Aay Movie Review: ఎన్టీఆర్ బావమరిది సినిమా 'ఆయ్' ఎలా ఉందంటే

ABN, Publish Date - Aug 16 , 2024 | 01:01 PM

‘మ్యాడ్‌’ సినిమాతో ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌ హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతో మంచి మార్కులే తెచ్చుకున్నారు. తాజాగా నితిన్  హీరోగా నటించిన రెండో సినిమా ‘ఆయ్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మించారు.

సినిమా రివ్యూ: 'ఆయ్‌’ (Aay Review)
విడుదల తేది: 15-8-2024
నటీనటులు: నితిన్ నార్నే, నయన సారిక, వినోద్‌కుమార్‌, మైమ్‌ గోపీ, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి, అంకిత కొయ్య, 7 ఆర్ట్స్‌ సరయు తదితరులు.
కెమెరా: సమీర్‌ కల్యాణి ,
సంగీతం: రామ్‌ మిరియాల, 
ఎడిటర్‌: కె.పవన్ కల్యాణ్‌
సమర్పణ: అల్లు అరవింద్‌,
నిర్మాతలు: బన్నీ వాసు, విద్య కొప్పినీడి
దర్శకత్వం: అంజి కె. మణిపుత్ర (Anji k Maniputra)

‘మ్యాడ్‌’ సినిమాతో ఎన్టీఆర్‌(Jr Ntr) బావమరిది నార్నే నితిన్‌ (Nithin NArne)హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతో మంచి మార్కులే తెచ్చుకున్నారు. తాజాగా నితిన్  హీరోగా నటించిన రెండో సినిమా ‘ఆయ్‌’ (Aay movie). అల్లు అరవింద్‌ (Allu aravind) సమర్పణలో ‘బన్నీ’ వాస్‌(Bunny vas) విద్యా కొప్పినీడి నిర్మించారు. నయన్‌ సారిక హీరోయిన్‌గా నటించారు. గోదావరి నేపథ్యంలో అమలాపురం ప్రాంతంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎన్టీఆర్‌ బావమరిది ద్వితీయ విఘ్నం నుంచి గట్టెక్కారా? అన్నది తెలుసుకోవాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
 
కథ:
కార్తీక్‌ (నార్నే నితిన్‌), సుబ్బు(రాజ్‌కుమార్‌), హరి(అంకిత కొయ్య) ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. అమలాపురం ప్రాంతంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన కుర్రాళ్లు.  కార్తిక్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా మంచి జీతానికి పని చేస్తుంటారు. హరి, సుబ్బు ఊళ్లోనే కాలం గడుపుతూ ఉంటారు. కరోనా లాక్‌ డౌన్‌ వల్ల వర్క్‌ ఫ్రమ్‌ హోం కారణంతో ఊరికొస్తాడు కార్తీక్‌. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు. పక్క ఊరికి చెందిన ఫంక్‌ పల్లవి (నయన్‌ సారిక)ని చూసి తొలిచూపులోనే మనసు పడతాడు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమెకు ఇంట్లో కండీషన్స దృష్ట్యా కులం పట్టింపు ఎక్కువ.  కార్తీక్‌ తన కులానికి చెందినవాడేనని ఇష్టపడుతుంది. కొంతకాలానికి అతని కులం వేరని తెలిసి, ఇంట్లో తెలిస్తే చంపేస్తారని అతనికి దూరంగా ఉంటుంది. దాంతో పెద్దలు కుదిర్చిన పెళ్లికి సై అంటుంది. తన ప్రేమకు కులం గోడగా నిలిచిందన బాధపడతాడు కార్తిక్‌, వీరిద్దరి పెళ్లి చేయడానికి స్నేహితులు, హరి, సుబ్బు రకరకాల ప్రణాళికలు వేస్తుంటారు. తన కొడుకు ప్రేమలో విఫలం అయ్యాడని తెలుసుకున్న కార్తిక్‌ తండ్రి అడబాల బూరయ్య (వినోద్‌ కుమార్‌) ఏం చేశాడు? పల్లవి తండ్రి వీరవాసరం దుర్గకు,  బూరయ్యకు ఉన్న సంబంధం ఏంటి? పల్లవితో కార్తీక్‌ పెళ్లి అయిందా? లేదా అన్నది కథ. (Aay movie review)

 
విశ్లేషణ:
అమలాపురంలో చిన్ననాటి స్నేహం, వినోదం. పల్లె వాతావరణం ప్రధానంగా సాగే కథ ఇది. ఈ సినిమా విషయంలో దర్శకుడు నమ్మిన ఫార్ములా ఒకటే. వినోదం పంచడం. దానికి తగ్గట్టే కథను రాసుకున్నారు. ఆ మీటర్‌ మిస్‌ కాకుండా పాత్రల్ని తెరకెక్కించారు. గోదావరి ప్రాంతానికి చెందిన మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, అనుబంధాలు, అక్కడ ఎంతో ఫేమస్‌ అయిన వెటకారం... ఇలా అన్నింటినీ కలగలిపి కథను నడిపించారు. సింపుల్‌గా మొదలైన కథ, హీరో ఇంట్రడక్షన్‌ మొదలుకొని ప్రేమలో పడే సీన వరకూ సినిమా కాస్త బోరింగ్‌గానే నడుస్తుంది. మధ్యమధ్యలో పేలే జోక్స్‌ ఉన్నా తేలిపోయాయి. నితిన్‌, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి ఇద్దరూ నయన్‌ సారికను ప్రేమించారని బయటపడుతుందో అక్కడి నుంచి కామెడీ విపరీతంగా వర్కవుట్‌ అయింది. రాజ్‌ కుమార్‌ తనదైన శైలి ఎక్స్‌ప్రెషన్స, గోదావరి యాసతో చెలరేగిపోయాడు. తెరపై ఈ ముగ్గురు స్నేహితులు కనిపించిన ప్రతిసారీ నవ్వులు పూయిస్తూనే ఉంటారు. ప్రేమ కోసం ఇద్దరు స్నేహితులు చేసే సాయం, ఒకటి చేయడానికి పడే తాపత్రయం, పెళ్లి దాకా తీసుకెళ్లే సన్నివేశాలు బావున్నాయి. అయితే ఇది గతంలో చూడని కథేమీ కాదు. ఎన్నో సినిమాల్లో చూసిందే కానీ.. దర్శకుడు తెరపై ఆవిష్కరించే తీరును బట్టే రిజల్ట్‌, ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా, అలాగని సెన్సార్‌లో తీసేసే సన్నివేశాలు లేకుండా బ్యాలెన్స్  చేస్తూ తెరకెక్కించారు. అయితే అసలు కథేంటి అన్నది ట్రాక్‌లోకి రావడానికి  సమయం పట్టింది. అది కాస్త ల్యాగ్‌ అనిపించింది. ఆ సమయం అంతా స్నేహితులు, పొలాలు, కాలేజ్‌ బస్‌, గోదావరి గట్టు ఇదే సన్నివేశాలను రిపీట్‌ చేయడంతో  కాస్త  విసుగు అనిపించింది. ఆ సందర్భంలో కూడా హరి, సుబ్బుల పాత్రలే ఆ ఫీలింగ్‌ రాకుండా చేశాయి. ద్వితీయార్థంలో కార్తిక్‌, పల్లవిల ప్రేమ సంఘర్షణ మొదలవుతుంది. కులం అడ్డుగా ఉందనే సన్నివేశాలు, ఇక పెళ్లి జరగదు.. ఎవరి దారి వారిదే అన్నంత సీను కు  వెళ్లిపోతుంది. ఇదంతా చాలా సినిమాల్లో చూసిందే. కానీ క్లైమాక్స్‌లో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్‌ సినిమా గ్రాఫ్‌ని పెంచింది. మంచితనం అనే పేరుతో తన దగ్గర లేకపోయినా అప్పులు  చేసి మరీ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, ఇంట్లోనే ఓ కుర్చీకి పరిమితమై ఉన్న బూరయ్య తన కొడుకు బాధలో ఉన్నాడనీ, అతని కోసం తండ్రిగా ఏమీ చేయలేకపోయానని, ఇప్పుడు చేయాల్సిన సమయం వచ్చిందని లేచి వీరవాసరం దుర్గ ఇంటికి వెళ్లడం, తన కొడుకు గురించి చెప్పడం, పెళ్లికి ఒప్పించడం ఆకట్టుకున్నాయి. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా వినోద్‌కుమార్‌ ఆ రోల్‌ ఎందుకు చేశారనే భావన కలుగుతుంది. అసలు ఆ పాత్రకు ఏ ప్రాధాన్యత లేదనిపిస్తుంది. కానీ క్లైమాక్స్‌ సన్నివేశాల్లో ఆ పాత్రే ట్విస్ట్‌ ఇస్తుంది. సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది. కులం కోసం పాకులాడే దుర్గ, బూరయ్య చెప్పిన ఒక్క మాటతో పెళ్లికి ఎందుకు అంగీకరించాడు, దానికి వెనకున్న కథను దర్శకుడు సూటిగా, సుత్తి లేకుండా సింపుల్‌ ఫ్లాష్‌బ్యాక్‌లో చెప్పాడు. ప్రేమకు కులం, మతం అడ్డురావనే కథాంశంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు. అదే కోవలో దర్శకుడు అంజి కె.మణి పుత్ర కులం కంటే స్నేహం గొప్పదనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అందులో సఫలం అయ్యాడు. (Aay movie review)



నటీనటుల సంగతికొస్తే నితిన్  నార్నే నటన సింపుల్‌గా ఉంది. మొదటి సినిమా కంటే ఇందులో నటనకు ఆస్కారం దొరికింది. అయితే అక్కడక్కడా ఎక్స్‌ప్రెషన్స్  మిస్‌ అయ్యాయి. డ్యాన్స్‌తో మెప్పించాడు. హీరోయిన్  పాత్రధారి నయన్‌ సారిక.. తెలుగు తెరకు కొత్త అయినా తన అందం, అభినయంతో అచ్చమైన గోదావరి అమ్మాయిగా అలరించింది. తన మ్యానరిజం, హెయిర్‌ స్టైల్‌ మెప్పించింది. రాజ్‌కుమార్‌  కసిరెడ్డి అంకిత్‌ కోయ పంచిన వినోదం సినిమాకు ప్రధానబలం. సినిమాకు ఆ ఇద్దరి పాత్రలు హైలైట్‌ అని చెప్పొచ్చు. 'అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కసిరెడ్డి పాత్ర ఈ సినిమాతో మరింత గుర్తుండిపోతుంది. పల్లవి తండ్రిగా మైమ్‌ గోపి కనిపించారు. ఆయనకు ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. పరిధి మేరకు నటించారు. అప్పటి దాకా కుర్చీకే పరిమితమైన వినోద్‌ కుమార్‌ కొన్నేళ్ల క్రితం 'అడబాల బూరయ్య అంటే ఏంటో తెలుసుకోండి' అని చెప్పిన సన్నివేశం మలుపు తిప్పింది. ఆయన నటన కూడా పరిధి దాటలేదు. సరయు చిన్న పాత్రలో మెరిసింది. దర్శకుడు అంజికి ఇది తొలి సినిమా. కథనాన్ని మలిచిన తీరు బాగుంది. కులాలే చూస్తున్నారు తప్ప, మనిషికి మనిషి సహాయం చేసుకోవడం లేదనే విషయాన్ని పల్లవి-కార్తీక్‌ల ప్రేమకథతో ముడిపెట్టి చక్కగా చెప్పాడు. మలుపులేమీ లేని కథను సన్నివేశాలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. అమలాపురం పరిసరాలు, గ్రామీణ నేపథ్యం, గోదావరి అందాలను సమీర్‌ కళ్యాణి అందంగా చూపించారు. పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. సూఫియానా పాట వినసొంపుగా ఉంది. 'డైవర్షన్‌ బ్యూటీ' పాట థియేటర్‌లో మాస్‌ని ఊపేస్తుంది.  నిర్మాణ విలువలు బావున్నాయి. లాజిక్స్‌ గురించి ఆలోచించ వద్దని టైటిల్‌ కార్డ్‌లో వేసినట్లు లాజిక్కులు గురించి పట్టించుకోకుండా సినిమాకు వెళ్తే  రెండు గంటలపాటు హాయిగా నవ్వుకోవచ్చు.  ఈ తరహా గోదావరి కామెడీ సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు. వినోదం ఆశించిన వారు సంతృప్తిగా థియేటర్‌ నుంచి బయటకొస్తారు.

Tagline: లాజిక్కులు వదిలేయండి.. సరదాగా నవ్వుకోండి.. ఆయ్‌..

Updated Date - Aug 16 , 2024 | 01:09 PM