Satyabhama Movie Review: కాజల్ పోలీసాఫీసర్ గా నటించిన సినిమా ఎలా ఉందంటే...

ABN , Publish Date - Jun 07 , 2024 | 05:22 PM

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసరుగా నటించిన సినిమా 'సత్యభామ', సుమన్ చిక్కాల దర్శకుడు. నేరపరిశోధాత్మక కథాంశంతో కూడుకున్న సినిమా ఎలా వుందో చదవండి

Satyabhama Movie Review: కాజల్ పోలీసాఫీసర్ గా నటించిన సినిమా ఎలా ఉందంటే...
Satyabhama Movie Review

సినిమా: సత్యభామ

నటీనటులు: కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, హర్షవర్ధన్, రవి వర్మ, సంపద, నాగినీడు, ప్రజ్వల్, అంకిత్ కొయ్య, తదితరులు

సంగీతం: శ్రీచరణ్ పాకాల

కథనం: శశికిరణ్ తిక్క

ఛాయాగ్రహణం: విష్ణు బేసి

నిర్మాతలు: బాబీ తిక్క, శ్రీనివాస రావు తక్కలపెల్లి

దర్శకత్వం: సుమన్ చిక్కాల

విడుదల తేదీ: జూన్ 7, 2024

రేటింగ్: 2 (రెండు)

-- సురేష్ కవిరాయని

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సత్యభామ'. ఈ సినిమాలో ఆమె ఒక పోలీసాఫీసర్ గా కనిపిస్తుంది. సుమన్ చిక్కాల దర్శకుడు. ఇంతకు ముందు 'మేజర్', 'గూఢచారి' లాంటి విజయవంతమైన సినిమాలకి దర్శకత్వం వహించిన శశికిరణ్ తిక్క ఈ సినిమాకి కథనం అందించారు. నందమూరి బాలకృష్ణ ఈ సినిమా ప్రీ విడుదల వేడుకకి రావటంతో ఈ సినిమాకి బాగా హైప్ వచ్చింది, ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Satyabhama Movie Review)

Satyabhama Story కథ:

హైదరాబాదులోని 'షీ' టీముకి నాయకత్వం వహిస్తుంది ఏసీపీ సత్యభామ (కాజల్ అగర్వాల్). ఆడవారిపై ఎటువంటి హింస జరిగినా 'షీ' యాప్ తమ మొబైల్స్ లో డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి అది క్లిక్ చేస్తే చాలు, పోలీసులు వచ్చి ఆ మహిళని కాపాడతాము అని చెపుతారు. హసీనా అనే ఆమెని, ఆమె భర్త యదు హింసిస్తూ ఉంటాడు, హసీనా ఏసీపీ సత్యభామకు వచ్చి చెపుతుంది. ఇంకోసారి ఆమెపై ఎటువంటి అత్యాచారం జరిగినా వెంటనే కాల్ చెయ్యమని హసీనాకి తన నంబర్ ఇస్తుంది సత్యభామ. పోలీసులకి చెప్పిందని, హసీనాపై మరోసారి దాడి చేస్తాడు ఆమె భర్త. ఏసీపీ సత్యభామ వెళ్లి హసీనాని కాపాడేలోగా ఆమెని చంపేస్తాడు యదు. (Satyabhama Review) ఎలా అయినా యదుని పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న సత్యభామకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హసీనా తమ్ముడు ఇక్బాల్ (ప్రజ్వల్) ఎందుకు టెర్రరిస్ట్ గా మారాల్సి వచ్చింది? రాజకీయ నాయకుడి (రవివర్మ) అన్న కొడుకు రిషి (అంకిత్ కొయ్య)కి సత్యభామ పరిశోధిస్తున్న కేసుకి ఏంటి సంబంధం? చివరికి ఏమైంది తెలియాలంటే 'సత్యభామ' చూడండి.

satyabhama.jpg

విశ్లేషణ:

సుమన్ చిక్కాల మొదటిసారిగా దర్శకత్వం చేసిన సినిమా ఈ 'సత్యభామ'. అలాగే కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా. మామూలుగా నేర పరిశోధన సినిమాలు ఈమధ్య చాలా వచ్చాయి. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇంతకు ముందు 'గూఢచారి', 'మేజర్' లాంటి సినిమాలకి దర్శకత్వం వహించిన శశికిరణ్ తిక్క ఈ సినిమాకి కథనం అందించటం. అందుకని ఈ సినిమాపై కొంచెం ఆసక్తి పెరిగింది. సినిమా మొదలెట్టడం కూడా ఆసక్తికరంగానే మొదలెడుతూ, 'షీ' టీమ్స్ ఎలా పనిచేస్తాయో చూపించారు. అలాగే యదు అనే అతను తన భార్యని చంపి పారిపోతాడు, హంతకుడి కోసం సత్యభామ పరిశోధన చేస్తూ ఉంటుంది. ఇంతవరకు బాగానే వుంది. కొంచెం అటు, ఇటుగా మొదటి సగం నడిపించారు. (Satyabhama Movie Review)

కానీ రెండో సగంలోనే దర్శకుడు సుమన్, శశికిరణ్ ఇద్దరూ సరైన దృష్టి సారించలేదు. చాలా ట్విస్టులు పెట్టారు, వాటితోపాటు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు. దర్శకుడికి కొత్తగా అనిపించినా, ఇవన్నీ ప్రేక్షకుడిని గందరగోళానికి గురిచేసేస్తాయి. ఎందుకంటే హసీనా తమ్ముడు ఇక్బాల్ కూడా ఒక్కసారిగా మాయం అయిపోతాడు, మళ్ళీ ఒకసారి దెబ్బలతో కనపడతాడు, హాస్పిటల్ లో చేర్పిస్తారు. లేవలేకపోతున్నవాడు కూడా ఒక ఇంజెక్షన్ తీసుకొని హాస్పిటల్ నుంచి తప్పించుకుంటాడు. ఇవన్నీ చాలా సినిమాటిక్ గా వున్నా, ఆ ట్విస్టులు, వాటి ఫ్లాష్ బ్యాక్ లు మాత్రం పొంతన ఉండదు. అది నేరుగా చెప్పేసి ఉంటే బాగుండేది ప్రేక్షకుడికి. కానీ అలా చెయ్యకుండా ఏదేదో చేశారు. (Kajal Aggarwal starrer Satyabhama Movie Review)

పతాక సన్నివేశాలు అయితే మరీ జోకులా ఉంటుంది. కనీసం తన డిపార్టుమెంటులో ఎవరికీ చెప్పకుండా విలన్స్ కి ఏసీపీ కావాలనే లొంగిపోయిందట, అమ్మాయిలని విడిపించాక, అందులో ఒకమ్మాయి యాప్ క్లిక్ చేసిన నిమిషాల్లో వచ్చేస్తారు. శశికిరణ్ తిక్క కథనం కొత్తగా చెయ్యాలను అనుకున్నారేమో, కానీ అది ఈ సినిమాకి బెడిసి కొట్టింది అనే చెప్పాలి. అదీ కాకుండా ఏసీపీ సంవత్సరం అయినా ఈ ఒక్క కేసుపైనే పరిశోధన చెయ్యడం విడ్డూరంగానే ఉంటుంది. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు చూస్తూ ఎదో చేసెయ్యాలి అనుకుని ఈ సినిమా కథ అల్లినట్టున్నారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఒక అబ్బాయి ఎవరి సీసీ కెమెరా కావాలంటే వాళ్ళది నిముషాల్లో హాక్ చేసేస్తూ ఉంటాడు. ఎక్కడ కావాలంటే అక్కడిది సీసీ ఫుటేజ్ చూసేస్తూ వుంటారు. కొంచెం కథపై దృష్టి పెట్టి, నేరుగా నెరేషన్ చూపిస్తే బాగుండేది.

kajalaggarwalsatyabhama.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ మొదటిసారిగా ఇలాంటి మహిళా ప్రాధాన్యమున్న సినిమాలో చేసింది. ఆమె చక్కగా చేసి చూపించింది. ఈ సినిమా ఏమైనా ఆడుతుంది అంటే అందుకు కారణం మాత్రం కాజల్ అగర్వాల్ నటన, ఆమె తన పాత్రలో చూపించిన గాంభీర్యం, సినిమాని తన భుజాలపై మోసింది అని చెప్పొచ్చు. చోటుగా నటించిన ప్రజ్వల్ ఎగ్మా, రిషి పాత్రలో నటించిన అంకిత్ కొయ్య బాగా చేశారు. మిగతా పాత్రల్లో చాలామంది వారి పాత్రల పరిధిమేరకి నటించారు. సంగీతం పరవాలేదు, ఛాయాగ్రహణం కూడా ఒకే.

చివరగా, 'సత్యభామ' సినిమాలో చాలా లోపాలున్నాయి, కథ సరిగా లేదు, ట్విస్టులు ఎక్కువయ్యాయి, అలాగే ఆ ట్విస్టులకి తోడు వాటి ఫ్లాష్ బ్యాక్ లు కూడా గందరగోళంగా ఉంటాయి. కాజల్ అగర్వాల్ నటన అందరినీ మెప్పిస్తుంది, ఆమె ఈ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు.

Updated Date - Jun 08 , 2024 | 09:55 PM