Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే..
ABN, Publish Date - Oct 11 , 2024 | 01:41 AM
సరైన హిట్టు కోసం కసరత్తులు చేస్తున్నారు సుధీర్‌బాబు. ఈ మధ్యన విడుదలైన వరుస చిత్రాలు ఫ్లాప్ కావడంతో తాజాగా ఆయన నమ్మకం అంతా ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన 'మా నాన్న సూపర్ హీరో’ చిత్రంపైనే పెట్టుకున్నారు.
సినిమా రివ్యూ: 'మా నాన్న సూపర్ హీరో'(Maa Nanna Superhero)
నటీనటులు: సుధీర్‌బాబు, ఆర్నా వోహ్రా, సాయి చంద్, షాయాజీ షిండే, ఝాన్సీ, శశాంక్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: సమీర్ కల్యాణి
సంగీతం: జై క్రిష్
ఎడిటర్: పి.కల్యాణ్
నిర్మాత: సునీల్ బలుసు
దర్శకత్వం: అభిలాష్ కంకర (Abhilash Kankara)
సరైన హిట్టు కోసం కసరత్తులు చేస్తున్నారు సుధీర్‌బాబు (Sudheer Babu) . ఈ మధ్యన విడుదలైన వరుస చిత్రాలు ఫ్లాప్ కావడంతో తాజాగా ఆయన నమ్మకం అంతా ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన 'మా నాన్న సూపర్ హీరో’ చిత్రంపైనే పెట్టుకున్నారు. శంకర్ కంకర దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా బరిలో దాదాపు నాలుగు చిత్రాలతో పోటీ పడింది. మరీ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? సుధీర్‌బాబు ఖాతాలో హిట్ పడిందా? అన్నది చూద్దాం.
కథ: (Maa Nanna Superhero)
ప్రకాష్ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. భార్య పిల్లాడికి జన్మనిచ్చి భర్త చేతిలో పెట్టి చనిపోతుంది. తల్లి మరణంతో పిల్లాడి బాధ్యత అంతా ప్రకాశ్‌దే!. మూడ్రోజుల పాటు లారీ మీద వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ మూడ్రోజుల కోసం అనాథాశ్రమంలో తన బిడ్డని వదిలేసి వెళ్తాడు. అయితే అనుకోకుండా ఓ కేసులో చిక్కుకోవడంతో ఇరవై ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. ఆ అనాధ పిల్లాడికి జానీ (సుధీర్ బాబు) అని పేరు పెడుతుంది ఆశ్రమం. జానీని శ్రీనివాస్ (షాయాజీషిండే) దత్తత తీసుకొంటాడు. మొదట్లో జానీని ప్రేమగానే చూసుకుంటాడు. కానీ తన జీవితంలో కొన్ని దురదృష్ట ఘటనలు ఎదుర్కవడంతో అది జానీ రాక వల్లే అని భావించి అతనిపై కోపం, ద్వేషం పెంచుకొంటాడు. కానీ జానీకి మాత్రం తన నాన్నే హీరో. తండ్రిని అమితంగా ప్రేమిస్తాడు. శ్రీనివాస్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతాడు. దొరికిన చోట అప్పులు చేస్తాడు. ఓ రాజకీయ నాయకుల దగ్గర కోటి రూపాయలు తీసుకుని ఇబ్బందుల్లో పడతాడు. అతని బారి నుంచి తండ్రిని కాపాడుకోవడం కోసం జానీకి కోటి రూపాయలు అవసరమవుతాయి. అదే సమయంలో అసలు తండ్రి ప్రకాష్ జైల్ నుంచి విడుదలవుతాడు. తన బిడ్డ ఎక్కడున్నాడో తెలీక వెతికే ప్రయత్నం చేస్తాడు. ప్రకాష్‌కు తన బిడ్డ జానీ దొరికాడా? జానీని పెంచుకున్న తండ్రిని కాపాడుకోవడానికి ఏం చేశాడు అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ: (Maa Nanna Superhero)
తనకు సంబంధం లేని నేరం నెత్తిన వేసుకుని పసి బిడ్డకు దూరమైన ప్రకాష్ స్టోరీతో సినిమా మొదలవుతుంది. తదుపరి శ్రీనివాస్, జానీ పాత్రలు తెరపైకి వస్తాయి. పెంచిన తండ్రి అంటే జానీకి ఎంత ఇష్టమో తొలి సన్నివేశాల్లో చూపించారు. దర్శకుడు. పలు సమస్యల వల్ల శ్రీనివాస్‌కు తన దత్త పుత్రుడు అంటే అయిష్టం పెరిగి కాస్త కర్కశంగా వ్యవహరించడం కూడా బాగానే చూపించారు. జనరల్‌గా పనీపాట లేకుండా తిరిగే కొడుకును దార్లో పెట్టేందుకు చేసే ప్రయత్నాలు ఇలానే సాగుతాయి. అయితే ఈ చిత్రం ధీమ్ అలా లేదు. రివర్స్‌గేర్‌లో ఉంది. కష్టాల్లో ఉన్న తండ్రిని గట్టు ఎక్కించేందుకు కొడుకు పడిన తపన ఈ చిత్రం. తండ్రికి కొడుకు బాధ్యతలు గుర్తు చేస్తుంటాడు. ప్రకాష్ పాత్ర తెరపైకి ఎంటరైనప్పటి నుంచీ అసలైన డ్రామా మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో కథ కాన్‌ఫ్లిక్ట్ ఏమిటో అర్థమైపోతుంది. కోటికి పైగా లాటరీ, దాన్ని లాక్కోవడానికి కొన్ని పాత్రలు చేసే ప్రయత్నాలు, తండ్రిని కాపాడుకోవడానికి కొడుకు పడే తాపత్రయం.. సెకెండాఫ్‌లో చూపించారు. స్లోగా సాగే కథనం కాస్త ఇబ్బంది పెడుతుంది. అయితే ఎమోషనల్ డ్రామాలకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ తరహా చిత్రాలకు సెకండాఫ్ చాలా కీలకం. ద్వితీయార్థంలో కథ మొత్తం లాటరీ, దాన్నుంచి వచ్చే కోటిన్నర చుట్టూ తిరుగుతుంది. అక్కడ తండ్రీ కొడుకుల ఎమోషన్ మిస్సయి, క్రైమ్ డ్రామాగా తెరపైకి వస్తుంది. డబ్బు చూడగానే ఎవరికైనా కుట్రలు మొదలవుతాయి. ప్రకాష్, జానీల ప్రయాణంలో భావోద్వేగ సన్నివేశాలు ఉండుంటే డ్రామా ఆసక్తిగా సాగేది. రాజు సుంధరం పాత్రతో ఫన్ పంచాలనుకున్నారు కానీ వర్కవుట్ కాలేదు, క్లైమాక్స్ 20 నిమిషాలు భావోద్వేగ సన్నివేశాలతోనే రన్ చేయాలనుకున్నారు. దర్శకుడి ఊహ ఎలా ఉందో కానీ ప్రేక్షకుడి మదికి అతికేలా లేదు. సాయిచంద్, సుధీర్‌బాబు మధ్య రెండు మూడు ఎమోషనల్ సీన్స్ జోడించి ఉంటే బావుండేది.
నటీనటుల విషయానికొస్తే.. సుధీర్ బాబు ఎక్కువగా ప్రేమ కథలు, యాక్షన్ చిత్రాలు చేస్తుంటారు. అయితే ఈసారి రూట్ మార్చి పూర్తిగా ఎమోషనల్ డ్రామాను ఎంచుకున్నారు. తన గత చిత్రాలతో పోల్చితే ఇది కొత్త చిత్రం చెప్పవచ్చు. తండ్రి ప్రేమ కోసం తన పడే యువకుడిగా సుధీర్ చక్కగా నటించారు. ఎమోషన్ సీన్స్‌ను పండించాడు. షాయాజీ షిండే కి కొత్త పాత్ర ఇది. ఆయన పాత్ర ఇంకాస్త పెంచి, భావోద్వేగాలను జోడిస్తే బాగుండేది. ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సినిమాకు సాయిచంద్ పాత్ర కూడా కీలకమే! చివర్లో సాయిచంద్. సుధీర్ పాత్రలను ఇంకాస్త బాగా డీల్ చేయాల్సింది. దర్శకుడు ఆ యాంగిల్ జోలికి వెళ్లలేదు. కథానాయిక క్యారెక్టర్ ఉన్నా లేనట్లే అన్నట్లు సోసోగా సాగింది. సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. నేపథ్య సంగీతానికి మంచి మార్కులు వేయొచ్చు. డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కెమెరా వర్క్ కూడా గ్రాండియర్‌గా ఉంది. ఎడిటర్ కాస్త కత్తెర వేసుంటే సినిమా క్రిస్ప్‌గా ఉండేది. నిర్మాతల క్వాలిటీగా సినిమా తీశారు. పూర్తిగా భావోద్వేగాల చుట్టూ సాగే కథ ఇది. కథ పరంగా చూస్తే ఓ నవలలా అనిపిస్తుంది. తెరపై భావోద్వేగాలు కూడా అంతగా పండలేదు. అయితే కమర్షియల్ అంశాలు లేకుండా ఈ తరహా కథను ఎంచుకున్న దర్శకుడు ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే వారికి సినిమా నచ్చుతుంది. ఈ మధ్యకాలంతో సుధీర్ నుంచి వచ్చిన చిత్రాల్లో ‘మా నాన్న సూపర్ హీరో’ బెటర్ అనొచ్చు.
ట్యాగ్ లైన్: తండ్రీ కొడుకుల భావోద్వేగ ప్రయాణం!