మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Music Shop Murthy Movie Review: అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే...

ABN, Publish Date - Jun 14 , 2024 | 07:00 PM

అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. శివ పాలడుగు దర్శకుడు, చాందిని చౌదరి కథానాయిక. ఈ సినిమా ఈరోజు విడుదలైంది, ఎలా వుందో చదవండి.

Music Shop Murthy Movie Review

నటీనటులు: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, భాను చందర్, ఆమని, అమిత్ శర్మ, దయానంద్ రెడ్డి తదితరులు

ఛాయాగ్రహణం: శ్రీనివాస్ బెజుగం

సంగీతం: పవన్

నిర్మాతలు: హర్ష గారపాటి & రంగారావు గారపాటి

రచన, దర్శకత్వం: శివ పాలడుగు

విడుదల తేదీ: జూన్ 14, 2024

రేటింగ్: 3 (మూడు)

-- సురేష్ కవిరాయని

క్యారెక్టర్ నటుడిగా అందరికీ పరిచయం వున్న అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. చాందిని చౌదరి కథానాయిక, ఆమని, భాను చందర్ లాంటి సీనియర్ నటులు కూడా వున్నారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Music Shop Murthy Movie Review)

Music Shop Murthy Story కథ:

మూర్తి అనే అతను వినుకొండ అనే వూరిలో ఒక మ్యూజిక్ షాప్ పెట్టుకొని దానిపై వచ్చీ రాని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అతని భార్య జయ (ఆమని) పిండి వంటలు చేసి అమ్ముతూ భర్తకి సాయపడుతూ ఉంటుంది. ఆమెకి మ్యూజిక్ షాప్ అమ్మేసి అక్కడ ఒక మొబైల్ షాప్ పెడితే మంచి లాభాలు వస్తాయని కోరిక, అదే విషయం గురించి భర్తతో పోరు పెడుతూ ఉంటుంది. మూర్తికేమో సంగీతం వదలకూడదు, అందులోనే ఇంకా ఏదైనా కొత్తగా ప్రయత్నం చేసి ముందుకు వెళ్లాలని అనుకుంటాడు. ఆ వూర్లో ఎటువంటి ఫంక్షన్ అయినా మ్యూజిక్ ఈవెంట్ మాత్రం మూర్తి పెడుతూ ఉంటాడు. ఆలా ఒకసారి ఒక ఫంక్షన్ లో మూర్తి చేసిన పని నచ్చి అక్కడి వాళ్ళు అతన్ని డీజే అయితే బాగుంటుంది, డబ్బు కూడా బాగా వస్తుంది అని సలహా ఇస్తారు. 52 ఏళ్ల మూర్తి డీజే అయి, కుటుంబాన్ని ఆర్ధిక ఇబ్బందులనుండి బయట పడేయాలని, ఆన్ లైన్ లో దాని గురించి వెతకటం మొదలుపెట్టి తెలుసుకుంటాడు. అదే వూర్లో అంజన (చాందిని చౌదరి) అనే అమ్మాయి అమెరికానుండి వచ్చి డీజే అవ్వాలని అనుకుంటుంది. కానీ ఆమె తండ్రి (భాను చందర్) ఆమెకి అడ్డుపడతాడు, ఆడపిల్లలు అలాంటివి చెయ్యకూడదు అంటాడు. ఒక సందర్భంలో మూర్తి షాపుకు అంజన వచ్చి అక్కడ సంగీత కళాకారులని చూసి, మూర్తికి సంగీతం అంటే ప్రాణం అని తెలుసుకొని, అతనికి డీజే నేర్పుతా అని చెపుతుంది. ఇద్దరూ మంచి స్నేహితులు అవుతారు, కానీ అది చూసి వూర్లో వాళ్ళు ఇంకోలా భావిస్తారు. ఇంతకీ మూర్తి డీజే అయ్యాడా? అంజన తండ్రి మాట కాదని ఏమి చేసింది? మూర్తి, అంజన కలిపి ఎటువంటి ప్రయత్నాలు చేశారు? మూర్తి భార్య మూర్తి డీజే అయితే ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఇవన్నీ తెలియాలంటే 'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమా చూడండి.

విశ్లేషణ:

దర్శకుడు పాలడుగు ఒక మామూలు కథని ఎంచుకున్నాడు ఈ 'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమా కోసం. సంగీతం అనేది మొదట్లో క్యాసెట్స్, తరువాత సీడీలు ఆ తరువాత ఇంటర్ నెట్ వచ్చాక ఆన్ లైన్ రావటం, డౌన్లోడ్ చేసుకోవటం మొదలు పెట్టాక, మ్యూజిక్ షాపుల గిరాకీ పడిపోయింది. కానీ 52ఏళ్ల వ్యక్తికి సంగీతం అంటే ప్రాణం, అందుకని ఆ సంగీతంలో ఇప్పుడున్న ఆధునికతకు అనుగుణంగా తాను మారాలని తన షాపుని కూడా మార్చాలని ప్రయత్నం చేస్తాడు. డీజే అవ్వాలని అనుకుంటాడు, అయితే అతని వయస్సు, రూపు, భాష వాటన్నిటికీ అడ్డు తగులుతాయి. ఆ సమయంలో అతను కన్న కలలు నిజం చెయ్యడానికి అతనికి ఒక స్నేహితురాలు దొరుకుతుంది, వూర్లో అందరూ అపార్ధం చేసుకుంటారు.

ఇదంతా తెలిసిన కథ అయినా దర్శకుడు చాలా భావోద్వేగంతో సన్నివేశాలు చక్కగా తెరపై ఆవిష్కరించాడు. మూర్తి కుటుంబం, భార్య, పిల్లలు, వారి అనుబంధం, వాళ్ళ కష్టాలు ఇలా అన్నీ చాలా సహజంగా చూపించాడు. అమెరికా నుండి ఇండియా వచ్చి డీజే అవుదామనుకున్న తన కూతురిని తండ్రి ఆమెని ఎంకరేజ్ చెయ్యకుండా, ఆమె చేస్తున్న పనికి నిందిస్తాడు. నీ కూతురు డీజే అయితే ఒప్పుకుంటావా అని మూర్తిని అడిగితే చేసే పనిలో నిజాయితీ ఉంటే వాళ్ళకి నచ్చిన పని చేయొచ్చు అని మూర్తి చెపుతాడు. ఇద్దరి తండ్రుల మధ్య వుండే ఆలోచనలు, వ్యత్యాసం ఆలా చూపిస్తాడు దర్శకుడు. నువ్వు చదువుకున్నావు, కానీ సివిలైజ్డ్ కాదు, మూర్తి చదువుకోకపోయినా అతని ఆలోచనలు, వ్యక్తిత్వం మేధావిలా వుంటాయని అంజన తన తండ్రికి చెపుతుంది. ఇలాంటి చాలా మంచి సన్నివేశాలు కూడా వున్నాయి.

పోలీసు స్టేషనులో తన కూతురు తప్పిపోయింది అని అంజన తండ్రి ఫిర్యాదు చేస్తే, అక్కడ స్టేషన్ లో మూర్తి చెప్పే మాటలు చాలా బాగుంటాయి, ఆ సన్నివేశాలని బాగా తీసాడు దర్శకుడు. అలాగే డీజే అయ్యాక టీవిలో అతని ఇంటర్వ్యూ కూడా చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలు చాలానే వున్నాయి సినిమాలో. చిన్న సినిమా, చిన్న ఆర్టిస్టులు, అయినా కూడా దర్శకుడు వారందరి చేతా మంచి భావోద్వేగాలతో కూడిన సినిమాని ఆవిష్కరించాడు. ఇలాంటి చిన్న సినిమాలని ప్రోత్సహిస్తే ఇలాంటివి మరికొన్ని సినిమాలు రావటానికి ఉపయోగపడతాయి. ఛాయాగ్రహణం, సంగీతం బాగున్నాయి.

అజయ్ ఘోష్ మూర్తి పాత్రలో చాలా బాగా చేశారు, ఆ పాత్రకి సరిగ్గా సరిపోయారు, అందులో ఇమిడిపోయారు. దర్శకుడు ఆ పాత్రకి అజయ్ ఘోష్ ని అనుకోవటం చాలా కరెక్టు. అదే ఏదైనా కుర్ర నటుడిని పెట్టి, పాటలు పెట్టి పాడుచెయ్యకుండా, ఆ పాత్రకి సరైన నటుడుని ఎంచుకోవటమే కాకుండా, అతనితో మంచి నటన రాబట్టుకున్నాడు దర్శకుడు. ఆమని, అజయ్ ఘోష్ భార్యగా చాలా బాగా చేసింది, వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. చాందిని చౌదరి ఈ సినిమాలో చక్కగా కనిపించింది, అంతే చక్కగా నటించింది. ఆమె ఆ పాత్రకి పర్ఫెక్ట్ అనిపించుకుంది. భానుచందర్ సీనియర్ నటుడు తన అనుభవంతో తండ్రిగా బాగా రాణించారు. మిగతా పాత్రలో చాలామంది తమ పాత్రల పరిధి మేరకి బాగా నటించారు.

చివరగా, 'మ్యూజిక్ షాప్ మూర్తి' అనే సినిమా భావోద్వేగాలతో కూడిన ఒక మంచి సినిమా. అజయ్ ఘోష్ మూర్తి పాత్రలో చక్కగా ఇమిడిపోయి బాగా నటించారు. చిన్న సినిమా అయినా చూడాల్సిన సినిమా ఇది. చక్కటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దర్శకుడు శివ పాలడుగుకి క్రెడిట్ మొత్తం ఇవ్వాలి, పూర్తి మార్కులు వెయ్యాలి.

Updated Date - Jun 14 , 2024 | 07:00 PM