Janaka Aithe Ganaka Review: ‘జనక అయితే గనక’ మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ

ABN, Publish Date - Oct 11 , 2024 | 09:15 AM

దసరా సీజన్ అనగానే సినిమాలకు ది బెస్ట్ సీజన్. ఈ సీజన్‌లో తమ సినిమాలను విడుదల చేయాలని స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా ప్రయత్నం చేస్తుంటారు. పండగకి పదిరోజుల ముందే ‘దేవర’ సినిమా వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడీ పండగను దృష్టిలో పెట్టుకుని వచ్చిన సుహాస్ ‘జనక అయితే గనక’ మూవీ ఎలా ఉందో.. ఈ ప్రీ రిలీజ్ రివ్యూలో తెలుసుకోండిక..

Janaka Aithe Ganaka Movie Review Poster

మూవీ పేరు: ‘జనక అయితే గనక’

విడుదల తేదీ: 12, అక్టోబర్ 2024

నటీనటులు: సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, గోపరాజు రమణ, ప్రభాస్ శ్రీను, రూప లక్ష్మీ తదితరులు

బ్యానర్: దిల్ రాజు ప్రొడక్షన్స్

సంగీతం: విజయ్ బుల్గానిన్

కెమెరా: సాయి శ్రీరామ్

ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్

ప్రొడక్షన్ డిజైనర్: అరసవిల్లి రామ్ కుమార్

నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి

రచన-దర్శకత్వం: సందీప్‌ రెడ్డి బండ్ల

‘బలగం’ సినిమాతో ఎస్‌విసి బ్యానర్‌కు ఎలాంటి వేల్యూ ఉందో.. అలాంటి వేల్యూనే దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ సంపాదించుకుంది. ఈ బ్యానర్‌పై ఎలాంటి సినిమాలను నిర్మాతలు తీయాలని అనుకుంటున్నారో.. ఆ సినిమా క్లారిటీ ఇచ్చేసింది. చిన్న బడ్జెట్‌లో ఒక మంచి సబ్జెక్ట్‌‌ని ప్రేక్షకుల చెంతకు చేర్చాలనే థాట్‌తో, కొత్త టాలెంట్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ధ్యేయంతో రూపుదిద్దుకున్న ఈ బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే కచ్చితంగా ఏదో ఒక కొత్త విషయం అయితే ఉంటుందని భావించేలా ఈ బ్యానర్ చేసిన అతి తక్కువ సినిమాలతో పేరు గడించింది. మరోవైపు టాలీవుడ్‌కు బ్యాక్‌బోన్ లాంటి నిర్మాతలు శిరీష్, దిల్ రాజు. భారీ సినిమాలను మేము చూసుకుంటామంటూ.. చిన్న సినిమాలను మీరు చూసుకోండి అంటూ తమ బిడ్డలకు ది బెస్ట్ రూట్‌ని ఈ బ్యానర్‌తో సెట్ చేసి పెట్టారు. ఇక ఇప్పుడున్న చిన్న హీరోలలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరో సుహాస్. వరుస చిత్రాలతో, వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ హీరోగా సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటున్నారు సుహాస్. ఈ సినిమాతో సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. టీజర్, ట్రైలర్, పాటలు వంటివి సినిమాపై ఇప్పటికే మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి. విడుదలకు ముందే వేసిన ప్రీమియర్స్, ప్రెస్ షో‌లకు వచ్చిన రెస్పాన్స్‌తో.. ఇండస్ట్రీకి ఈ బ్యానర్ నుంచి ఇంకో హిట్, ప్రేక్షకులకు మరో వైవిధ్యమైన కంటెంట్ ఈ సినిమా ఇవ్వబోతుందనేలా టాక్ వచ్చిన క్రమంలో.. అసలీ సినిమాలో ఉన్న మ్యాటరేంటి? నిజంగానే ఇది హిట్టు సినిమానా? ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అవుతుంది వంటి విషయాలను రివ్యూలో తెలుసుకుందాం. (Janaka Aithe Ganaka Movie Review)

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 


‘జనక అయితే గనక’ కథ:

ఈ సినిమా కథను టీజర్, ట్రైలర్స్‌తో పాటు.. ఇటీవల జరిగిన కొన్ని మీడియా సమావేశాల్లో నిర్మాత దిల్ రాజు వివరంగా చెప్పేశారు. అయినా సరే ఒకసారి కథలోకి వెళ్లివద్దాం. ప్రసాద్ (సుహాస్) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు. భార్య, తల్లి, తండ్రి, నాయనమ్మలతో హ్యాపీగా జీవిస్తుంటాడు. తండ్రి చేసిన చిన్న మిస్టేక్ కారణంగా మిడిల్ క్లాస్‌కి పరిమితమైన ప్రసాద్.. ఆ విషయంలో తండ్రి (గోపరాజు రమణ)ని ఎప్పుడూ ఆటపట్టిస్తుంటాడు. తన ఫ్యామిలీని నడిపించేందుకు ఓ వాషింగ్ మెషిన్ కంపెనీలో సేల్స్ అండ్ సర్వీసెస్ విభాగంలో జాబ్ చేస్తుంటాడు. పగలంతా డ్యూటీ, రాత్రయితే ఫ్రెండ్ లాయర్ పత్తి కిశోర్ (వెన్నెల కిశోర్)తో మందు పార్టీ. ఇప్పుడున్న కాస్ట్‌లీ ప్రపంచంలో పిల్లలను పెంచడం సాధ్యం కాదని, తన భార్య (సంగీర్తన)తో ఓ అండర్‌స్టాండింగ్‌‌కి వచ్చి పిల్లలు వద్దనుకుంటాడు. ఇంట్లోని పెద్దవాళ్లు పిల్లలు అంటూ గోల చేస్తుంటారు. అలా రెండు మ్యారేజ్ యానివర్సిరీలు పూర్తయిన తర్వాత ఓ రోజు సడెన్‌గా తన భార్య ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. దీంతో షాకైన ప్రసాద్.. సేఫ్టీ వాడినా, తన భార్య ఎలా ప్రెగ్నెంట్ అయిందనే దానిపై ఫ్రెండ్ పత్తి కిశోర్‌తో తను వాడిన కండోమ్ కంపెనీపై రూ. కోటి రూపాయలకు దావా వేస్తాడు. ఇలాంటి విషయంలో కోర్టుకు వెళ్లిన ప్రసాద్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఫ్యామిలీ, బయటి సమాజం ప్రసాద్‌ని ఎలా చూసింది? కోర్టులో విజయం సాధించాడా? సేఫ్టీ వాడినా తన భార్య ఎలా ప్రెగ్నెంట్ అయింది? అసలు తను కోర్టుకు వెళ్లడానికి కారణం ఇదేనా? ఇంకా వేరే ఏదైనా ఉందా? వంటి విషయాలకు సమాధానం తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. (Janaka Aithe Ganaka Movie Story)

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..



విశ్లేషణ:

మన నిత్యజీవితంలో ఎక్కడో ఒక చోట.. ‘రేపు నువ్వు తండ్రి అయిన తర్వాత తెలుస్తుంది లేరా?’ అనే మాట వింటాం. అంటే అర్థం.. పిల్లలను పెంచడం ఎంత కష్టమో? రేపు మీరు తండ్రి అయిన తర్వాత తెలుస్తుందని. ఒక కుటుంబ భారం మోయడంలో తండ్రి బాధ్యత ఏమిటనేది ఈ మాట తెలియజేస్తుంది. దర్శకుడు తన రియల్ లైఫ్‌లో చూసిన సంఘటనలతో ఈ కథను రెడీ చేసుకున్నాడని దిల్ రాజు చెప్పారు. రియలిస్టిక్ సంఘటనలు అయినప్పటికీ.. ఇలాంటి ఓ నేపథ్యంతో సినిమా చేయడం అనేది సాహసం అనే చెప్పాలి. పైకి పిల్లల పుట్టుకకు సంబంధించిన కథగా అనిపించినా.. అంతర్గతంగా దర్శకుడు ఇందులో లేవనెత్తిన విషయాలు మాత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. కానీ, అవి సినిమాకే పరిమితం అవుతున్నాయి తప్పితే.. నిజంగా ఎవరూ నిలబడి ఆలోచించడం లేదు. పోరాటం చేయడం లేదు. పెద్దవాళ్లు వేసుకునే చొక్కా ఖరీదు రూ. 500 ఉంటే, చిన్న పిల్లలు వేసుకునే చొక్కాకు తక్కువ క్లాత్, దారం వంటివి పడతాయి. అయినా రూ. 1500 ఎందుకు ఉంటుంది? ఇలా దర్శకుడు టచ్ చేసిన కొన్ని పాయింట్స్ చాలా మందికి ముఖ్యంగా మధ్యతరగతి వారికి బాగా కనెక్ట్ అవుతాయి. ప్రతి తండ్రి తన పిల్లలు తనకంటే బాగా బ్రతకాలని కోరుకుంటాడు. ఈ విషయంలో పేద, ధనిక అనే తేడాలుండవ్. పిల్లలకు తల్లిదండ్రులు ది బెస్ట్ ఇవ్వాలనే కోరుకుంటారు. ప్రసాద్ ఎందుకు పిల్లలు వద్దనుకుంటున్నాడనే విషయాన్ని.. తన తండ్రిని వెంటబెట్టుకుని మరీ చూపించిన తీరు కన్వెన్సింగ్‌గానే ఉంటుంది. కాకపోతే, కోర్టు డ్రామాలోనే దర్శకుడు అంతగా కన్వెన్స్ చేయలేదనిపిస్తుంది. ఒక సీరియస్ విషయాన్ని డిస్కస్ చేసే సమయంలో కూడా కామెడీని జోడించడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా జడ్జిగా చేసిన రాజేంద్రప్రసాద్.. జడ్జిగా కాకుండా ‘సరిలేరు నీకెవ్వరు’, ‘జులాయి’ పాత్రల కంటిన్యూటీగా అనిపిస్తుంది. సుహాస్ కోర్టు బోనును ఎందుకు టక్ టక్ టక్ మనీ కొడుతుంటాడో అర్థం కాదు. అలా కొట్టగానే ఆయనకు ఆలోచనలు వచ్చేస్తుంటాయి. అమ్మాయి, అబ్బాయి వంశాలలో విన్నర్స్ ఎవరూ లేరు కాబట్టి.. పిల్లలు వద్దని అనుకోవడం ఏమంత లాజిక్‌గా అనిపించదు. అలా అనుకుంటే జీవం, జీవనమే ఉండదు. అలాగే కోర్టులో ప్రభాస్ శీను, వెన్నెల కిశోర్‌ల పాత్రలతో చేసిన కామెడీ నవ్వు తెప్పించినా.. మరోవైపు అలాంటి ప్రదేశంలో అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంటుంది. ‘ఓ మై గాడ్ 2’ సినిమా కూడా ఇలాంటి కోర్ పాయింట్‌తోనే కోర్టు డ్రామా నడుస్తుంది కానీ.. ఇంత కామెడీగా అయితే ఉండదు. అలాగే ‘గోపాల గోపాల’ సినిమాలో వెంకటేష్ వేసే దావా కూడా ఈ తరహాదే కానీ.. ఇంత కామెడీగా చూపించరు. న్యాయస్థానాల విషయంలో కాస్త గౌరవాన్ని పాటిస్తే బాగుంటుంది. (Janaka Aithe Ganaka Movie)

Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ వాయిదా? ‘గేమ్ చేంజర్’ సంక్రాంతికి వచ్చినా సమస్యే?

అయితే అప్పటి వరకు కామెడీ చేసిన లాయర్స్ ప్రభాస్ శీను, వెన్నెల కిశోర్‌లు ఒక్కసారిగా నిజమైన లాయర్స్‌గా ప్రవర్తించే తీరు బాగుంటుంది. అలాగే, అప్పటి వరకు ప్రసాద్‌ని అసహ్యించుకునే అత్తగారు.. ఒక్కసారిగా మారిపోవడం, కుమార్తెను కోర్టుకు తీసుకురావడం కాస్త కృత్రిమంగా అనిపించినా.. దాని వెనుక ఇచ్చిన వివరణ మాత్రం చాలా బాగుంది. ఇక ఫస్టాఫ్‌లో మందు కొట్టే సీన్లు, సెకండాఫ్‌లో కోర్టు సీన్లు కాస్త ల్యాగింగ్ అనిపిస్తూ రిపీటెడ్ అయినట్లుగా అనిపిస్తాయి. ఆ విషయంలో దర్శకుడు ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. ఫస్టాఫ్‌లో సుహాస్ పాత్రని, ఫ్యామిలీని ప్రేక్షకులకు ఎక్కించడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు. ముఖ్యంగా వాషింగ్ మెషిన్ కంపెనీ సీన్లు చిరాకు పుట్టించే వరకు లాగాడు. ఇక సెకండాఫ్‌లో లాయర్‌గా మురళీ శర్మ వచ్చిన తర్వాత సినిమాలో సీరియస్‌నెస్ పెరుగుతుంది. అయితే అంత పెద్ద లాయర్ కేసు గెలవాలని ప్రయత్నించి, చివరికి రూ. 5 లక్షలు ఇప్పిస్తానని చెప్పడం ఏమంత కరెక్ట్‌గా అనిపించదు. ఇలా కొన్ని లాజిక్‌కు అందని సీన్లు చాలానే ఉన్నాయి. అయితే వెన్నెల కిశోర్, ప్రభాస్ సీన్ల కామెడీ వాటిని డామినేట్ చేస్తూ.. సినిమా చూస్తున్న ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తాయి. ‘ఆడవాళ్లు కడుపులో మోస్తారు.. మగవాళ్లు మైండ్‌లో మోస్తారు’ వంటి డైలాగ్స్‌కి థియేటర్లలో క్లాప్స్ పడతాయి. దర్శకుడు తను చెప్పాలనుకున్న విషయాన్ని కండోమ్‌కు, కోర్ట్‌కు కనెక్ట్ చేసి చాలా వరకు సక్సెస్ సాధించాడు కానీ.. కథనం విషయంలో కాస్త తడబడ్డాడనే చెప్పుకోవాలి. కానీ తను చెప్పాలనుకున్న విషయాన్ని వల్గారిటీకి తావివ్వకుండా.. సాధ్యమైనంత సహజంగా చెప్పగలిగినందుకు, చెప్పినందుకు మాత్రం అతడిని అభినందించాల్సిందే.


నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

సుహాస్ ఈ సినిమాకు కరెక్ట్ అనే దిల్ రాజు నిర్ణయం కరెక్టే. ప్రస్తుత సమాజంలో బాధ్యత కలిగిన ఒక మిడిల్ క్లాస్ యువకుడి ఆలోచనలు ఎలా ఉంటాయో.. ఆ ఆలోచనలకు అనుగుణంగా సుహాస్ పాత్రలో ఇమిడిపోయారు. ఆయన వరకు ఈ సినిమా ఒక మెట్టు ఎక్కించే చిత్రమే అవుతుంది. నిజంగా ఒక పెద్ద హీరో ఇలాంటి సినిమా చేస్తే.. ఇందులోని సమస్యలు ప్రభుత్వాల వరకు చేరే అవకాశం ఉంటుంది. కానీ, అంత సాహసం ఏ పెద్ద హీరో చేయలేడు. సుహాస్ వంటి నటులకు ఇలాంటి సినిమాలు మరింత గుర్తింపునిస్తాయనడంలో సందేహమే లేదు. హీరోయిన్ సంగీర్తన పాత్రను ఇంటికే పరిమితం చేశారు. భర్తకు సపోర్ట్ చేసే పాత్రలో ఆమె అభినయం చక్కగా ఉంది. కోర్టులో ఆమెకు వచ్చిన ఓ సన్నివేశం హైలెట్ అనేలా ఉంటుంది. ఆ సన్నివేశంలో ఆమె తన ప్రతిభను కనబరిచింది. ప్రసాద్ తండ్రిగా గోపరాజు వెంకట రమణ మంచి అభినయం కనబరిచారు. వెన్నెల కిశోర్ కామెడీ‌లో కాస్త ఛేంజ్ కనబడుతుంది. అలాగే ఈ సినిమాకు మరో మెయిన్ పిల్లర్ కూడా వెన్నెల కిశోరే. అలాగే ప్రభాస్ శీను కాసేపు తన చేష్టలతో నవ్విస్తాడు. మురళీ శర్మ పాత్రని హైలో ఊహించుకుంటే.. అంత లేదనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ జడ్జిగా కొన్ని సన్నివేశాల్లో కామెడీ చేసినా.. జడ్జిమెంట్ విషయంలో మాత్రం ప్రేక్షకులని తనవైపు తిప్పుకుంటారు. ప్రసాద్ నాయనమ్మగా చేసిన పాత్రకు మంచి ట్విస్ట్‌ని అప్పగించారు. ఇంకా ఇతర పాత్రలలో నటించిన వారంతా ఓకే.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. విజయ్ బుల్గానిన్ సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. అలాగే కెమెరా వర్క్ కూడా. ఎడిటింగ్ విషయంలో పీకే ఇంకాస్త పని కల్పించుకుని ఉంటే బాగుండేది. ఫస్టాఫ్‌లో కొన్ని, సెకండాఫ్‌లో కొన్ని సీన్లు రిపీట్ రిపీట్ అన్నట్లుగా ఉన్నాయి. నిర్మాతలు సినిమాను అనుకున్న బడ్జెట్‌లో రిచ్‌గా నిర్మించారు. దర్శకుడు సందీప్ రెడ్డి మొదటి సినిమాకు ఇలాంటి సబ్జెక్ట్‌ని సెలక్ట్ చేసుకోవడంతోనే ఆయన ధైర్యం ఏంటనేది తెలుస్తోంది. అయితే దర్శకుడిగా తను చెప్పాలనుకున్న పాయింట్‌ని సాధ్యమైనంతగా, వల్గారిటీకి తావులేకుండా చెప్పిన విధానం బాగుంది కానీ.. ఇది లేడీస్ ఎంత వరకు తీసుకుంటారనే దానిపై అసలు సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఓవరాల్‌గా అయితే.. మెసేజ్‌తో కూడిన కామెడీ, కోర్టు డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఈ దసరాకి టైమ్ పాస్ మూవీగా మార్కులు వేయించుకుంటుంది.

ట్యాగ్‌లైన్: ‘టికెట్స్ బుక్ చేసుకోండిక’

Also Read- Prabhas: ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. ఎప్పుడంటే

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 11 , 2024 | 09:25 AM