Martin Review: ధృవ సర్జా నటించిన ‘మార్టిన్’ ఎలా ఉందంటే...
ABN, Publish Date - Oct 11 , 2024 | 07:59 PM
దృవ సర్జా కథానాయకుడిగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. నాలుగేళ్లుగా సెట్స్ మీదున్న ఈ చిత్రం దసరా సందర్భంగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా అందించిన కథతో ఈ సినిమా రూపొందింది.
సినిమా రివ్యూ: 'మార్టిన్' (martin)
విడుదల తేదీ: 11–10–2024
నటీనటులు: ధృవ సర్జా, వైభవి శాండిల్య, అన్వేషి జైన్, సుకృత వాగ్లే, మాళవిక అవినాష్, అచ్చుత్ కుమార్, తదితరులు
సాంకేతిక నిపుణులు:
కథ: అర్జున్ సర్జా
సినిమాటోగ్రఫీ: సత్యాహెగ్డే
ఎడిటింగ్: కె.ఎమ్.ప్రకాశ్, మహేష్ ఎస్ రెడ్డి
సంగీతం: మణిశర్మ,
నేపథ్య సంగీతం: రవి బస్రూర్
నిర్మాత: ఉదయ్ కె మెహతా
దర్శకత్వం: ఏపీ అర్జున్ (Ap Arjun)
దృవ సర్జా కథానాయకుడిగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. నాలుగేళ్లుగా సెట్స్ మీదున్న ఈ చిత్రం దసరా సందర్భంగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా అందించిన కథతో ఈ సినిమా రూపొందింది. ‘కేజీయఫ్’ స్థాయి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అదే స్థాయిలో ప్రమోట్ చేసి పాన్ ఇండియా సినిమాగా విడుదల చేశారు. ఈ చిత్రం ఎలా ఉంది? పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించగలిగిందా? లేదా అన్నది రివ్యూలో చూద్దాం.
కథ: (Martin Movie Review)
అర్జున్ (ధృవ సర్జా) ఓ పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్‌గా పని చేస్తుంటారు. నిజాయతీతో పాటు దేశభక్తి అమితంగా ఉన్న అధికారి అతను. ఓ ఆపరేషన్ కోసం పాకిస్థాన్ వెళ్లగా అనుకోని పరిణామాలు ఎదురై తానెవ్వరో కూడా మరచిపోతాడు. తనెవరో తెలుసుకునే క్రమంలో తనకి సాయం చేసిన వాళ్లంతా చనిపోతుంటారు. ఇండియాలో తనతో కలిసి పనిచేసిన స్నేహితులు కూడా హత్యలకి గురవుతుంటారు. కొన్నాళ్లకు అర్జున్ ప్రేమించిన ప్రీతి (వైభవి శాండిల్య) ప్రాణాలు కూడా రిస్క్‌లో పడతాయి. కష్టం మీద ఇండియాకి తిరిగొచ్చాక అర్జున్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అసలు ఈ కథలో మార్టిన్ ఎవరు? అతనికీ, అర్జున్‌కీ సంబంధం ఏమిటి? వీళ్లిద్దరి లక్ష్యం ఏంటి? అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నీ పాన్ ఇండియా మోజులో ఉన్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. కథపై పెద్ద ఫోకస్ పెట్టకుండా.. భారీతనం, కళ్లు చెదిరే విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ఇవే ముఖ్యంగా సినిమాలు తీస్తున్నారు. అలాంటిదే మార్టిన్ చిత్రం. లార్జర్ దేన్ లైఫ్ అనేలా ఖర్చు చేసి ఈ సినిమా తీశారు. సీనియర్ యాక్టర్ అర్జున్ రాసిన కథలో దమ్ము లేదు. కన్‌ఫ్యూజింగ్ కథ, ఎటు పోతుందో తెలియని కథనంతో చిందరవందర చేసేశాడు దర్శకుడు. కమర్షియల్ హంగలును మాత్రమే దర్శకుడు దృష్టిలో పెట్టుకుని తీశాడా? అన్నట్లు ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు, కాస్ట్‌లీ సెటప్‌లు, విరోచిత విన్యాసాలు సినిమా పొడవునా వస్తుంటాయి.. వెళ్తుంటాయి. కానీ ఏ ఒక్కటీ ఆడియన్ మైండ్‌లో రిజిస్టర్ కావు. సినిమా ప్రారంభమే యాక్షన్‌తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫైట్ దాదాపు 16 నిమిషాలకు పైనే. రణగొణ ధ్వనులతో ప్రేక్షకుడి సహనానికి పరీక్షే. ఇందులో హీరోహీరోయిన్‌కి ప్రేమ కథ ఉంది. దేశ భక్తి ఇతివృత్తం ఉంది. కానీ వాటి తాలుక భావోద్వేగాలు ఎక్కడా కనిపించలేదు. పాకిస్థాన్‌లో మొదలైన కథ మంగుళూరుకు చేరుకోగానే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. దాని వల్ల సెకెండాఫ్‌పై కాస్త ఆసక్తి కలిడించేదిగా ఉంది. కానీ స్ర్కీన్‌ప్లేలో క్లారిటీ లేకపోవడంతో ద్వితీయార్థం కూడా గందరగోళంగానే సాగింది. కేవలం క్లైమాక్స్ మాత్రం ఇంతో అంతో ఆసక్తిగా సాగింది. (Martin Movie Review)
నటీనటుల విషయానికొస్తే... (Martin Movie Review)
ధృవసర్జా యాక్షన్ హీరోగా మెప్పించాడు. సినిమా స్పాన్‌కు తగ్గట్లే రెండు పాత్రలను తీర్చిదిద్దారు. పోరాట ఘట్టాలు మాత్రం పేరు పెట్టేలాలేవు. హీరోయిన్ వైష్ణవి పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేదు. నటనకు ప్రాధాన్యం కల్పించలేదు. కేవలం గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఇతర నటీనటులు పాత్రల మేరకు నటించారు. అన్వేషి జైన్ గ్లామర్‌కే పరిమితమైంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా వర్కింగ్ అవుట్ స్టాండింగ్. గ్రాఫిక్స్ అయితే వండర్‌ఫుల్. రవి బస్రూర్ బ్యాగ్రౌండ్ స్కోర్ యాక్షన్ పార్ట్‌కు మంచి ఎలివేషన్ ఇచ్చింది. వీటి అన్నింటి మీద దృష్టి సారించిన దర్శకుడు అర్జున్ తెరకెక్కించే విధానంపై ఇంచు కూడా దృష్టి పెట్టలేదనిపిస్తుంది. ఎన్నో చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ తరహా కథ ఎలా రాశారో అర్థం చేసుకోవడం కష్టం. రచయితగా ఆయన జడ్జిమెంట్ ఫెయిల్ అయింది. ఈ చిత్రానికి భారీగా బడ్జెట్ ఇచ్చిన నిర్మాతలకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. భారీతనం కోసం విపరీతంగా ఖర్చు చేశారు. అతి ప్రతి ఫ్రేములోనూ కనిపించింది. ట్విస్ట్‌లు యాక్షన్ సన్నివేశాలు, సాంకేతిక హంగులు సినిమాకు ప్లస్ కాగా, ఆసక్తి రేకెత్తించని కథ, కథనం, ఎమోషన్స్ లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. మాస్ చిత్రాల్లో లాజిక్స్ వెతకడం కరెక్ట్ కాదు. యాక్షన్, ఎక్స్‌పోజింగ్, భారీ ఫైట్స్, మాస్ ఎలిమెంట్స్ కలగలిపి సినిమా తీసేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారనుకోవడం పొరపాటే. (Martin Movie Review)
ట్యాగ్‌లైన్: యాక్షన్ ప్రియులకూ కష్టమే!