వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటించాలని ఉంది

ABN, Publish Date - Sep 18 , 2024 | 04:57 AM

తమిళంలో తన అభిమాన దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ దర్శకత్వం వహించే తమిళ స్ట్రైట్‌ చిత్రంలో నటించి, దానిని తెలుగులోకి అనువదించాలని ఉందని జూనియర్‌ ఎన్టీఆర్‌ చెప్పారు...

తమిళంలో తన అభిమాన దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ దర్శకత్వం వహించే తమిళ స్ట్రైట్‌ చిత్రంలో నటించి, దానిని తెలుగులోకి అనువదించాలని ఉందని జూనియర్‌ ఎన్టీఆర్‌ చెప్పారు. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్‌టీఆర్‌ హీరోగా నటించిన ‘దేవర’ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం చెన్నైలో విలేకరుల సమావేశం జరిగింది. తమిళంలో స్ట్రైట్‌ చిత్రం ఎప్పుడు చేస్తారని విలేకరులు ప్రశ్నించగా, అలా సమాధానం చెప్పారు ఎన్టీఆర్‌. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడితో పాటు హీరోయిన్‌ జాన్వీకపూర్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌, కెమెరామెన్‌ రత్నవేలు, గేయరచయిత రామజోగయ్య శాస్ర్తి, తమిళనాడు ‘దేవర’ చిత్ర పంపిణీదారుడు, నిర్మాత ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ... చెన్నైతో తనకు చిన్ననాటి నుంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ పునాదులు చెన్నైలో ఉన్నాయని, ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలివెళ్లిందన్నారు.


దేవర చిత్రం ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం నటీనటులేనని, ముఖ్యంగా, దర్శకుని విజన్‌లో తెరపై ప్రతిబింబించేలా చేసిన సినిమాటోగ్రాఫర్‌, ఎడిటర్‌, సంగీత దర్శకులకు ఆ క్రెడిట్‌ దక్కుతుందన్నారు. ప్రేక్షకులంతా ఒక్కటేనని బాహుబలి చిత్రం నిరూపించిందని, ఇప్పటివరకు భాషాపరంగా వేరుగా ఉన్నా, సినిమాపరంగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ అంతా ఒక్కటేనని నిరూపితమైందన్నారు.

చెన్నై, ఆంధ్రజ్యోతి

Updated Date - Sep 18 , 2024 | 04:57 AM