Barroz 3D Review: మోహన్ లాల్ దర్శకత్వంలో వచ్చిన 'బరోజ్‌ త్రీడీ' రివ్యూ

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:59 AM

మలయాళం చిత్రం చిన్నదైనా, పెద్దదైనా కంటెంట్‌ కీలకంగా ఉంటాయి, అద్భుతాలు సృష్టిస్తాయి. అలా ఈ ఏడాది చాలా చిత్రాలే వచ్చాయి. ఏడాది చివర్లో మోహన్‌లాల్‌ నటించి, దర్శకత్వం వహించిన ‘బరోజ్‌’ ప్రేక్షకులే కాదు పలు పరిశ్రమలు ఆతురతగా ఎదురుచూశాయి

సినిమా రివ్యూ: బరోజ్‌ త్రీడీ(Barroz 3D Review)
విడుదల తేదీ: 25–12–2024


నటీనటులు: మోహన్‌లాల్‌(mohan lal), మాయా రావు వెస్ట్‌, తుహిన్‌ మేనన్‌, గోపాలన్‌, తదితరులు


సాంకేతిక నిపుణులు
సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌,
ఎడిటర్‌: అజిత్‌కుమార్‌;
సంగీతం: మార్క్‌ కిలియన్‌
నిర్మాణ సంస్థ: ఆశీర్వాద్‌ సినిమాస్‌
నిర్మాత: అంటోనీ పెరుబవూర్‌;
మాటలు: రవికుమార్‌
దర్శకత్వం: మోహన్‌లాల్‌.

మలయాళం చిత్రం చిన్నదైనా, పెద్దదైనా కంటెంట్‌ కీలకంగా ఉంటాయి, అద్భుతాలు సృష్టిస్తాయి. అలా ఈ ఏడాది చాలా చిత్రాలే వచ్చాయి. ఏడాది చివర్లో మోహన్‌లాల్‌ నటించి, దర్శకత్వం వహించిన ‘బరోజ్‌’ ప్రేక్షకులే కాదు పలు పరిశ్రమలు ఆతురతగా ఎదురుచూశాయి. అందుకు ప్రత్యేక కారణం... స్టార్‌ హీరో అయిన మోహన్‌లాల్‌ దర్శకుడిగా మారడమే! అయితే ఈ చిత్రం ప్రారంభమై చాలాకాలమైంది. కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎట్టకేలకు ఈ కిస్మస్‌ పండుగకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ఎలా ఉంది? విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన మోహనలాల్‌ దర్శకుడిగా మెప్పించారా? అన్నది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే! (Barroz 3D Review)
 
కథ: (Mohanlal)
ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీసు రాజు డి గామా వంశానికి చెందిన నిధి చుట్టూ సాగే కథ ఇది. రాజుకి నమ్మిన బంటు అయిన బరోజ్‌ (మోహన్‌ లాల్‌) నాలుగు శతాబ్దాలుగా నిధిని కాపాడుతూ వస్తుంటాడు. డి గామా వారసులు వస్తే వాళ్లకి నిధిని అప్పగించడానికి ఎదురు చూస్తుంటాడు. ఎట్టకేలకి రాజవంశం పదమూడో తరానికి చెందిన ఇసబెల్లా (మాయా రావు) తన తండ్రితో కలిసి గోవా వస్తుంది. మరి ఆమెకి బరోజ్‌ నిధిని అప్పగించాడా? లేదా? 400 ఏళ్లుగా బరోజ్‌ ఆ నిధిని ఎలా కాపాడుతూ వచ్చాడు? ఇసబెల రాజవంశానికి చెందిన యువతి అని అతడికి ఎలా తెలిసింది? అన్నది తెరపైనే చూడాలి.



విశ్లేషణ: (Barroz 3D Review)
ఇప్పుడు భారతీయ సినిమా స్పాన్‌ పెరిగింది. ఇప్పుడిప్పుడే హాలీవుడ్‌ రేంజ్‌ చిత్రాలు ఇండియాలో కూడా తయారవుతున్నాయి. ఒకప్పుడు హిస్టారికల్‌, యాక్షన్‌ చిత్రాలను హాలీవుడ్‌ నుంచి తెలుగులో అనువాదం కాగా ప్రేక్షకులు వాటిని చూసి ఎంజాయ్‌ చేసేవారు. ఇప్పుడు మన కథలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. హాలీవుడ్‌ చిత్రాల స్ఫూర్తితో ఇక్కడ కూడా సినిమాలు తీయొచ్చు. కానీ ప్రేక్షకుల అభిరుచి, ఆసక్తి దృష్టిలో పెట్టుకోవాలి. హాలీవుడ్‌ కోసం సినిమా తీస్తున్నామా? లేదంటే మన ఆడియన్స్‌కి ఆ తరహా చిత్రాలు చూపించాలనుకుంటున్నామా? అన్నది ఆలోచించాలి. లేదంటే రిజల్‌ ఆశించిన రీతిలో ఉండకపోవచ్చు. మోహన్‌లాల్‌ దర్శకుడిగా మారి తీసిన బరోజ్‌ త్రీడీ చిత్రం అలాగే ఉంది. ఇప్పుడు ఇండియన్స్‌ ప్రపంచ సినిమాను చూస్తున్నారు. హాలీవుడ్‌ నుంచి వచ్చే డిఫరెంట్‌ చిత్రాలను వీక్షిస్తున్నారు. ఆయా కథల్లో మన హీరోల్ని ఊహించుకుంటారు. అయితే మోహన్‌లాల్‌ లాంటి విలక్షణ నటుడు ఈతరహా చిత్రం చేస్తే జానపదాన్ని చూడాలనుకుంటారు. కానీ ఆయన బరోజ్‌తో   పూర్తిగా రివర్స్‌లో వెళ్లారు. ఇందులో మనవైన పాత్రలు, నేపథ్యం మచ్చుకైనా లేవు. పోర్చుగీసు పాట, పోర్చుగీసు పాత్రలు, సంభాషణలు, విదేశీ ప్రేక్షకులే టార్గెట్‌ అన్నట్లు ఈ చిత్రాన్ని తీశారు. ఇది ఇండియన్‌ సినిమా అని లీనమయ్యేలా చేసే ఒక్క సీనూ లేదు. కథలో కొత్తదనం, సన్నివేశాల్లో బలం లేదు. నిధి చుట్టూ తిరిగే కథ కావడంతో ఎన్నో సాహసాలతో ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. థ్రిల్‌ ఫీలయ్యేలా తెరకెక్కించేందుకు ఆస్కారం ఉంటుంది. వందల యేళ్ల ఆత్మ చుట్టూ డ్రామా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌కి ఫన్‌ జోడించవచ్చు. కానీ ఆ ప్రయత్నం కనిపించలేదు. పోర్చుగీసు రాజు డి గామా, ఆయన నిధి, కట్టప్ప లాంటి బరోజ్‌, వారసురాలు ఇసబెల్లా పాత్రతో శతాబ్దాల ఫాంటసీ వరల్డ్‌ని సృష్టించాడు. అందులో బలమైన భావోద్వేగాలు మిస్‌ అయ్యాయి.  త్రీడీ విజువల్స్‌పై దృష్టి పెట్టినంతగా మోహన్‌లాల్‌ ఈ  సినిమాలోని కథాంశంపై దృష్టి పెట్టలేదన్నది అడుగడుగునా తెలుస్తోంది. త్రీడీ విజువల్స్‌ మాత్రం సినిమా హైలైట్‌ అని చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లోని యాక్షన్‌ ఘట్టాలు ఆకట్టుకుంటాయి. ‘బాహుబలి’లో కట్టప్ప తరహాలో మోహన్‌ లాల్‌ గెటప్‌ ఉంటుంది. రాజ వంశానికి అతనొక నమ్మిన బంటు. అది పక్కన పెట్టి క్యారెక్టర్‌ సెటప్‌ చూస్తే. జీనీలా అద్భుతాలు చేసే అవకాశం ఉంది. మంచి వినోదం పండించవచ్చు. టెన్షన్‌ బిల్డ్‌ చేయవచ్చు. మోహన్‌లాల్‌ వీటిపై దృష్టిపెట్టలేదు. దర్శకుడిగా మార్క్‌ చూపించిన సన్నివేశాలు ఎక్కడా కనిపించలేదు. చిరంజీవి వాయిస్‌తో ఈ చిత్రం మొదలువుతంది. క్యారెక్టర్స్‌ డిమాండ్‌ మేరకు వెస్ట్రన్‌ ఆర్టిస్టులను తీసుకోక తప్పదు. కానీ, స్ర్కీన్‌ మీద ఎక్కువ ేసపు వాళ్లు కనిపించడంతో పాటువాళ్ల నటన మన ప్రేక్షకులకు విసుగు పుట్టించింది. నిధిని కాపాడాలనే ఓ భూతం, కాజేయాలని చూేస దుష్ట శక్తులు... మన జానపదాల్లో ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. పోర్చుగీసు వరకు వెళ్లాల్సిన పని లేదు. అందుకే నేటివిటీ మిస్‌ అయిన భావన కలిగింది. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ బావుంది. అండర్‌ వాటర్‌ సీక్వెన్సులో త్రీడీ విజువల్స్‌ అప్‌ టు ద మార్క్‌ లేవు. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బావున్నాయి. ఖర్చు విషయంలో అసలు వెనుకాడలేదు. క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌  బాగా కుదిరింది. బరోజ్‌  పాత్రలో మోహన్‌లాల్‌ ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. కట్టప్ప తరహాలుక్‌లో కొత్తగా కనిపించారు. నటన పరంగా అంతా ఓకే.  ఇసబెల్లా పాత్రలో మాయారావు బాగుంది  ఇందులో హాలీవుడ్‌ నటులే ఎక్కువగా కనిపిస్తారు. టెక్నికల్‌గా సినిమా హైఎండ్‌లో ఉంది. సంతోష్‌ శివన్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. సంగీతం ఫర్వాలేదనిపంచింది. మోహన్‌ లాల్‌లోని నటుడిని డైరెక్టర్‌ శివ డామినేట్‌ చేశాడు. ఎక్కడా నటనకు ఆస్కారం ఇవ్వలేదు. మిగతా పాత్రలన్నీ పర్వాలేదనిపించారు. ఓవరాల్‌గా సినిమా చూస్తే అభిమానులను కూడా సినిమా ఎక్కదు. నటుడిగా, దర్శకుడిగా మోహన్‌లాల్‌ కష్టం వ్యర్థమైంది.

ట్యాగ్‌లైన్‌: అభిమానులకూ కష్టమే! 

Updated Date - Dec 26 , 2024 | 01:09 AM