DNV Review: మహేష్ బాబు మేనల్లుడు నటించిన 'దేవకీ నందన..' ఎలా ఉందంటే.. 

ABN, Publish Date - Nov 23 , 2024 | 10:27 AM

'హీరో’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు మహేశ్‌బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్‌ (Ashok Galla). రెండేళ్ల విరామం తర్వాత మరో ప్రయత్నంగా ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రం చేశారు. ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం

సినిమా రివ్యూ: 'దేవకీ నందన వాసుదేవ'( Devaki Nandana Vasudeva)
విడుదల తేది: 22-11-2024
నటీనటులు: అశోక్‌ గల్లా, మానస వారణాసి(Manasa Varanasi), దేవదత్త నాగే, దేవయాని, సంజయ్‌ స్వరూప్‌, ఝాన్సీ, గెటప్‌ శ్రీను, శత్రు తదితరులు.


సాంకేతిక నిపుణులు:
కథ: ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma)
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ళ, రసూల్ ఎల్లోర్ 
ఎడిటింగ్‌: తమ్మిరాజు
సంగీతం: బీమ్స్‌ సిసిరోలియో
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
దర్శకత్వం: అర్జున్‌ జంధ్యాల (Arjun Jandhyala)


'హీరో’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు మహేశ్‌బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్‌ (Ashok Galla). రెండేళ్ల విరామం తర్వాత మరో ప్రయత్నంగా ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రం చేశారు. ‘హనుమాన్‌’ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కథ అందించడం, అది కూడా పురాణాలతో ముడిపడిన కథ కావడం, ట్రైలర్స్‌ ఆసక్తికరంగా ఉండడంతో  కాస్త బజ్‌ ఏర్పడింది. బోయపాటి శ్రీను శిష్యుడు, 'గుణ 369' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అర్జున్‌ జంధ్యాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మరీ ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ: (Devaki Nandana Vasudeva Movie review)
విజయనగరం ప్రాంతంలో కంస రాజు (దేవదత్త నాగే) పేరు చెబితే జనాలు వణికిపోతుంటారు. అంత క్రూరమైన వ్యక్తి అతను. ఊళ్లో అతను కన్నేసిన భూమి తన సొంతం కావాలి. లేదంటే ప్రాణాలు తీస్తాడు. అతనికి జాతకాల పిచ్చి. తరచూ ఇంట్లో హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఓ సారి కాశీ సందర్శనకు వెళ్లినప్పుడు అక్కడ ఓ అఘోరా ునీ చెల్లెలి మూడో సంతానం చేతిలో నీ చావు’ అని చెప్పడంతో తన చెల్లికి మూడో సంతానం కలగకుండా తన బావను చంపేస్తాడు. కంసరాజు చేసిన పాపం అతన్ని జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితికి దారితీస్తుంది. 21 సంవత్సరాలు జైలు శిక్ష తర్వాత ఊళ్లో అడుగుపెడతాడు. అప్పటికే తన చెల్లెలికి పుట్టిన బిడ్డ సత్యభామ (మానస వారణాసి) పెరిగి పెద్దదవుతుంది. కృష్ణ (అశోక్‌ గల్లా)తో ప్రేమలో పడుతుంది. ఇంతకీ కృష్ణ ఎవరు? అతనికి ఉన్న గండం ఏంటి? ఆ ఇద్దరి ప్రేమాయణం కంసరాజుకి తెలిసిందా? సత్య కుటుంబ నేపథ్యం గురించి పూర్తి విషయాలు కృష్ణకు ఎప్పుడు తెలిశాయి? కంసరాజు చెల్లెలు దాచిపెట్టిన అసలైన రహస్యం ఏమిటి? అఘోరా చెప్పింది జరిగిందా? అన్నది తెరపైనే చూడాలి.



విశ్లేషణ: (Devaki Nandana Vasudeva Review)
వెండితెరపై ఏ జానర్‌ చిత్రం వచ్చినా పురాణాలు. రామాయణ, మహాభారతాల్లో ఏదో ఒక అంశం వాటికి స్ఫూర్తి అని చాలామంది మేకర్స్‌ చెబుతుంటారు. ప్రస్తుతం పురాణాలు, వాటిలోని పాత్రలతో ముడిపెడుతూ కథలు చెప్పడం అనే ట్రెండ్‌ నడుస్తోంది. అందుకు ఉదాహరణ ఈ మధ్యన వచ్చిన ‘కల్కి’, ‘హనుమాన్‌’, ‘కార్తికేయ 2’.. ఇలా చాలా సినిమాలే ఉన్నాయి. ఆ తరహాలో రూపొందిన చిత్రమే... ‘దేవకీ నందన వాసుదేవ’. కృష్ణుడు, కంసుడు పాత్రల ఇన్స్‌పిరేషన్‌తో అల్లుకున్న కథ ఇది. భూమి మీద ఎక్కడ లేని సుదర్శన చక్రం ఉన్న కృష్ణుడి విగ్రహంతో కథ మొదలవుతుంది. అక్కడి నుంచి కాశీకి, జైలుకి వెళ్తుంది. ఆ తర్వాత విలన్‌ కథ, అక్కడి నుంచి ఫ్లాష్‌బ్యాక్‌ హీరో, హీరోయిన్ల పరిచయం జరుగుతాయి. ఇందులో ఏదీ కూడా ఆసక్తి రేకెత్తించేలా ఉండవు. హీరో’తో లవ్‌స్టోరీ చేసిన గల్లా అశోక్‌ ఈ చిత్రంతో పూర్తిగా కమర్షియల్‌ వైపు వెళ్లాడు. తన ఏజ్‌, ఎఫర్ట్‌కు మించిన కథను ఎంచుకున్నాడు. ఇందులో లవ్‌ ట్రాక్‌ ఉంది కానీ అంత ఎఫెక్టివ్‌గా లేదు. హీరోయిన్‌ క్యారెక్టర్‌తో ఉన్న ట్విస్ట్‌ ఆసక్తిగా ఉంటుంది కానీ ఎక్కువ సేపు క్యారీ చేయలేదు. దేవయాని పాత్ర బలమైనదే. తనకున్న ముగ్గుకు కూతుళ్లను ఒక్క కూతురిగానే బయటకు చెప్పి.. వాళ్లను కాపాడుకోవడానికి తల్లిగా ఆమె పడే తపన ఆసక్తికరంగా సాగినా.. ఆ సన్నివేశాలకు కావలసినంత భావోద్వేగాలను దర్శకుడు ఇమడ్చలేకపోయారు. తొలి అరగంటలోనే సినిమా ఏంటనేది ఊహించవచ్చు. ప్రశాంత వర్మ ఇచ్చిన కథ ఏంటో కానీ దర్శకుడు తెరకెక్కించిన తీరు పరమ రొటీన్‌గా ఉంది. హీరో ఎలివేషన్‌ షాట్స్‌ మీదే ఎక్కువ ఫోకస్‌ చేశాడు. దర్శకుడు కేవలం తనలోని మాస్‌ మేకర్‌ని చూపించడానికే ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. సినిమా ప్రారంభంలో ఓ పెద్దాయన చెప్పిన సుదర్శన చక్ర విగ్రహం.. పతాక సన్నివేశాల్లో ఫైట్‌కే పరిమితమైంది. ఝాన్సీ సుదర్శన చక్రం గల కృష్ణుడిని నమ్మడం మినహాయిస్తే అంతకుమించి అది కథలో భాగంగా ఎక్కడా కనిపించలేదు. కంసరాజు చెల్లెలి మూడో సంతానం వల్లే అతని చావు అన్నది ఎలా జస్టిఫై అయిందో తెలియదు. అంటే కృష్ణ (అశోక్‌) సత్య ప్రియుడిగా కంసరాజు ఇంట్లో అడుగుపెట్టడం అన్నదే అతని చావుకి కారణం అనుకోవాలి. చక్రం చేసే  సంహారమే గొప్ప జస్టిఫికేషన్‌ అనుకోవాలేమో!



మొదటి సినిమాలో లవర్‌బాయ్‌గా కనిపించిన అశోక్‌ గల్లా(Ashok Galla)కు ఇందులో కమర్షియల్‌ యాంగిల్‌ తోడవ్వడంతో కాస్త భారం పడింది. నటన పరంగా ఎలాంటి తేడా లేదు. ఆ పాత్రకు ఆయన సూట్‌ కాలేదనిపించింది. తనకు మించిన పాత్ర అనిపించింది. యాక్షన్‌ సన్నివేశాలు రక్తంతో నిండిపోయాయి. మానస వారణాసికి తొలి చిత్రమిది. మొదటి సినిమాకే తలకు మించిన భారం పెట్టారు. గ్లామర్‌గా కనిపించింది కానీ ఎక్స్‌ప్రెషన్స్‌ మిస్‌ అయ్యాయి. కంసరాజు పాత్ర చేసిన దేవదత్త నాగే స్ర్కీన్‌ని ఆక్రమించేశాడు. ఆయన పెద్ద హీరోలకు విలన్‌గా సూటయ్యే నటుడు.  దేవయాని ముగ్గురు బిడ్డలకు తల్లి సెటిల్డ్‌గా నటించింది. సంజయ్‌ స్వరూప్‌, ఝాన్సీ పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు. శత్రు క్యారెక్టర్‌ కామెడీగా అనిపించింది. వెంకటేష్‌ కాకమాను, గెటప్‌ శీను ఉన్నా ఉపయోగం లేదు. భీమ్స్‌ సంగీతం సోసోగా ఉంది. అయితే సాహిత్య పరంగా పాటలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌ డల్‌గా ఉంది. నిర్మాణ విలువు ఫర్వాలేదు. సాయి మాధవ్‌ బుర్రా మాటలు కొంతవరకూ సినిమాలో మైనస్‌లను కవర్‌ చేశాయి. అశోక్‌ యూత్‌ సినిమాలు చేయాల్సిన సమయంలో.. మాస్‌ ఇమేజ్‌ కోసం ఇలాంటి కమర్షియల్‌ ప్రయోగాలు చేయడం కరెక్ట్‌ కాదేమో!  ప్రశాంత్‌ వర్మ ఇచ్చిన కథ ఏంటో తెలీదు కానీ దర్శకుడు మాత్రం రొటీన్‌గా తీశారు. కథ పాతదైతే.. దానిని కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఆడియన్స్‌ను కన్విన్స్‌ చేయాలి. కథ కొత్తదైతే.. ప్రేక్షకుడికి ఎలా కనెక్ట్‌ చేయాలో ప్లాన్‌ చేయాలి. దర్శకుడు ఈ ఫార్ములాను మిస్‌ అయినట్లు ఉన్నాడు. ఈ తరహా కథలను పేపర్‌పై పెట్టినంత సులభంగా తెరపైకి తీసుకురావడం కష్టం. చాలా హోం వర్క్‌ చేయాలి. కథకు తగ్గ నటులు కావాలి. కాన్సెప్ట్‌ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, కథనంలో లోపంతో సినిమా స్టార్టింగ్‌లోనే పట్టు తప్పిపోయింది. అందుకే రొటీన్‌ సినిమాగా అనిపిస్తుంది.

ట్యాగ్‌లైన్‌: వాసుదేవ.. వాసుదేవ.. కష్టమే!

Updated Date - Nov 23 , 2024 | 11:12 AM