Kalki 2898AD Review: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక నటించిన సినిమా ఎలా ఉందంటే...

ABN, Publish Date - Jun 27 , 2024 | 11:40 AM

దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన 'కల్కి 2898 ఏడి' సినిమా మొదటి భాగం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ నటించిన ఈ సినిమా ఎలా వుందో చదవండి

Kalki 2898AD Review

నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, మాళవిక నాయర్, శోభన తదితరులు

మాటలు: నాగ్ అశ్విన్, సాయి మాధవ్ బుర్రా

సంగీతం: సంతోష్ నారాయణన్

ఛాయాగ్రహణం: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్

కథ, దర్శకత్వం: నాగ్ అశ్విన్

నిర్మాతలు: సి అశ్విని దత్

విడుదల తేదీ: 27 జూన్, 2024

రేటింగ్: 3

-- సురేష్ కవిరాయని

చాలా నెలల తరువాత ఒక హై బడ్జెట్ తెలుగు సినిమా 'కల్కి 2898ఏడి' విడుదలైంది. ప్రభాస్ కథానాయకుడు, నాగ్ అశ్విన్ దర్శకుడు. నాగ్ అశ్విన్ ఇంతకు ముందు 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'మహానటి' రెండు సినిమాలకి దర్శకత్వం వహించారు, ఆ రెండూ విజయవంతం అయ్యాయి. ఇప్పుడు ఈ 'కల్కి 2898 ఏడి' మూడో సినిమా. ఇది సుమారు రూ.600 కోట్లు పెట్టు తీసినట్టుగా సమాచారం. ప్రభాస్ తో పాటు, లెజండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించారు. హిందీ నటీమణులు దీపికా పదుకోన్, దిశా పటాని కూడా వున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాని సి అశ్విని దత్ నిర్మించారు. ఈ సినిమా రెండు పార్టులుగా వస్తోంది, ఇప్పుడు ఈ మొదటి పార్టు ఎలా వుందో చదవండి.

Kalki 2898 AD Story కథ:

ఈ సినిమా కథ మహాభారత యుద్ధం ముగింపు దశతో ప్రారంభం అవుతుంది. అభిమన్యుడు భార్య ఉత్తర గర్భంలో వున్న శిశువుని చంపడానికి అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్) ప్రయత్నం చేస్తాడు, కానీ సఫలం కాలేడు. అశ్వద్ధామ చేసిన పనికి శ్రీకృష్ణుడు అశ్వద్ధామకి శాపం ఇస్తాడు, పశ్చాత్తాపం పొందిన అశ్వద్ధామకి కలియుగంలో మళ్ళీ కల్కిగా అవతరించబోతున్నాను, ఆ శిశివుని నువ్వే కాపాడాలి అని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఇక కలియుగంలో సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) కాంప్లెక్స్ కి అధిపతి. తన కాంప్లెక్స్ లో అతను ఒక ఫెర్టిలిటీ ల్యాబ్‌ను నడుపుతూ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని చూస్తూ ఉంటాడు. అందరి ఆడవాళ్ళని టెస్టు చేస్తూ ఉంటాడు, అలా చేస్తున్నప్పుడు సుమతి (దీపికా పదుకోన్) అనే ఆమె తనకి కావలసిన అమ్మాయి అని అనుకుంటాడు. భైరవ (ప్రభాస్) కాంప్లెక్స్ లోకి ప్రవేశించి అక్కడ మంచి జీవితం గడపాలి అని కలలు కంటూ, కాంప్లెక్స్ లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క యాస్కిన్ బారినుండి సుమతిని కాపాడటానికి అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్) బయలుదేరతాడు. శంబాలాలో మరియం (శోభన) ఆమె మనుషులు సుమతి రాక కోసం ఎదురుచూస్తూ వుంటారు. సుమతి గర్భంలో పెరుగుతున్న పిల్లవాడు సామాన్యుడు కాదు స్వయానా భగవంతుడు అని అంటారు. సుమతిని తీసుకువచ్చి అప్పజెబితే కాంప్లెక్స్ లోకి పెర్మనెంట్ గా వుండి మంచి జీవితం గడపవచ్చు అని చెబితే భైరవ సుమతిని తీసుకువస్తాను అని చెప్పి బయలుదేరుతాడు. భైరవ, అశ్వద్ధామని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. భైరవ ప్రయత్నం ఫలించిందా? అశ్వద్ధామ మహాభారత యుద్ధం అయిన తరువాత కృష్ణుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి సుమతి గర్భంలో పెరుగుతున్న బిడ్డని కాపాడగలిగాడా? శంబాలాలో ప్రజలు ఎందుకు సుమతి కోసం ఎదురు చూస్తున్నారు? యాస్కిన్ తను కలలు కన్న కొత్త ప్రపంచాన్ని సృష్టించగలిగాడా? చివరికి ఏమైంది తెలియాలంటే 'కల్కి 2898ఏడి' సినిమా చూడండి.

విశ్లేషణ:

దర్శకుడు నాగ్ అశ్విన్ పురాణాలను అనుసంధానం చేస్తూ కథని రాసుకున్నారు. కథ మొదలుపెట్టడం ద్వాపరయుగం, మహాభారత యుద్ధం ముగియటం, అశ్వద్ధామకి శాపం, ఇలా చాలా ఆసక్తిగా మొదలుపెట్టారు దర్శకుడు. తరువాత కలియుగంలోకి వస్తే మొదటి 15 నిముషాలు కూడా ఆసక్తిగానే ఉంటుంది, కానీ ఆ తరువాత మాత్రం సినిమా నత్తనడకగా సాగుతుంది. ప్రభాస్ ఎంటర్ అయ్యాక సినిమా వేగం పుంజుకుంటుంది అని అనుకుంటాం కానీ, ప్రభాస్ తో మరీ కామెడీ చేయించారు. అక్కడ చాలా సన్నివేశాలు ఎడిట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాంప్లెక్స్ లో ఫెర్టిలిటీ సెంటర్, దాని వెనక నేపధ్యం, ఎందుకు అలా చేస్తున్నాడు, అవన్నీ ఈ మొదటి భాగంలో కనిపించవు. రెండో భాగంలో చూపిస్తారేమో ఎదురు చూడాలి. అదంతా చాలా గందరగోళంగా ఉంటుంది. మొదటి సగం అంతా చాలా నత్తనడకగా సాగుతూ ఎప్పుడు ఇంటర్వెల్ వస్తుందా అని ప్రేక్షకుడు ఎదురు చూస్తూ ఉంటాడు.

ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ తెరపై కనపడతారో అప్పటినుండి సినిమా కొంచెం వేగం పుంజుకుంటుంది, ఆసక్తి కూడా పెరుగుతుంది. అతను సుమతిని, ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు, సుమతి కోసం ఎదురు చూస్తున్న శంబాలా ప్రజలు ఆ సన్నివేశాలు కొంచెం బాగున్నాయి. భైరవని మొదట్లో కొంచెం సరదాగా చూపించినా, చివరికి వచ్చేసరికి అతని పాత్ర కొంచెం సీరియస్ అవటం బాగుంది, కానీ భైరవ పాత్రని సరిగ్గా డిజైన్ చేయలేకపోయారు దర్శకుడు. సినిమాలో ఎక్కడా కూడా భావోద్వేగాలు కనపడవు. పోరాట సన్నివేశాలపై, తరువాత గ్రాఫిక్స్ పై ఎక్కువ దృష్టి పెట్టారు దర్శకుడు. అందుకనే కథ చెప్పడంలో కొంచెం తడబడ్డారు అనే చెప్పాలి. మూడుగంటల సినిమాని రెండున్నర గంటలకి కుదించి చూపిస్తే బాగుండేది. సినిమాలో హైలైట్స్ గ్రాఫిక్స్, కొన్ని పోరాట సన్నివేశాలు. దర్శకుడు ముఖ్యమైన సన్నివేశాలు అన్నీ రెండో భాగంకోసం వదిలేసినట్టుగా కనపడుతోంది, అందుకనే ఈ మొదటి భాగంలో ఎక్కువ డీటెయిల్స్ కి వెళ్ళలేదు. సినిమా చూసి బయటకి వచ్చిన చాలామంది ప్రేక్షకులని సినిమా గురించి అడిగితే అర్ధం కాలేదు అని చెబుతూ వున్నారు. దర్శకుడు కథపై మరికొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. చివరి అరగంట మాత్రం సినిమా చాలా బాగుంటుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకి హీరో మాత్రం అమితాబ్ బచ్చన్ అనే చెప్పాలి. అతను తన హావభావాలతో, గంభీరమైన మాటలతో, అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అతనే సినిమాకి హైలైట్. ప్రభాస్ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి అయినా, అతను కనిపించేది తక్కువే అని చెప్పాలి. అతని పాత్ర కొంచెం సీరియస్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. మరి రెండో భాగంలో అతని పాత్ర బాగుంటుందేమో ఎదురు చూడాలి. కమల్ హాసన్ కేవలం రెండు సన్నివేశాల్లో కనపడతారు, క్లైమాక్స్ లో ఒరిజినల్ కమల్ గా కనపడతారు. దీపికా పదుకోన్ సుమతిగా బాగా చేసింది. శోభన, రాజేంద్ర ప్రసాద్, ఇంకా చాలామంది నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లాంటివాళ్లను కేవలం వినోదం కోసం పెట్టినట్టుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ లు కూడా కనపడతారు. దిశా పటానిని ఎందుకు ఈ సినిమాలో తీసుకున్నారో అర్థం కాదు, ఆమె పాత్రకు అంత ప్రాముఖ్యత అయితే లేదు. సంతోష్ నారాయణ్ నేపధ్య సంగీతం బాగుంది, అలాగే ఛాయాగ్రహణం చాలా బాగుంది.

చివరగా, 'కల్కి 2898 ఏడి' సినిమా మొదటి సగం నత్తనడకలా సాగినా, రెండో సగం బాగుంటుంది. అమితాబ్ బచ్చన్ తన నటనతో ఆకట్టుకుంటారు, అతనే ఈ సినిమాకి హైలైట్. సినిమాలో గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి. చివరి అరగంట సినిమా మాత్రం చాలా బాగుంటుంది.

Updated Date - Jun 27 , 2024 | 04:49 PM