40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Captain Miller Review: ధనుష్ డబ్బింగ్ సినిమా ఎలా ఉందంటే...

ABN, Publish Date - Jan 27 , 2024 | 01:09 PM

తమిళనాడులో ముందుగా విడుదలై అక్కడ మిశ్రమ స్పందన వచ్చిన 'కెప్టెన్ మిల్లర్' సినిమా ఇక్కడ తెలుగులో అదే పేరుతో విడుదలైంది. ధనుష్ ఇందులో కథానాయకుడు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, తెలుగు నటుడు సందీప్ కిషన్ ఇందులో ప్రత్యేక పాత్రల్లో కనపడతారు. అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాల ఎలా వుందో చదవండి.

Captain Miller movie review

సినిమా: కెప్టెన్ మిల్లర్

నటీనటులు: ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కిషన్, శివరాజ్ కుమార్, నివేదిత సతీష్ తదితరులు

ఛాయాగ్రహణం: సిద్థార్థ్ నూని

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్

రచన, దర్శకత్వం: అరుణ్ మతీశ్వరన్

నిర్మాణ సంస్థ: సత్యజ్యోతి ఫిలిమ్స్

విడుదల తేదీ: జనవరి 26, 2024

రేటింగ్: 2

-- సురేష్ కవిరాయని

తెలుగు సినిమాలు ఈ వారం కూడా పెద్దగా ఏమీ లేకపోవటంతో తమిళ సినిమా 'కెప్టెన్ మిల్లర్' అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా తమిళంలో సంక్రాంతికి అంటే జనవరి 12న విడుదల చేశారు. అక్కడ ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇది ఒక పీరియడ్ డ్రామా, బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్న రోజులనాటి కథ. ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, తెలుగు నటుడు సందీప్ కిషన్ ప్రత్యేక పాత్రల్లో కనపడతారు. ఈ సినిమాకి కథతో పాటు దర్శకత్వం కూడా అరుణ్ మతీశ్వరన్ చేశారు. ధనుష్ కెరీర్ లో ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ పెట్టిన తీసినది.

కథ:

ఈ కథ బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్న రోజుల్లో, సంస్థానాలు, రాచరికాలు కూడా వున్న ప్రదేశంలో, సుమారు 1930లో జరిగే కథ. అగ్నీశ్వర (ధనుష్) ఒక గ్రామంలో తన తల్లితో ఉంటూ ఉంటాడు, కానీ అతనికి, అతని సహచరులకు ఆ గ్రామంలో కుల వివక్ష కారణంగా గుడిలోకి అడుగుపెట్టనీయరు. కనీసం గౌరవం సంపాదించాలంటే సైన్యంలో చేరితే వస్తుంది అని బ్రిటిష్ సైన్యంలో చేరతాడు. బ్రిటిష్ ప్రభుత్వం అందరికీ పేర్లు మారుస్తూ ఉంటుంది, ఇతనికి మిల్లర్ అని కొత్త పేరు ఇస్తారు. బ్రిటిష్ సైన్యంలో ఉంటూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారతీయుల్ని చంపుతాడు మిల్లర్, అలా కొంతమందిని చంపాక కోపం వచ్చి తన పై వున్న బ్రిటిష్ అధికారిని చంపేస్తాడు. బ్రిటిష్ ప్రభుత్వం మిల్లర్ ని పట్టుకోబోతే తోటి సైనికుడు రఫీక్ (సందీప్ కిషన్) సాయంతో తప్పించుకుంటాడు. అక్కడి నుంచి అగ్నీశ్వర అలియాస్ మిల్లర్ దొంగగా మారతాడు. ఒకసారి అగ్నీశ్వరని సిపాయిల బారి నుంచి ఆ ఊరి మహారాజు కుటుంబానికి చెందిన అమ్మాయి భానుమతి (ప్రియాంక అరుల్ మోహన్) రక్షిస్తుంది. దొంగగా మారిన మిల్లర్ కి ఊరి గుడిలోని విగ్రహాన్ని దొంగిలించి తెమ్మని చెపుతారు, అతను సరే అంటాడు. ఇంతకూ మిల్లర్ దొంగతనం చేసిన ఆ విగ్రహం ఎవరిది? దానికి ఆ ఊరుకి సంబంధం ఏంటి? శివన్న (శివరాజ్ కుమార్) ఎవరు, అతని పాత్ర ఏంటి? శివన్నకి, మిల్లర్ కి ఎటువంటి సంబంధం వుంది, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే?

విశ్లేషణ:

కెప్టెన్ మిల్లర్ సినిమా కథ పేపర్ మీద పెడితే చదవటానికి బాగుంటుంది. ఇందులో రెండు ప్రాధాన్యాలు వున్నాయి. ఒకటి ఒక వూరిలో కులం పేరు మీద జరుగుతున్న వ్యతిరేకత, ఆ వూర్లో బ్రిటిష్ వారి అండతో రాచరికాలు ఇంకా రాజ్యం ఏలడం, గుడిలోకి ఒక కులం వాళ్ళు రావడానికి పనికి రాదు అని అడ్డు చెప్పడం. అది చూసి అగ్నీశ్వర అనే యువకుడు ఏదైనా చెయ్యాలని అనుకుంటాడు, బ్రిటిష్ సైన్యంలో చేరితే గౌరవం వస్తుంది, అప్పుడు మళ్ళీ ఏదైనా చెయ్యాలని అనుకుంటాడు. ఇంకో వర్గం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వంతత్రం కోసం పోరాటం చెయ్యడం. ఇలా రెండు వర్గాలు కలిసి పోరాటమే అంతిమ లక్ష్యంగా ఉంటాయి. అయితే అగ్నీశ్వర అనే యువకుడు సైన్యంలో చేరాక వాళ్ళనే చంపుకోవటం చూసి చలించిపోయి, బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరుగుతాడు. ఈ నేపథ్యంలోనే తన గ్రామంలో వుండే వాళ్ళు గుడిలోకి ప్రవేశం కలగాలంటే ఏదైనా చెయ్యాలి అనుకోని దొంగతనం చెయ్యడానికి పూనుకుంటాడు. ఇంకో పక్క రెండో వర్గం వాళ్ళు కూడా అగ్నీశ్వరతో చేతులు కలుపుతారు. ఇవన్నీ కథగా పేపర్ మీద బాగుంటుంది. కానీ ఇది తెరమీద చూపించటంలోనే దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు.

కుల వ్యవస్థ, పోరాటాలు సినిమా ప్రారంభం అవటం బాగానే వుంది, కానీ ఆ తరువాతే గాడి తప్పుతుంది. ఫ్లాష్ బ్యాక్ లోకి కథ రావటం, మళ్ళీ ముందుకి వెనక్కి ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పూర్తిగా యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమాగా మలిచాడు దర్శకుడు. ఒక దశలో అయితే సినిమా ఎప్పుడు అయిపోతుందా అని ప్రేక్షకుడు అనుకునేట్టు చేసాడు దర్శకుడు. కథ నేపథ్యం ఎప్పుడో 1930 సంవత్సరం కాలం నాటిది కానీ గ్రామంలో మగ్గుతున్న ప్రజలకి ఆధునిక ఆయుధాలు రావటం, అవి ప్రయోగించే విధానం తెలియటం ఆ పోరాట సన్నివేశాలు కథ ఎక్కడ నుంచే ఇంకో దగ్గరికి వెళ్లి అసలు ఏమి జరుగుతోందో కూడా అర్థం కాదు. దర్శకుడు దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా ఒక మంచి కథతో తెరకెక్కించవచ్చు కానీ కేజీఎఫ్, విక్రమ్, ఆర్ఆర్ఆర్ సినిమా ప్రభావం పడిందేమో యాక్షన్ మీదే దృష్టి పెట్టాడు. కథ, కథనంలో విఫలం అయ్యాడు, చివరికి ఒక మామూలు సినిమాగా నడిపించేసాడు. కనీసం తెలుగులో విడుదల చేసినప్పుడు ఒక తెలుగు రచయితనో, తెలుగు తెలిసిన వ్యక్తినో పక్క పెట్టుకొని టైటిల్స్ రాయిపించినా బాగుండేది, గూగుల్ లో అనువాదం చేసినట్టు కనపడుతోంది, అందుకే తెలుగు టైటిల్స్ వచ్చినప్పుడు ప్రేక్షకులు నవ్వకుండా ఉండలేకపోయారు. అంత దారుణంగా వున్నాయి తెలుగు పేర్లు. దీని బట్టే తెలుస్తోంది, ఎదో తెలుగులో విడుదల చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అన్న చందాన విడుదల చేశారు కానీ నిర్వాహకులకు ఈ సినిమా విడుదల విషయంలో నిబద్ధత లేదు అని అర్థం అవుతోంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే ధనుష్ అగ్నీశ్వర, కెప్టెన్ మిల్లర్ రెండు వైవిధ్యమైన స్వభావాలు చూపించడంలో తన వంతు కృషి చేసాడు. ప్రియాంక అరుల్ మోహన్, నివేదిత సతీష్ ఇద్దరూ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ పాత్ర సినిమాకి ఎటువంటి ఉపయోగం కనపడదు. సందీప్ కిషన్ పాత్ర చాలా చిన్నది, అతని పాత్రని సరిగా వాడుకోలేదు అనే చెప్పాలి. ఇక చాలామంది తమిళ నటులు వున్నారు. కథ అంత బలంగా లేనప్పుడు నటులు ఎంత బాగా చేసినా కూడా ప్రేక్షకుడికి అది నచ్చకపోవచ్చు. నేపధ్య సంగీతం బాగుంది. ఛాయాగ్రహణం కూడా బాగుంది.

చివరగా, 'కెప్టెన్ మిల్లర్' సినిమా ఒక మంచి కథతో ప్రారంభం అవుతుంది, బ్రిటిష్ ప్రభుత్వ అండతో అక్కడ వున్న రాచరిక కుటుంబాలు ఒక కులం వారిని ఎలా అణగదొక్కుతున్నారు, ఇంకో పక్క బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఈ నేపథ్యంలో ఉండాల్సిన కథ ఎక్కడికో వెళ్ళిపోయి ప్రేక్షకుడికి నిరాశ పరిచింది.

Updated Date - Jan 27 , 2024 | 01:09 PM