ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాం

ABN, Publish Date - Sep 06 , 2024 | 12:38 AM

తెలుగు రాష్ట్రాల్లో వరద ముప్పు బారిన పడిన బాధితుల కోసం ఇప్పటికే తెలుగు సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వరద బారిన పడిన కుటుంబాలను...

తెలుగు రాష్ట్రాల్లో వరద ముప్పు బారిన పడిన బాధితుల కోసం ఇప్పటికే తెలుగు సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వరద బారిన పడిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలుగు చలన చిత్రసీమ ప్రముుఖులు గురువారం ఓ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిల్మ్‌ చాంబర్‌ గౌరవ కార్యదర్శి దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఫిల్మ్‌ చాంబర్‌ తరపున రూ.25 లక్షలు.. నిర్మాతల తరపున రూ.10 లక్షలు.. ఫెడరేషన్‌ తరపున రూ.5 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళంగా ఇస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘మా దగ్గుబాటి కుటుంబం తరపున బాధితుల కోసం రూ.కోటి విరాళం అందజేస్తున్నాం. కేవలం డబ్బులే కాకుండా.. నిత్యావసరాలను కూడా పంపిణీ చేస్తాం. బాధితులకు ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని డి. సురేశ్‌బాబు అన్నారు. ‘‘మేమంతా ఈ స్థాయిలో ఉండటానికి కారణం.. మమ్మల్ని ఆదరించిన ప్రజలే. వరద బారిన పడిన వారందరినీ తప్పకుండా ఆదుకుంటాం’’ అని దర్శకుడు కె.రాఘవేంద్ర రావు తెలిపారు.


‘‘మా నిర్మాణ సంస్థ తరపున తెలంగాణకు రూ.25 లక్షలు.. ఆంధ్రప్రదేశ్‌కు రూ.25లక్షలు ప్రకటిస్తున్నాను. ఇండస్ట్రీలోని వారంతా ఈ సమయంలో ముందుకు వచ్చి విరాళాలు అందించాలి’’ అని నిర్మాత దిల్‌ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, ప్రసన్నకుమార్‌, జెమినీ కిరణ్‌, అశోక్‌ కుమార్‌, అనిల్‌ అమ్మిరాజు, భరత్‌ చౌదరి పాల్గొన్నారు.

దగ్గుబాటి కుటుంబం రూ.కోటి

దిల్‌ రాజు రూ.50 లక్షలు

ఫిల్మ్‌ చాంబర్‌ రూ.50 లక్షలు

నిర్మాతల మండలి రూ.20 లక్షలు

ఫిల్మ్‌ ఫెడరేషన్‌ రూ.10 లక్షలు

Updated Date - Sep 06 , 2024 | 12:38 AM