1000 Babies Review: ఆస్పత్రిలో.. డెలివరీ అంటే భయపడేలా చేశారు కదరా!
ABN, Publish Date - Oct 20 , 2024 | 07:05 PM
చాలా రోజుల తర్వాత ఈ వారం ఓటీటీకి ఓ మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 1000 బేబీస్ వచ్చింది. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ నీనాగుప్తా, రెహామాన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందిస్తోంది.
చాలా రోజుల తర్వాత ఈ వారం ఓటీటీకి ఓ మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 1000 బేబీస్(1000 Babies) వచ్చింది. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ నీనాగుప్తా (Neena Gupta), రెహామాన్ (Rahman) ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్ మలయాళంలో రూపొంది సౌత్ భాషలన్నింటిలోకి అనువాదమై డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. నజీమ్ కోయ (Najeem Koya) రచన, దర్శకత్వం చేశారు. ఒక్కొక్కటి 40కి పైగా నిమమిషాల నిడివితో మొత్తం 7 ఏపిసోడ్‌లతో రూపొందిన ఈ సిరీస్ ప్రస్తుతం ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. కథ విషయానికి వస్తే.. కేరళలోని ఓ మారుమూల ప్రాంతంలో మతి స్థిమితం సరిగ్గా లేని తల్లి సారాతో కలిసి బిబిన్ నివసిస్తూ ఉంటాడు. కొడుకు ఓ ల్యాబ్‌లో పని చేస్తూ పెళ్లి లేకుండా సింగిల్‌గా కాలం వెల్లదీస్తూ ఉంటాడు. అయితే తల్లి సారా గతంలో తను నర్సుగా పని చేసినప్పుడు చేసిన దురాగతాలను తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. రోజంతా మార్కర్లతో ఇంట్లో గోడలపై ఏదో ఏదో రాస్తూ ఉంటుంది.
ఓ రోజు సడన్‌గా సారా ఓ మూడు లెటర్లు వ్రాసి తన దదగ్గర పెట్టుకుని, తన కొడుకు బిబిన్‌ను పిలిచి తను చేసిన పనులను, అతని అసలైన తల్లిదండ్రుల గురించి చెబుతుంది. దీంతో బిబిన్ ఆగ్రహాంతో తల్లిపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. చావుబతుకుల మధ్య ఉన్న సారాను పక్క ఇంట్లోని వారు ఆస్పత్రిలో చేర్పించగా.. తాను గతంలో చేసిన దురాగతల గురించి రాసి పెట్టిన లెటర్లను పోలీసులకు, జడ్జికి అప్పగించాలని అక్కడ ఉన్న వారికి చెప్పి కన్ను మూస్తుంది. ఆ లెటర్లు అందుకున్న జడ్జి, పోలీసులు అందులో ఉన్న మ్యాటర్‌ను తెలుసుకుని ఖంగు తింటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశం బయటకు రావద్దని, ఒకవేళ బయటకు వస్తే రాష్ట్రం మొత్తం అట్టుడుకుతుందని నిర్ణయించుకుని ఆ లెటర్, అందులోని అంశం బయటకు రాకుండా జాగ్రత్త పడతారు.
అయితే కొన్ని సంవత్సరాల తర్వాత సిటీలో ఓ సినిమా నటి ఆత్మహత్య చేసుకున్న వార్త బాగా వైరల్ అవుతుంది. కానీ తర్వాత సీఐ అజి దర్యాప్తులో పక్కా ప్లాన్‌తో చేసిన మర్డర్ అని తేలడంతో పాటు హత్య చేసిన వారిని పట్టుకుంటారు. అదే సమయంలో హత్యకు లింకుగా బిబిన్ నుంచి ఓ రెండు లెటర్లు వచ్చాయంటూ ఓ యువతి సీఐని కలవడంతో కథ టర్న్ తీసుకుంటుంది. దాంతో పాటు హీరోయిన్‌ను హత్య చేయడానికి ఓ వ్యక్తి సాయం చేసినట్లు తేలడం, హత్య చేసిన విధానంపై సీఐకు వచ్చిన అనుమానాల నేపథ్యంలో అనేక కొత్త విషయాల బయటకు వస్తాయి. ఆ తర్వాత ఈ కేసు విచారిస్తూ ఉండగా ఒక్కొక్కటే సీక్రెట్ రివీల్ అవుతూ, అప్పటికే ఇదే తరహాలో జరిగిన కొన్ని మర్డర్స్ గురించి తెలవడంతో పాటు అంతకు కొన్ని సంవత్సరాల ముందు పోలీసులు దాచి పెట్టిన సారా లెటర్ల విషయం సీఐకు తెలుస్తుంది.
ఈ క్రమంలో సీఐ ఆప్పటి అధికారులను కలవగా వారు ఈ కేసు సెన్సివిటీ గురించి, ఎందుకు దాచింది వివరించి నిందితుడిని త్వరగా విచారణ చేసి పట్టుకొవాలని అప్పటివరకు ఈ విషయం రహాస్యంగానే ఉంచాలంటూ సీఐ అజికి స్పెషల్ పర్మీషన్స్ ఇస్తారు. ఈ నేపథ్యంలో సీఐ ఈ కేసును చేధించగలిగాడా, బిబిన్ తన ఫ్రెండ్‌కు ఆ లెటర్లు ఎందుకు పంపాడు, అసలు లెటర్‌లో ఉన్న మ్యాటరేంటి, వరుస హత్యల వెనక ఉన్నదెవరనే ఇంట్రెస్టింగ్ కథాకథనంతో ఈ సిరీస్ సాగుతూ చూసే వారిని సీటు ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.
ముఖ్యంగా ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు ఎంచుకున్న కాన్సెప్ట్ అదిరిపోయేలా ఉండడమే కాక ఎక్కడా సస్పెన్స్ మిస్సవకుండా తర్వాత ఏం జరుగబోతుందా అనే ఫీల్ వచ్చే స్క్రీన్ ప్లేతో అద్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కించిన విధానం ఎక్ట్రార్డినరీగా ఉంది. ఈ సిరీస్ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar) ఓటీటీలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీక్ మంచి థ్రిల్లర్ సిరీస్ కావాలనుకునే వారు ఈ 1000 బేబీస్‌ను అసలు మిస్సవ్వొద్దు. కాకపోతే ఒకట్రెండు ఏపిసోడ్స్‌ల్లో డ్రగ్స్ కంజప్సన్‌ను చూపిన విధానం ఇబ్బందికరంగా ఉంటుంది.