Buddy Movie Review: బడ్డీ మూవీ రివ్యూ
ABN, Publish Date - Aug 03 , 2024 | 12:41 AM
ఈవారం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సందడి చేశాయి . వరుసగా అరడజను చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో అల్లు శిరీష్ నటించిన 'బడ్డీ’ ఒకటి. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.
సినిమా రివ్యూ: బడ్డీ
విడుదల: 02–08–2024
నటీనటులు: అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్, అలీ, అజ్మల్, ఫిషా రాజేశ్ సింగ్ తదితరులు
కెమెరా: కృష్ణణ్ వసంత్
ఎడిటర్: రూబెన్
సంగీతం: హిప్‌హాప్ తమిళ
నిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్ పిలింస్
నిర్మాత: కేఈ జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం: శామ్ ఆంటోన్
ఈవారం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సందడి చేశాయి . వరుసగా అరడజను చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో అల్లు శిరీష్ నటించిన 'బడ్డీ’ ఒకటి. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు పదేళ్లు కావొస్తున్న శిరీష్ అందుకున్న విజయాలు సంఖ్య తక్కువ. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షసివో చిత్రాలు మాత్రమే చెప్పుకోదగ్గవి. ఇప్పటిదాకా ప్రేమకథా చిత్రాలు చేసిన ఆయన థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ తరహా చిత్రాలను ఇష్టపడే ఆడియన్స్‌ను బడ్డీ ఏ మేరకు ఆకట్టుకుంది? అల్లు శిరీష్ ఖాతాలో హిట్ పడిందా?
కథ:
ఆదిత్య (అల్లు శిరీష్) పైలెట్. పల్లవి (గాయత్రి భరద్వాజ్) వైజాగ్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. పల్లవి ఉద్యోగంలో చేరిన మొదటి రోజున విధి నిర్వాహణలో భాగంగా ఫ్టైట్ ల్యాండ్ చేయడంలో సరైన సిగ్నల్ ఇవ్వడానికి సాయపడతాడు. ఇద్దరు ఎదురుపడకుండానే మాటలు కలుస్తాయి. అలా ఆదిత్యపై పల్లవికి ప్రేమ పుడుతుంది. ఇద్దరూ ఫోన్ మాట్లాడుకుంటూ దగ్గరవుతారు. ఆదిత్య ఓ టెడ్డీ బేర్‌ని పల్లవికి గిఫ్ట్‌గా పంపిస్తాడు. ఆదిత్యని నేరుగా కలసి తన ప్రేమని వ్యక్త పరచడం కోసం సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటుంది. అదే సమయంలో పల్లవి చేసిన చిన్న పొరపాటు వల్ల ఆదిత్యను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. ఆదిత్యను నేరుగా కలిసి క్షమాపణ చెపాల?నుకున్న పల్లవి కిడ్నాప్ అవుతుంది. ఈ క్రమంలో జరిగిన గొడవ కారణంగా పల్లవి కోమాలోకి వెళ్లగా.. ఆమె ఆత్మ ఓ టెడ్డీబేర్‌లోకి చేరుతుంది. ప్రాణం ఉండగానే పల్లవి ఆత్మ బయటకెలా వచ్చింది? ఆమెను కిడ్నాప్ చేసిన ముఠాకి.. హాంకాంగ్‌లో ఉన్న డాక్టర్ అర్జున్ కుమార్ వర్మ (అజ్మల్)కూ ఉన్న సంబంధం ఏంటి? పల్లవి శరీరంలోకి తన ఆత్మతిరిగి వచ్చిందా? ఆదిత్యా, పల్లవి ఒకటయ్యారా? అన్నది కథ.
విశ్లేషణ
అవయవాల అక్రమ రవాణా ముఠా నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ ముఠాతో కలిసి డాక్టర్ అర్జున్ చేసే అరాచకాల్ని ఒక టెడ్డీబేర్‌తో కలిసి హీరో ఎలా అడ్డుకున్నాడన్నది ఆసక్తికరమైన పాయింట్. కథగా ఈ లైన్ బావునప్పటికీ దర్శకుడు దానికి ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే బావుండేది. తీర్చిదిద్దిన తీరులో దర్శకుడు తడబాటు కనిపించింది. మానవ అవయవాలు దొంగలించే క్రూరమైన డాక్టర్ అర్జున్‌గా అజ్మల్‌ను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమైంది. ఆ సన్నివేశాలన్నీ థ్రిల్లింగ్‌గా అనిపించాయి. ఆ తర్వాత పల్లవిగా హీరోయిన్ గాయత్రి పాత్ర తెరపైకి రావడం, ఆమె కిడ్నాప్, కోమా, ఆత్మ టెడ్డీబేర్‌లోకి రావడం చకచకా సాగిపోయింది. ఆ తర్వాత హీరోకి పల్లవి ఆత్మ టెడ్డీలో ఉందని తెలియడం, అక్కడి నుంచి ఆమె ఎక్కడుందో తెలుసుకోవడాని చేసిన ప్రయత్నాలు వేగవంతంగా లేవు. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఒక టెడ్డీకి ప్రాణం వచ్చి మనుషుల మధ్య మాట్లాడుతూ తిరుగుతుంటే ఎవరికైనా ఆశ్చర్యంగా, వింతగా అనిపించాలి. కానీ, సినిమాలో ఆ టెడ్డీని చూసిన ఎవరిలోనూ ఆశ్చర్యం కనిపించదు. పైగా అది చెప్పిన కథకు కరిగిపోయి హీరో దానికి సాయం చేయాలని ఎందుకు అనుకుంటాడన్నది అర్థం కాదు. తర్వాత టెడ్డీ చెప్పిన మాటలు విని పల్లవి శరీరాన్ని అన్వేషిస్తూ హీరో చేసే ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే ఆస్పత్రి ఫైట్, వైజాగ్ పోర్టులో జరిగే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి. ఇక ద్వితీయార్థంలో కథ అంతా హాంగ్‌కాంగ్‌కు షిఫ్ట్ అవుతుంది. అక్కడి వరకూ ఒక ఫ్లోలో ఉన్న కథ.. టెడ్డీని.. దాని బాడీని వెతికి పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు రక్తికట్టించలేదు. లవ్‌స్టోరీ ఉంది. రొమాన్స్‌కి చోటు లేదు. ఇక క్లైమాక్స్ కార్గో ఫ్లైట్‌లో సాగే యాక్షన్ సీన్స్ ల్యాగ్ అనిపిస్తుంది. గాల్లో ఎగిరే ఫ్లైట్‌లో అంత మందితో ఫైట్ లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది.
ఇక ఆర్టిస్‌లు విషయానికొస్తే ఆదిత్య పాత్రలో శిరీష్ ఒదిగి నటించాడు. గాయత్రీ భరద్వాజ్ పాత్ర ఎక్కువ సేపు కోమాలోనే ఉంది. ఆమె పాత్ర నిడివి తక్కువైనా కనిపించిన కాసేపు అందంతో అలరించింది. ఒక పాటలో మినహా ఆమె యాక్టింగ్‌కు అంతగా ఆస్కారం లేదు. అజ్మల్ మాత్రం క్రూరమైన విలనిజం చూపించాడు. ఆ పాత్ర మొదలైౖనప్పుడు ఉన్న పవర్ తర్వాత లేదు. అలీ పాత్ర సోసోగా ఉంది. తెలుగుతెరపై భయంకర విలన్‌గా ఎన్నో చిత్రాల్లో కనిపించిన ముకేష్‌రిషి ఈ తరహా పాత్ర చేయడం కొత్తే. ప్రిషా సింగ్, అలీ, రవి పాత్రల మేరకు నటించారు. . సాంకేతిక విభాగానికి వస్తే దర్శకుడు శామ్ ఆంటోన్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్టట్టు మార్పు చేశారు. అయితే తెలుగు ప్రేక్షకులను అలరించే రీతిలో తెరకెక్కించే విఽషయం కాస్త తడబడ్డాడు. హీరోయిన్ కోమాలో ఉండగా.. ఆమె ఆత్మ బయటకు వచ్చే పాయింట్ తెలుగులోనే చాలా సినిమాల్లో చూశాం. ఈ ఎపిసోడ్ అంత ఆకట్టుకోలేదు. బడ్డీ మాటలు, సన్నివేశాలు బావుంటాయి. కొన్ని సందర్భాల్లో బడ్డీ పాత్ర భావోద్వేగం ఉంటుంది. చిన్న పిల్లలు బడ్డీ పాత్రను బాగా ఇష్టపడతారు. హీరో, విలన్ మధ్య గేమ్ అంతగా ఆకట్టుకోలేదు. ఆర్‌ఆర్‌ఆర్, జై బాలయ్య, భగవంత్ కేసరి రిఫరెన్స్‌లు థియేటర్‌లో నవ్వులు పూయిస్తాయి. నిర్మాణ పరంగా సినిమా క్వాలిటీగా ఉంది. శిరీష్ మార్కెట్‌ను మించి నిర్మాత ఖర్చుచేశారు. హిప్ హప్ తమిళ నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్. టెడ్డీబేర్ పాత్రకు చిన్న పిల్లల్లు బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి వారిని బట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ చిత్రం కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి.