Revu Movie Review: రేవు మూవీ రివ్యూ
ABN, Publish Date - Aug 26 , 2024 | 06:30 PM
మత్స్యకారుల రోజువారీ జివితం నేపథ్యంలో అంతా కొత్త నటులు, టెక్నీషియన్స్‌తో తెరకెక్కించిన చిత్రం రేవు. ఆగస్టు23న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే..
సినిమా రివ్యూ: రేవు (Revu)
విడుదల తేదీ: 23-08-2024
నటీనటులు: వంశీరామ్ పెండ్యాల (Vamsi Ram Pendyala), అజయ్, స్వాతి భీమిరెడ్డి (Swathi Bheemireddy), హేమంత్ ఉద్భవ్ (Hemanth Udbhav), సుమేధ్ మాధవన్ (Sumesh Madhavan), యేపూరి హరి
సంగీతం: జాన్ కే జోషఫ్ (John K Joseph)
సినిమాటోగ్రఫీ: రేవంత్ సాగర్
ఎడిటర్: శివ శర్వానీ
నిర్మాతలు: గంజుపల్లి మురళి (Murali Ginjupalli), పారుపల్లి నవీన్ (Naveen Parupalli)
దర్శకత్వం: హరినాథ్ పులి (Harinath Puli)
ఈ వారం ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన మత్స్యకారుల రోజువారీ జివితం నేపథ్యంలో అంతా కొత్త నటులు, టెక్నీషియన్స్‌తో తెరకెక్కించిన చిత్రం రేవు. విడుదలకు ముందే చాలామంది సెలబ్రిటీలు ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్, సాంగ్స్ లాంచ్ ఈవెంట్లలో పాల్గొనడం, రేవు పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీలంటూ చిత్ర యూనిట్ చేసిన వినూత్న ప్రచారం సినిమాపై అంచనాలు తీసుకువచ్చాయి. ఈ క్రమంలో ఆగస్టు23న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే..
కథ.. పాలరేవు అనే ఓ కోస్తా ప్రాంతపు గ్రామంలో అంకులు (వంశీరామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) ఇద్దరు యువకులు కలిసి పెరిగి పెద్దయ్యాక పెళ్లిళ్లు చేసుకుని పక్కపక్క ఇండ్లల్లోనే ఉంటూ చేపల వేట వృత్తిగా జీవిస్తూ ఉంటారు. కానీ ఇద్దరు ఎప్పుడు ఎడమూహం పెడ మోహంగానే ఉంటూ తమ వృత్తిలో తరుచూ పోటీ పడుతుంటారు, పోట్లాడుకుంటుంటారు. వారికున్న నాటు పడవలతోనే రోజూ వేట సాగిస్తూ జీవిస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో ఆ ఊరిలోనే ఉండే నాగేశు అనే కాస్త డబ్బున్న వ్యక్తి తన ఆస్థినంతటిని అమ్మేసి ఓ పెద్ద బోటు తీసుకువచ్చి చేపల వేట మొదలు పెడతాడు. దీంతో అంకులు, గంగయ్యల వృత్తికి ఆటంకం ఏర్పడుతుంది. ఈక్రమంలో నాగేశు తమ్ముడి కొడుకు తయారు చేసిన మోటారు సాయంతో అంకులు, గంగయ్యలు తిరిగి తమ చేపల వేటను ముమ్మరం చేసి రాణిస్తారు. ఇది రుచించని నాగేశు తన తమ్ముడి కొడుకుని చంపేయడంతో అంకులు, గంగయ్యలిద్దరు కలిసి నాగేశుని అంతమొందిస్తారు. ఇక అంతా సాఫీగానే ఉంటుందని అనందంలో ఉండగా సడన్‌గా సైకిక్ మెంటాలిటీ ఉన్న నాగేశ్ ఇద్దరు కుమారులు ఊరిలోకి అడుగు పెడతారు. ఈ నేపథ్యంలో నాగేశ్ ఇద్దరు కుమారులు తర్వాత ఏం చేశారు.. అంకులు, గంగయ్య ఎలా ఎదుర్కొన్నారనే విషయాన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ..
మన టాలీవుడ్‌లో ఇప్పటికే సముద్ర తీరం, మత్స్యకారుల నేపథ్యలో చాలా సినిమాలే వచ్చి మెప్పించాయి. కానీ ఈ చిత్రం వాటికి భిన్నంగా రా అండ్ రస్టిక్ స్టోరీతో రూపొందించారు. ఎక్కడా హీరో ఎలివేషన్లు అని, బిల్డప్ షాట్లు వంటి వాటి జోలికి పోకుండా సాధారణ మత్స్యారులు ఎలా ఉంటారో అలాగే సినిమాను రూపొందించడం మెచ్చుకోదగ్గ విషయం. తమిళంలో ఎక్కువగా ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు మన వాళ్లు కూడా అలాంటి సినిమాలు తీయగలరని ఈ చిత్రం నిరూపించింది. ముఖ్యంగా బుర్రకథ ద్వారా సినిమాను ప్రారంభించిన విధానం కొత్తగా ఉంది. ఇక సినిమా అంతటికి ప్రాణం సెకండాఫ్‌లోనే ఉంది. నాగేశ్ కుమారుల ఎంట్రీ నుంచి సినిమా చాలా రక్తి కట్టిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగబోతుంది అనే భావనను తీసుకువస్తుంది. వాళ్లిద్దరి క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేసిన విధానం ఈమధ్య సౌత్‌లో ఏ సినిమాల్లోనూ లేని విధంగా క్రూయల్‌గా అద్బుతంగా ప్రజెంట్ చేశారు. అయితే సినిమా రెగ్యులర్ రివేంజ్ డ్రామా అవడం, హీరో, హీరోయిన్ పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉంటే బాగుంటుందనిపిస్తుంది. క్లైమాక్స్ ఫైట్ కాస్త భిన్నంగా, బావున్నప్పటికీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. సినిమా మొత్తానికి అక్కడక్కడ కొన్ని దర్శకత్వ తడబాట్లు ఉన్నా మంచి ప్రయోగం చేశారని చెప్పుకోవచ్చు.
నటీనటుల విషయానికొస్తే..
ఈ రేవు సినిమాలో నటనా పరంగా ఏ ఒక్కరినీ తప్పుపట్టేలా లేదు. ఒకరిద్దరు క్యారెక్టర్ నటులు తప్పితే హీరోతో సహా అంతా కొత్త వారే నటించినా ఎక్కడా తడబాటు లేకుండా వారి పాత్రల్లో ఒదిగిపోయారు. కథానాయిక స్వాతి భీమిరెడ్డి, విలన్‌గా చేసిన యేపూరి హరి, మళయాల నటుడు సుమేశ్ మాధవన్, అజయ్‌లు ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటారు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బావుంది. కానీ ఎడిటింగ్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా మెరుగ్గా ఉండేది.