Kali Review: ప్రిన్స్‌, నరేష్‌ ఆగస్త్య నటించిన థ్రిల్లర్‌ 'కలి' ఎలా ఉందంటే..

ABN, Publish Date - Oct 04 , 2024 | 11:52 PM

హిట్టు సినిమా కోసం ఎంతగానె పరితపిస్తున్న ప్రిన్స్‌ తాజాగా నటించిన చిత్రం 'కలి’. నరేష్‌ ఆగస్త్య కీలక పాత్ర పోషించారు. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఆసక్తిగా సాగిన ట్రైలర్‌ సినిమాపై పాజిటివ్‌ వైబ్స్‌ క్రియేట్‌ చేసింది,

సినిమా రివ్యూ: ‘కలి’ (Kali Movie review)

విడుదల తేదీ: 4–10–2024

నటీనటులు: ప్రిన్స్‌(Prince), నరేశ్‌ అగస్త్య, నేహా కృష్ణన్‌, సీవీఎల్‌ నరసింహరావు, కేదార్‌ శంకర్‌, ప్రియదర్శి (వాయిస్‌), మహేష్‌ విట్ట (వాయిస్‌) తదితరులు

సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫీ : రమణ జాగర్లమూడి, నిశాంత్‌

సంగీతం: జేబి(జీవన్‌ బాబు)

ఎడిటర్‌: విజయ్‌ వర్థన్‌.

నిర్మాత: టి లీలా గౌతమ్‌

దర్శకుడు: శివ శేషు

హిట్టు సినిమా కోసం ఎంతగానె పరితపిస్తున్న ప్రిన్స్‌ తాజాగా నటించిన చిత్రం 'కలి’. నరేష్‌ ఆగస్త్య (aresh Agastya) కీలక పాత్ర పోషించారు. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఆసక్తిగా సాగిన ట్రైలర్‌ సినిమాపై పాజిటివ్‌ వైబ్స్‌ క్రియేట్‌ చేసింది, కలి పురుషుడు అనే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ: (Kali movie Review)

శివరామ్‌ (ప్రిన్స్‌) యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. ఎవరన్నా తన చెంతకు వచ్చి సహాయం అడిగితే మరో ఆలోచన లేకుండా చేసేస్తుంటాడు. అందరికీ మంచి చేయాలనే అనుకుంటాడు. తన మంచితనం నచ్చి వేద (నేహాకృష్ణన్‌) తల్లిదండ్రులను కాదని శివరామ్‌ను పెళ్లాడుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల మంచిగా బతికే శివరామ్‌.. కష్టాలపాలవుతాడు. ఆస్తులు పోతాయి. భార్య కూడా వదిలివెళ్లిపోవడంతో ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. దీంతో కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్‌ అగస్త్య) ఎంట్రీ ఇస్తాడు అతనేం చేశారు. అతని రాకతో శివరామ్‌ జీవితం ఏమైంది అన్నది కథ.

విశ్లేషణ:

పుట్టినప్పుడే మనం ఎంతకాలం బతకాలనేది నిర్ణయిస్తాడు దేవుడు. కానీ మధ్యలోనే జీవితాన్ని చాలించడం వల్ల జీవితం పరిపూర్ణం కాదని, అలా చనిపోయిన వారి ఆత్మ ఈ లోకంలోనే తిరుగుతుందని చనిపోయాక కూడా బాధల్లోనే మునిగితేలతారని అందుకే ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్‌ కాదని సైౖకలాజికల్‌ థ్రిల్లర్‌గా చెప్పారు. ప్రస్తుత సమాజంలో నచ్చిన అమ్మాయి కాదందనో, అప్పుల బాధతోనో, నమ్మిన వారు మోసం చేస్తేనో ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నారు. ఈ చిత్రంలో కూడా అదే చేస్తాడు హీరో. తన మంచితనం నచ్చి పెళ్లి చేసుకున్న అమ్మాయి వదిలేసి వెళ్లిపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని ఫిక్స్‌ అవుతాడు. ఆ టైంలో కలిపురుషుడు ఎంట్రీ ఇచ్చి జీవిత సత్యాలను వెల్లడిస్తాడు. ఆత్మహత్య సరైన పని కాదని ఎన్నో సినిమాల్లో చూపించారు. కానీ ఇందులో చెప్పిన, చూపించిన విధానం ఇంప్రెసివ్‌గా ఉంది. కలియుగానికి అధిపతి అయిన కలి భూమ్మీదకు రావడం, చనిపోవాలనుకునే మనిషితో డిస్కషన్‌ పెట్టడమేంటి అనిపిస్తుంది గానీ ఆ సీన్స్‌ అని ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. సినిమా నిడివి గంటన్నరే. శివరామ్‌, కలి పాత్రల మధ్యే కథ నడుస్తుంది. తెరపై రెండు పాత్రలే కనిపించడంతో చూసిందే మళ్లీ మళ్లీ చూసిన భావన కలుగుతుంది.

నటీనటుల విషయానికొస్తే.. శివరామ్‌ పాత్రలో ప్రిన్స్‌ చక్కగా నటించారు. పాత్ర డెప్త్‌ మేరకు చక్కగా భావోద్వేగాలు పలికించాడు. కలి పురుషుడిగా చేసిన నరేశ్‌ అగస్త్య సెటిల్డ్‌ యాక్టింగ్‌ చేశాడు. వేదగా చేసిన నేహాకృష్ణన్‌ ఫర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రధారులు ఇలా వచ్చి అలా వెళ్లారు. బల్లిలాగా ప్రియదర్శి వాయిస్‌, బొద్దింకగా మహేశ్‌ విట్టా వాయిస్‌ వినోదాన్ని పండించాయి. కలి పురుషుడి మైండ్‌ గేమ్‌, అతని మాటలు ఆలోచింపజేస్తాయి. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. కెమెరా పనితనం రిచ్‌గా ఉంది. జేబీ సంగీతం టెక్నికల్‌ సినిమాకు ప్లస్‌ అయింది. ఎలాంటి కమర్షియల్‌ అంశాలు లేకుండా ఈ తరహా సినిమా చేయడం సవాలే. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ సూటిగా చెప్పాడు. అయితే నిడివి తక్కువైనా సెకెండాఫ్‌ ల్యాగ్‌ అనిపించింది. ఫస్టాఫ్‌లో ఉన్న స్పీడ్‌ సెకెండాఫ్‌లో కూడా ఉంటుంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి. కమర్షియల్‌గా ఎంతవరకూ వర్కవుట్‌ అవుతుందనేది పక్కన పెడితే కలి మనిషి జీవితంలో ఎలా భాగమవుతాడు అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడొచ్చు. దీనికి కొనసాగింపు కూడా ఉందని హింట్‌ ఇచ్చారు. అయితే అక్కడక్కడా టైమ్‌ నేపథ్యంలో సాగే బ్రో సినిమా గుర్తొస్తుంది.

ట్యాగ్‌లైన్‌: సో.. సో.. థ్రిల్లర్‌

Updated Date - Oct 04 , 2024 | 11:59 PM