Appudo Ippudo Eppudo Review: నిఖిల్ క్రైమ్, లవ్‌స్టోరీ ఎలా ఉందంటే..
ABN, Publish Date - Nov 08 , 2024 | 04:51 PM
హీరో సిద్ధార్థ్ సుధీర్‌వర్మలది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి ఖాతాలో ‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాలు ఉన్నాయి. హ్యాట్రిక్ హిట్ కోసం మూడో చిత్రం కూడా చేశారు. అదే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..
సినిమా రివ్యూ: అప్పుడో.. ఇప్పుడో.. ఎప్పుడో..
విడుదల: 8–11–2024
నటీనటులు: నిఖిల్, రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్, జాన్ విజయ్, అజయ్, హర్ష చెముడు, సత్య, సుదర్శన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ రిచర్డ్ ప్రసాద్
సంగీతం: కార్తీక్
నేపథ్య సంగీతం: సన్నీ.ఎం.ఆర్
ఎడిటింగ్: నవీన్ నూలి
కథ: శ్రీకాంత్ విస్సా,
నిర్మాత:: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్,
దర్శకత్వం: సుధీర్‌వర్మ
హీరో సిద్ధార్థ్ (Nikhil) సుధీర్‌వర్మలది (Sudheer varma) సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి ఖాతాలో ‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాలు ఉన్నాయి. హ్యాట్రిక్ హిట్ కోసం మూడో చిత్రం కూడా చేశారు. అదే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo Movie)’. అయితే 2021లో ప్రకటించిన ఈ చిత్రం ఈ నాటికి విడుదలకు నోచుకుంది. ఎప్పుడు పూర్తి చేశారో కూడా బయటకు రాలేదు. పెద్దగా ప్రమోషన్స్ ఏమీ లేకుండా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరీ చిత్రం ఎలా ఉండో చూద్దాం.
కథ: (Appudo Ippudo Eppudo Review)
రిషి (సిద్ధార్థ్) పేరున్న కార్ రేసర్ కావాలని తపన పడుతుంటాడు. తార (రుక్మిణి వసంత్)ని చూసి ప్రేమలో పడతాడు. మిస్ కమ్యూనికేషన్ వల్ల అతని ప్రేమ విషయం తారకు చేరదు. తదుపరి రేసర్‌గా ఎదగాలని లండన్‌లో కొత్త జీవితం మొదలుపెడతాడు. పార్ట్ టైమ్ వర్క్ చేస్తూనే రేసర్‌గా ప్రయత్నాలు చేస్తాడు. ఆ క్రమంలో తులసీ అలియాస్ చుంబన (దివ్యాంశ కౌశిక్) రిషికి పరిచయం అవుతుంది. ప్రమాదంలో ఉన్న ఆమెను గట్టెక్కిస్తాడు రిషి. ఇద్దరు మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లికి కొన్ని క్షణాల ముందు తులసి మిస్ అవుతుంది. దానికి కారణమేంటి? ఆమె జాడ తెలుసుకునే క్రమంలో రిషికి ఎలాంటి విషయాలు తెలిశాయి. రిషి హైదరాబాద్‌లో ప్రేమించిన తార లండన్‌కి ఎందుకొచ్చింది? వీళ్లకి లండన్‌లో లోకల్ డాన్ బద్రీనారాయణ (జాన్ విజయ్)కి, అతను పోగట్టుకున్న ఓ డివైజ్‌కి సంబంధం ఏంటి? రిషికి ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు అన్నది కథ.
Also Read-కేతిక శర్మ: బరువెక్కిన అందాలు.. జారుతున్న హృదయాలు
విశ్లేషణ:
సత్య, సుదర్శన్ ప్లాష్‌బ్యాక్ చెప్పడంతో కథ మొదలవుతుంది. క్రైమ్ కథకి లవ్‌స్టోరీ, జోడించి తెరకెక్కించారు. పేరుకే క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఎక్కడా కూడా థ్రిల్ ఫీలయ్యే సీన్ కనిపించదు. రెండు లవ్‌స్టోరీలు పెట్టారు. ఏదీ సరైన ప్రభావం చూపించలేదు. ఫటాఫటా ట్విస్ట్‌లు వస్తుంటాయి కానీ ఆకట్టుకునే రీతిలో ఉండవు. సీన్ బై సీన్ వేసుకుంటూ వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కథనం కూడా అదే సమస్య. సత్య, సుదర్శన్‌లు ఫ్లాష్‌బ్యాక్ చెప్పడం ఆరు నెలలు, రెండు సంవత్సరాలు అంటూ కథని ముందుకు, వెనక్కి తిప్పడంతో కన్‌ఫ్యూజ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. మేకింగ్ కూడా కొత్తగా ఏమీ లేదు. యాక్షన్ సన్నివేశాలు కూడా నేచురల్‌గా లేవు. ఈ సినిమా 2021లో మొదలైంది. ఇప్పటి పరిస్థితులకు కనెక్ట్ అయ్యేందుకు హైడ్రా, స్పైడ్రా అంటూ కొత్తగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ కథలో మాత్రం పాత వాసన అన్ని బయటపెట్టింది. మాటలు అక్కడక్కడా నవ్వించాయి. అయితే క్లైమాక్స్ 500 కోట్ల క్రైమ్ మాత్రం ఊహించనిది. విడిగా చూస్తే ఆ సీన్‌తోపాటు దివ్యాంశ పాత్రలో వచ్చే ట్విస్ట్‌లు కాస్త ఆసక్తిగా సాగాయి. దాంతోపాటు రెండు గంటల నిడివి సినిమాకు మరో ఎసెట్ అనొచ్చు.
నటీనటుల పనితీరుకొస్తే..
ఎలాంటి పాత్రనైనా తనదైన శైలి ఎనర్జీతో చేసుకుపోయే నిఖిల్ రిషి పాత్రను కూడా అలాగే చేసుకుపోయాడు. ఈ తరహా పాత్ర అతనికి కొత్తేమీ కాదు. కన్నడ భామ రుక్మిణీ వసంత్‌కు తెలుగులో తొలి చిత్రమిది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే యాక్టింగ్‌కు స్కోప్ లేదు. దివ్యాంశ కౌశిక్ నెగటివ్ రోల్‌లో మెప్పించింది. ఆ పాత్ర సినిమాకు కాస్ల ప్లస్ అని చెప్పొచ్చు. పాత్రకు తగ్గట్టు యాక్టింగ్, యాటిట్యూడ్ చూపించింది. జాన్ విజయ్ పాత్ర ఫన్‌తో పాటు విసుగును కలిగించింది. అజయ్ పాత్ర బాగుంది. కానీ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్‌కు తగ్గ సీన్స్‌లేవు. హర్ష కామెడీ పండలేదు. సత్య, సుదర్శన్ ఫ్లాష్‌బ్యాక్ చెప్పడానికే సరిపోయారు. టెక్నికల్ విషయానికొస్తే.. కెమెరా వర్క్ రిచ్‌గా ఉంది. లండన్ అందాలను చక్కగా చూపించారు. మాటలు బాగానే రాసుకున్నారు. సన్నీ ఎమ్‌ఆర్ పాటలు డల్‌గా ఉన్నాయి. అక్కడక్కడా నేపథ్య సంగీతం బావుంది. కథ, కథనాల్లో ఏమాత్రం కొత్తదనం లేదు. లాజిక్‌ల గురించి అసలు మాట్లాడుకోవలసిన అవసరం లేదు. సుధీర్‌వర్మ.. ుస్వామిరారా’తో దర్శకుడిగా నిరూపించుకున్నాడు. వసూళ్ల వర్షం కురిపించాడు. అప్పట్లో చిన్న సినిమాల్లో అదొక సంచలనం. తదుపరి చిత్రం కేశవతో కూడా బాగానే మెప్పించాడు. ఈ సినిమా చూశాక స్వామిరారా’ లాంటి సూపర్‌హిట్ తీసిన దర్శకుడేనా ఈ సినిమా తీసింది అనే అనుమానం రాకమానదు. కథ, స్ర్కీన్‌ప్లేలో మంచి పట్టున్న సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని ఎందుకు ఇలా పేలవంగా తీశాడో ఆయనకే తెలియాలి. హీరో, హీరోయిన్లకు మఽధ్య జరిగిన ప్రేమకథకు టైటిల్ యాప్ట్ అవుతుందేమో కానీ కథ పరంగా చూస్తే టైటిల్ జస్టిఫికేషన్ లేదు. చడీచప్పుడు లేకుండా విడుదల చేయడానికి కారణం సినిమా మీద నమ్మకం లేకపోవడమేనేమో అనిపిస్తుంది.
ట్యాగ్ లైన్: ఇప్పటి సినిమా కాదు..