VIjay Antony: అమ్మాయిలని ఎలా హ్యాండిల్ చెయ్యాలో 'లవ్ గురు' చూసి తెలుసుకోండి:
ABN, Publish Date - Mar 16 , 2024 | 03:39 PM
'బిచ్చగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన తమిళ నటుల్లో విజయ్ ఆంటోనీ ఒకరు. ఇప్పుడు అతను 'లవ్ గురు' అనే సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా నేపధ్యం గురించి విజయ్ ఆంటోనీ హైదరాబాదులోని మీడియా సమావేశంలో చెప్పారు
తమిళ నటుడు విజయ్ ఆంటోనీ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వుంటారు. అతని సినిమాలు తెలుగులో కూడా చాలా బాగా విజయవంతం అవుతూ ఉంటాయి. ఈసారి అతను ఇంతకు ముందు సినిమాలకి భిన్నంగా మొదటిసారి ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సినిమా 'లవ్ గురు'. మృణాళిని రవి కథానాయకురాలిగా చేస్తోంది, వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు.
దాదాపు 95 శాతం మందికి లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా అబ్బాయిలకు, అమ్మాయిలను ఎలా హ్యాండిల్ చెయ్యాలా అనేది పెద్ద సమస్య. అటువంటప్పుడు మీరు ఈ 'లవ్ గురు' సినిమా చూస్తే అమ్మాయిలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. నేనే లవ్ గురులా ఆ పరిష్కారాలు చెబుతాను, అని చెప్పారు విజయ్ ఆంటోనీ ఈ సినిమా మీడియా సమావేశంలో. ఈ సినిమాలో అతను కథానాయకుడిగా చేసాడు, లీల అనే అమ్మాయితో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు.
అయితే ఆ సమస్యలను నేను ఎలా ఎదుర్కొన్నాను అనేది దర్శకుడు వినాయక్ సినిమాలో చాలా వినోదాత్మకంగా చూపించాడు అని చెప్పారు విజయ్ ఆంటోనీ. ఏప్రిల్ 11న రంజాన్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 నుంచి 600 థియేటర్స్ లో 'లవ్ గురు' సినిమాను విడుదల చేయబోతున్నాం అని విడుదల గురించి చెప్పారు విజయ్ ఆంటోనీ. ఇప్పటిదాకా విజయ్ ఆంటోనీ 12 నుండి 13 సినిమాలు చేస్తే వాటిలో 8 నుండి 9 సినిమాలకు భాష్యశ్రీ గారు పని చేశారు. 'బిచ్చగాడు' సినిమా నుంచి ఆయన నాతో ట్రావెల్ చేస్తున్నారు. కథలోని సందర్భాన్ని మరింత అందంగా రాస్తారు, అని చెప్పారు విజయ్.
ఈ సినిమాలో కథానాయకురాలి మృణాళిని రవి తన పాత్రని బాగా అర్థం చేసుకుని ఆకట్టుకునేలా మంచి ప్రతిభ కనపరిచింది అని చెప్పాలి. మా దర్శకుడు ఒక సంవత్సరం పాటు ఈ సినిమాకోసం వినియోగించి మంచి మంచి స్క్రిప్ట్ ఇచ్చారు. అంతే బాగా తెరకెక్కించారు కూడా. ఆయన ఒక మంచి నటుడు కూడా. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కంటే లవ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రేమ అనేది యూనివర్సల్ గా ఎక్కడైనా ఒక్కటే. 'లవ్ గురు' చూసిన తర్వాత పెళ్లైన వాళ్లు, కాని వాళ్లు తమ జీవితాల్లోని ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు, అని సినిమా గురించి విజయ్ ఆంటోనీ చెప్పారు.