. ఆ తర్వాత స్కూల్, అక్కడి పిల్లల యాంగిల్‌లోకి కథ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మ్యాథ్‌మేటిక్స్ సబ్జెక్ట్ అనేది ఎప్పటికీ అంతు చిక్కని కథే. లాజిక్ తెలిసి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలిస్తే ఆ సబ్జెక్ట్ అంతా ఈజీ, స్కోరింగ్ మరొకటి ఉండదు. ఇందులో అరుణ్ సమస్యే లెక్కల సబ్జెక్ట్. లెక్కలు పడనోడికి దానిని బోధించే మాస్టర్ కూడా విలన్‌లాగే కనిపిస్తాడు. ఇది నిజం జీవితంలో కూడా చూస్తుంటాం. ఈ చిత్రంలో చాణక్య (ప్రియదర్శి) పాత్రను అదే కోణంలో డిజైన్ చేశారు. ‘నేను పిల్లలతో బాగుండకపోయినా ఫర్వాలేదు. పిల్లలు, వారి భవిష్యతుల్ల బాగుండాలనే తీరు ఆ పాత్రది. సిక్త్స్ చదువుతున్న కొడుకు చెస్ ఆడుతూ తల్లిని ‘అమ్మా గుర్రం ఇలానే ఎందుకు దూకుతుంది?’ అని అమాయకంగా అడిగితే, దానికి తల్లి చెప్పిన లాజిక్ ఎంత అర్థవంతంగా ఉంటుందో? అదే అబ్బాయి క్లాసులో ‘విలువ లేని సున్నా ఒకటి పక్కన నిలబడితే, అది తొమ్మిది కంటే ఎందుకు ఎక్కువ అవుతుంది?’ అని నిలదీస్తే టీచర్ సమాధానం చెప్పలేడు. ‘నా దగ్గర రెండు పెన్నులు ఉన్నాయి. దాన్ని జీరోతో గుణిేస్త జీరో ఎలా అవుతుంది. నా దగ్గర ఇంకా రెండు పెన్నులు ఉన్నాయి కదా. అవి లేకుండా ఎక్కడికి పోతాయ్’ అని అడిగితే.. ఆన్సర్ చెప్పలేని మాస్టర్ బ్యాక్ బెంచ్‌లో కూర్చోబెడతాడు. మరో చిన్నారి కిరణ్‌మై రావడం, తన సపోర్ట్‌తో స్నేహితులంతా తోడై అరుణ్‌ని లెక్కల పరీక్షలకు సిద్ధం చేయడం ఆకట్టుకున్నాయి. కాపీ కొట్టి అయినా 35 మార్కులు తెచ్చుకోవచ్చు అని అరుణ్‌ని పుష్ చేస్తారు. అతను మాత్రం నిజాయతీగా తనని తాను నిరూపించుకోవాలనుకుంటాడు. అక్కడే కథ టర్న్ అయింది. అప్పటి దాకా పిల్లలు, స్కూల్ నేపథ్యంలో సాగిన కథ.. తల్లి కథగా మారింది. సరస్వతి పాత్రని మరింత స్ర్టాంగ్ చేయడం కోసం పదో తరగతి ఫెయిల్ అయిన ఆమె చేత మళ్లీ పుస్తకాలు పట్టించాడు దర్శకుడు. తన బిడ్డను లెక్కల్లో రాణించేలా తీర్చిదిద్దడానికి తను కష్టపడి పిల్లాడికి మంచి బాట వేసే ప్రయత్నం చేసింది. చాణిక్య, సరస్వతి పాత్రల మధ్య సన్నివేశాలు, సంభాషణలు అలరించాయి. వాళ్ల మాటలు కూడా లెక్కలు, ఫార్ములాల మాదిరి సాగడం ఆసక్తికరంగా ఉంటుంది. ‘సున్నా’కి విలువ ఎందుకు లేదు? అనే క్వశ్చన్‌తో మొదలైంది కథ. దానికి సరైన సమాధానం చెప్పాలి కదా! అరుణ్ జీవితం, అతనికి ఎదురైన సమస్యలకు వాటికి సమాధానం రాబట్టిన దర్శకుడికి ఇంటెలిజెన్స్‌ను చెబుతుంది. దర్శకుడు ఎంచుకున్న కథ నుంచి తెరకెక్కించిన విధానం బావుంది. లెక్కల్లో ప్లస్, మైనస్‌లు ఉన్నట్లు ఈ చిత్రంలో కూడా ప్లస్, మైనస్‌లు ఉన్నాయి. కథ ప్రారంభం నుంచి నెమ్మదిగా నడవడం, అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో రివీల్ కావడానికి 45 నిమిషాల వ్యవధి తీసుకోవడం సినిమాకు మైనస్‌గా అనిపిస్తుంది. 35 మార్కుల కోసం ఇదంతా అని ఊహకు అందినప్పటికీ తెరపై అది రివీల్ కావడం బాగా సమయం తీసుకోవడం కాస్త సాగదీతలా అనిపించింది. అయితే అది కూడా ప్రతి సన్నివేశాన్ని కవితాత్మకంగా చెప్పే ప్రయత్నంలో భాగంగా అలా జరిగి ఉండొచ్చు. క్లైమాక్స్‌లో మార్కుల గురించి తండ్రి చెబుతున్న సందర్భంలో అరుణ్ అద్దంపై నీళ్లు కొట్టిన సన్నివేశం భావోద్వేగాన్ని పంచుతుంది. కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షుకలు ఈ తరహా కథను అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేరు. కమర్షియల్ హంగులు లేకపోవడం ఈ సినిమాకు ఓ మైనస్ అనుకోవచ్చు. తిరుపతి యాస విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకుంటే బావుండేది.
ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే.. నివేథా థామస్ ఏ పాత్ర చేసినా పేరు పెట్టక్కర్లేదు. పాత్రకు తగ్గట్టు ఆమె ఒదిగిపోతుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సరస్వతిగా ఆ పాత్రకు వంద మార్కులు తెచ్చుకుంది. తల్లి ప్రేమ, భావోద్వేగాలను అద్భుతంగా పలికించి సినిమాకు మేజర్ పిల్లర్‌గా నిలిచింది. ప్రియదర్శితో చేసిన సీన్‌లో నటనలో తన టాలెంట్ మరింత బయటపడుతుంది. బాధ్యతాయుతమైన భార్యగా, తల్లిగా ఒదిగిపోయింది. తన కెరీర్‌లో చెప్పుకోదగగ్గ పాత్రలో సరస్వతి పాత్ర తప్పకుండా ఉంటుంది. విశ్వదేవ్ లాంటి యువ కథానాయకుడిగా ప్రసాద్ పాత్ర సవాల్‌తో కూడినది. నాన్నలా ఆ పాత్రకు న్యాయం చేశాడు. తెరపై కనిపించిన పిల్లలు అంతా చిచ్చరపిడుగులా చెలరేగిపోయారు. లెక్కల మాస్టార్‌గా ప్రియదర్శికి ఇది భిన్నమైన పాత్ర. నిజంగా లెక్కల మాస్టార్‌లాగే కనిపించాడు. భాగ్యరాజ్ పాత్ర సోసోగా అనిపించింది. గౌతమి పాత్ర సినిమాకు కాస్త కీలకమే. ఆమె కూడా పాత్రకు న్యాయం చేసింది. కృష్ణ తేజ పాత్ర ఆకట్టుకుంది. టెక్నికల్‌గా చూస్తే.. నిర్మాణ పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. కథకు ఏం కావాలి అవి నిర్మాతలు సమకూర్చారు. పాటలు కథలో బాగంగా సాగాయి. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. కెమెరా పనితీరు ఉన్నతంగా ఉంది. స్ర్కీన్‌ప్లే కాస్త వేగంగా ఉండుంటే సినిమా చకచకా ముందుకు సాగేది. ‘బుర్రకెక్కాల్సిన చదువులు భుజాలకెక్కుతున్నాయి’, పెరగాలి అనుకొన్నప్పుడు కొంచెం తుంచాలి.. కొమ్మైనా కొడుకైనా’ అన్న డైలాగ్‌లు సందర్భానుసారంగా బావున్నాయి. ఆర్టిస్ట్‌ల ఎంపికలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. పాత్రలకు తగ్గ ఆర్టిస్ట్‌లను ఎంపిక చేసుకున్నారు. పాటలు, ఫైట్‌లు, కమర్షియల్ హంగులు ఆశించకుండా ుఇది మన జీవితం, మన భావోద్వేగాలు’ అని ఈ సినిమా చూస్తే తప్పకుండా మంచి సినిమా అనే భావనతో థియేటర్ నుంచి బయటకు వస్తారు. స్వచ్ఛమైన కథలు మరుగుతున్న పడుతున్న తరుణంలో కమర్షియల్ అనే హంగులు లేకుండా ఈ తరహా సినిమా చేయడం దర్శకుడు చేసిన సాహసమే.
ట్యాగ్‌లైన్: 35.. మంచి మార్కులే