తెలుగు హీరోయిన్‌ను పరిచయం చేస్తున్న వైవీఎస్
ABN, Publish Date - Dec 01 , 2024 | 06:37 AM
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శకుడు, నిర్మాత వైవీఎస్ చౌదరి తన తాజా చిత్రం కోసం తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు...
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శకుడు, నిర్మాత వైవీఎస్ చౌదరి తన తాజా చిత్రం కోసం తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. మహానటుడు ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావు ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వీణారావు లుక్‌ని మహిళా నిర్మాతలు సుప్రియ, స్వప్నాదత్ విడుదల చేశారు. సంప్రదాయ, ఆధునిక దుస్తుల్లో వీణారావు ఎంతో అందంగా ఉన్నారు. పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకుల్ని రంజింప చేస్తానని తన అభిమాన నటి డాక్టర్ భానుమతి సాక్షిగా ప్రమాణం చేశారు.
కొత్త హీరోయిన్‌కి అభినందనలు తెలిపి, ఆమె సక్సెస్ కావాలని సుప్రియ, స్వప్న కోరారు. ఈ సందర్భంగా వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ‘మా హీరో నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. హీరోయిన్ వీణ తెలుగు అమ్మాయి. మంచి డ్యాన్సర్. తనకి కూడా మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ఫస్ట్ దర్శన్‌ను లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నలకు నిర్మాత యలమంచిలి గీత ధన్యవాదాలు తెలిపారు.