Dhoom Dhaam Review: చేతన్ కృష్ణ నటించిన 'ధూమ్ ధామ్' రివ్యూ

ABN, Publish Date - Nov 08 , 2024 | 10:28 PM

హీరోగా చేతన్‌ మద్దినేని ఇప్పటికే నాలుగైతు చిత్రాల్లో హీరోగా నటించాడు. ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ సారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ధూం ధాం’తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి అతని ప్రయత్నం ఏమేరకు ప్రేక్షకుల్ని మెప్పిచింది.. ధూంధాం నిజంగానే దుమ్ము రేపిందా అన్నది రివ్యూలో చూద్దాం.

సినిమా రివ్యూ: 'ధూం ధాం' (Dhoom Dhaam movie review)


విడుదల తేది: 8–11–2024


నటీనటులు: చేతన్‌ కృష్ణ, హెభా పటేల్‌, సాయికుమార్‌, బెనర్జీ, గోపరాజు రమణ, వెన్నెల కిశోర్‌, శివన్నారాయణ, గిరి, నవీన్‌నేని, భద్రమ్‌ తదితరులు.

సాంకేతిక నిపుణులు 


కథ –స్క్రీ: గోపీమోహన్‌
కెమెరా: సిద్ధార్థ్‌ రామస్వామి
సంగీతం: గోపీ సుందర్‌
ఎడిటింగ్‌: అమర్‌రెడ్డి కుడుముల
నిర్మాత: ఎం.ఎస్‌.రామ్‌కుమార్‌


దర్శకత్వం: సాయికిశోర్‌ మచ్చ(Sai Kishore macha)

సినిమా ఇండస్ట్రీకి కొత్త నీరు రావాలి అంటుండే వారు దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు. ఇండస్ట్రీకి కొత్త కథలు, దర్శకనిర్మాతలు వచ్చినప్పుడే ఇండస్ట్రీ కళకళలాడుతుందని ఆయన తరచూ చెబుతుండేవారు. గత కొన్నేళ్ల చూస్తే చిత్ర రంగానికి కొత్త నీటి హవా ఎక్కువ నడుస్తోంది. కంటెంట్‌ బావుంది అనిపిస్తే కొత్త, పాత అని ఏమీ లేదు. ఆడియన్స్‌ బ్రహ్మరథం పడుతున్నారు. హీరోగా చేతన్‌ మద్దినేని ఇప్పటికే నాలుగైతు చిత్రాల్లో హీరోగా నటించాడు. ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ సారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ధూం ధాం’తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి అతని ప్రయత్నం ఏమేరకు ప్రేక్షకుల్ని మెప్పిచింది.. ధూంధాం నిజంగానే దుమ్ము రేపిందా అన్నది రివ్యూలో చూద్దాం.

కథ: (Dhoom Dhaam movie review)
కార్తీక్‌ (చేతన్‌ కృష్ణ), రామరాజు (సాయికుమార్‌) తండ్రీ కొడుకులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. తండ్రి మాటలను ఇంచు కూడా దాటడు కార్తీక్‌. ప్రతీ విషయంలోనూ తన కొడుకే నెంబర్‌ వన్‌గా ఉండాలన్నది రామరాజు కోరిక.  అయితే.. వీరిద్దరి మధ్య ఓ అమ్మాయి ప్రవేశిస్తుందని, వాళ్ల వల ఒకరికి ఒకరు దూరం అవుతారని ఓ జ్యోతిష్యుడు (ఫృథ్వీ) చెబుతాడు. అనుకొన్నట్టుగానే సుహానా (హెబ్బా పటేల్‌) కార్తీక్‌కు పరిచయం అవుతుంది. తనతో ప్రేమలో పడతాడు. సుహానా వల్ల ఈ తండ్రీ కొడుకులు విడిపోయారా? అసలేం జరిగింది అన్నది కథ.


విశ్లేషణ: 

రెండు కుటుంబాలు, పెళ్లి నేపథ్యంలో సాగే సింపుల్‌ కథ ఇది. అయితే ఇందులో చాలా లేయర్లు ఉన్నాయి.  తండ్రీ కొడుకుల మధ్‌య అనుబంధంతో మొదలైన కథ నుంచి టిపికల్‌ లవ్‌స్టోరీ వైపు వెళ్తుంది. కథానాయిక ఆడిన దాగుడుమూతలు చూస్తే విమెన్‌ సెంట్రిక్‌ సినిమాలాగా అనిపిస్తుంది. ఆ తరవాత వీరిద్దరి కథలో మరో అమ్మాయి అడుగుపెడుతుంది. దాంతో కథ ట్రయాంగిల్‌ స్టోరీలా అనిపిస్తుంది. తదుపరి ఓ ఊరు, అక్కడ రథం, ఓ విగ్రహం పోవడం ఇలా రకరకాలా ట్రాక్‌లు తెరపైకి వస్తాయి. అయితే ఇక్కడ దర్శకుడు ఏదో ఒక అంశాన్ని తీసుకోకుండా వరుసగా నాలుగైదు ట్రాక్‌లు తీసుకుని కంగాళీ చేశాడు. ఇవన్నీ తెరపై వన్‌ బై వన్‌ చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఊరి కథ, విగ్రహం ఎపిసోడ్‌ను ఎలివేట్‌ చేసుంటే కథ ఒక ఫ్లోలో నడిచేది.  ఆ సీన్‌ను సింపుల్‌గా చూపించి వదిలేశారు. అక్కడితో ఫస్టాఫ్‌ సోసోగా సాగిన భావన కలుగుతుంది.. ద్వితీయార్థంలో పెళ్లి ఎపిసోడ్‌ జోష్‌ తీసుకొస్తుంది. సందర్భం ఏదైనా ‘ఎక్స్‌ప్రెషన్‌ ముఖ్యం’ అంటూ వెన్నెల కిశోర్‌ చేసే సన్నివేశాలు వినోదాన్ని పంచాయి.  

ముఖ్యంగా ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణలను ఇమిటేట్‌ చేసిన సన్నివేశం హిలేరియస్‌గా నవ్వించింది. పెళ్లి అనుకున్నప్పటి నుంచి తెరపై కనిపించే ప్రతి పాత్ర చక్కని కామెడీ పంచింది. ఈ సినిమాకు గోపీ మోహన్‌ రచయితగా వ్యవహరించారు. ఆయన తాలుక హ్యూమర్‌ బాగానే కనిపించింది. సెకండాఫ్‌లో శ్రీను వైట్ల సినిమాల సన్నివేశాలను పోలిన సన్నివేశాలు కనిపించాయి. సంగీత్‌ తర్వాత వచ్చే మందు సిట్టింగ్‌ సీన్‌ చూస్తే ఢీ సినిమాలో బ్రహ్మానందం సన్నివేశం గుర్తొస్తుంది. పోలిక ఉన్నా వెన్నెల కిశోర్‌ వల్ల ఫన్‌ అయితే క్రియేట్‌ అయింది. విలన్‌ గ్యాంగ్‌ మధ్యన హీరో ఉంటూ, వాళ్లతో ఆడుకోవడం అనే ఫార్ముల కూడా ఇందులో కనిపించింది. గోపీ మోహన్‌ ఆ సన్నివేశాల్ని ఇప్పటికి వదలలేకపోతున్నారనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో యూరప్‌ ఎపిసోడ్‌ రొటీన్‌గా అనిపిస్తుంది. ఇంకా బాగా రాసుకుని ఉంటే బావుండేది.  ఇంట్రవెల్‌ బ్యాంగ్‌ లో ఓ ఛేజ్‌ ఉంటుంది. హీరో గ్యాంగ్‌ను రౌడీలు వెంబడిస్తాఉ. వారి సేవ్‌ అయ్యే సీన్‌ అతికినట్లు ఉండదు.  


నటీనటుల విషయానికొస్తే..
చేతన్‌ ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. కానీ ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలో అతను చాలా ఇంప్రూవ్‌ కావాలి. తెర నిండా సీనయిర్‌ ఆర్టిస్ట్‌లు చాలామందే ఉన్నారు. వారిలో చేతన్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, డైలాగ్‌ డెలివరీలో తేలిపోయినట్లు అనిపిస్తుంది. అందంగా ఉన్నాడు, యాక్టింగ్‌ ఈజ్‌ ఉంది. అయితే కాస్త బెటర్‌మెంట్‌ ఉండాలి. హెబ్బా పటేల్‌ హీరోయిన్‌గా యాప్ట్‌గా అనిపించలేదు.  మంచి తండ్రిలా సాయి కుమార్‌ చక్కని నటనే ప్రదర్శించారు. భూపతి బ్రదర్స్‌లో గోపరాజు రమణ చక్కని నటన కనబర్చారు.  బెనర్జీ లాంటి సీరియర్‌ నటుడిని పట్టుకొని ునీ ఫేస్‌ లో ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ కూడా పలికి చావదు’ అని మాటి మాటికీ వెన్నెల కిషోర్‌తో అనిపించడం టూమచ్‌గా అనిపిస్తుంది. ఏ మాటకామాటే సెకెండాఫ్‌ అంతా వెన్నెల కిశోర్‌ తన భుజాన వేసుకున్నాడు. అతను తెరపై కనిపించిన  ప్రతిసారీ రీఫ్రెష్‌గా అనిపిస్తుంది. అతని టైమింగ్‌ సినిమాకు ఎసెట్‌గా నిలిచింది. ప్రవీణ్‌; గిరి, నవీన్‌ తదితరులు పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్‌గా, విజువల్‌గా సినిమా గ్రాండ్‌గా ఉంది. ముఖ్యంగా కెమెరా వర్క్‌ గురించి మాట్లాడుకోవాలి. సినిమాటోగ్రాఫర్‌ ప్రతి సన్నివేశాన్ని కలర్‌ఫుల్‌గా తెరకెక్కించారు. కెమెరా పనితనం సినిమాకు గ్రాండియర్‌ తీపుకొచ్చింది. ఇది చిన్న సినిమా అనే భావన ఎక్కడా కలగలేదు. ఎలాంటి సినిమాకైనా మినిమమ్‌ గ్యారెంటీ మ్యూజిక్‌ ఇచ్చే గోపీ సుందర్‌ ఈ సినిమాకు సంగీతం అందించడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఆర్‌ఆర్‌ కూడా చక్కగా కుదిరింది. సంగీత్‌ పాట మాస్‌కి విపరీతంగా నచ్చుతుంది. విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా సినిమాకు  వెళ్తే కాసేపు నవ్వుకుని బయటకు రావచ్చు.  

ట్యాగ్‌లైన్‌: నవ్వులు గ్యారెంటీ

Updated Date - Nov 10 , 2024 | 08:51 PM