Tollywood Box Office: అందరి దృష్టి ఈ నాలుగు సినిమాలపైనే

ABN , Publish Date - May 02 , 2024 | 11:42 AM

ఈ నాలుగు నెలల్లో విడుదలైన తెలుగు సినిమాల్లో రెండు, మూడు సినిమాలు పెద్ద విజయం సాధిస్తే, కొన్ని సినిమాలు మధ్యమంగా ఆడాయి. అయితే ఇప్పటివరకు విడుదలైన సినిమాలన్నీ ఒక ఎత్తయితే, ఈ రాబోయే నాలుగు సినిమాలు ఇంకో ఎత్తు అంటున్నారు విశ్లేషకులు. ఒక్కో సినిమాకి ఎంత బడ్జెట్ అంటే...

Tollywood Box Office: అందరి దృష్టి ఈ నాలుగు సినిమాలపైనే
Stills from Kalki 2898 AD, Pushpa 2, Devara, Game Changer

ఈ సంవత్సరం నాలుగు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. అవి ఒక్క తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా విడుదలవుతున్నాయి. ఈ నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు విడుదల తేదీలు, ప్రచారాలు అప్పుడే మొదలు పెట్టేసారు. ఇంకో రెండు సినిమాలు ఇంకా చిత్రీకరణ దశలోనే వున్నాయి, కానీ ఆ రెండు సినిమాలు కూడా ఈ సంవత్సరమే విడుదలవుతున్నాయి. ఈ నాలుగు సినిమాలకి పెట్టిన బడ్జెట్ వీటిపై వచ్చే వ్యాపారాలు సుమారు రూ. రెండువేల కోట్లకి పైగా ఉంటుందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

Kalki.jpg

ఇంతకీ ఈ నాలుగు సినిమాలు ఏవంటే, ముందుగా జూన్ 27 న విడుదలవుతున్న 'కల్కి 2898 ఏడి'. ఇందులో ప్రభాస్ కథానాయకుడు కాగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని, ఇంకా చాలామంది నటీనటులు వున్నారు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కథ అని చెపుతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకుడు కాగా, అశ్విని దత్ నిర్మాత. ఈ సినిమాకి సుమారు రూ. 600 కోట్లు బడ్జెట్ అయిందని వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం ఈ సినిమా వ్యాపారం కూడా అంతే విధంగా ఉండాలి, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒక్క తెలుగులోనే కాకుండా మిగతా నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులతో పాటు, ఓటిటి, శాటిలైట్ హక్కులు అన్నీ కలిపితే నిర్మాతకి ఎటువంటి నష్టం ఉండకపోవచ్చు అని కూడా అంటున్నారు.

సినిమా: కల్కి 2898 ఏడి

నటీనటులు: ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, కమల్ హాసన్

దర్శకుడు: నాగ్ అశ్విన్

నిర్మాతలు: అశ్విని దత్

బడ్జెట్: సుమారు రూ. 600 కోట్లు

alluarjunpushpa2.jpg

ఇక రెండో సినిమా 'పుష్ప 2: ది రూల్'. ఇది ఆగస్టు 15న విడుదలవుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడు. ఇది 'పుష్ప: ది రైజ్' అనే సినిమాకి సీక్వెల్ గా అంటే రెండో భాగంగా వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే రూ.275 కోట్లకి తీసుకుందని వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమా హిందీ హక్కులు అనిల్ తడాని రూ. 200 కోట్లకు తీసుకున్నారని ఇంకో వార్త కూడా వచ్చింది. ఈ సినిమా మొదటి భాగం హిందీలో సుమారు రూ.125 కోట్ల వ్యాపారం చేసింది కాబట్టి, ఇప్పుడు రెండో భాగం అంతకన్నా ఎక్కువ చేస్తుందని నమ్ముతున్నారు. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 500 కోట్లు అయిందని వార్తలు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి నిర్మాతలు.

సినిమా: పుష్ప 2: ది రూల్

నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, బ్రహ్మాజీ, సునీల్, అనసూయ

దర్శకుడు: సుకుమార్

నిర్మాత: మైత్రి మూవీ మేకర్స్

బడ్జెట్: సుమారు రూ. 500 కోట్లు

Devara.jpg

మూడో సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమా. బాలీవుడ్ నటి, శ్రీదేవి బోనీ కపూర్ ల కుమార్తె జాన్వీ కపూర్ ఇందులో కథానాయిక. కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది, ఇందులో మొదటి భాగం ముందుగా అనుకున్న తేదీ ప్రకారం అయితే ఈపాటికి విడుదలైపోవాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా విడుదల దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 10 కి వాయిదా వేశారు. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.400 కోట్లు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇదే. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో ప్రతినాయకుడి పాత్ర పోహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాదులో ఒక సముద్రం సెట్ వేశారని కూడా అన్నారు. అలాగే కొంత చిత్రీకరణ గోవాలో జరిగిందని, మరికొంత విశాఖపట్నంలో ఉంటుందని చెపుతున్నారు. సముద్రం నేపధ్యంగా వస్తున్న సినిమా కాబట్టి, ఎక్కువగా తీరా ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకి ఇంకా చాలా సమయం వున్నా, ఇది ఎన్టీఆర్ కి ఒక ప్రతిష్టాత్మక చిత్రంగా వుండబోతోంది. తెలుగులో కాకుండా పాన్ ఇండియా లెవెల్లో అతని స్టామినా ఏంటో ఈ సినిమా ద్వారా నిరూపితం అవుతుంది కాబట్టి, ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్, అతని బావమరిది కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాకి నిర్మాతలు.

సినిమా: దేవర

నటీనటులు: ఎన్.టి. రామారావు, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శృతి మరాఠే

దర్శకుడు: కొరటాల శివ

నిర్మాతలు: నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని

బడ్జెట్: సుమారు రూ.400 కోట్లు

gamechanger3.jpg

ఇక నాలుగో సినిమా రామ్ చరణ్, దర్శకుడు శంకర్ ల కలయికలో వస్తున్న 'గేమ్ చేంజర్'. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు, కానీ ఈ సంవత్సరమే విడుదలవుతుందని మాత్రం అంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టి రెండు సంవత్సరాలకి పైగా అవుతున్నా ఇంకా జరుగుతూనే వుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయిక, కాగా ఈ సినిమాలో అంజలి, జయరాం, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్ ఇలా చాలామంది నటీనటులు వున్నారు. శంకర్ ఈ సినిమాతోపాటుగా కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'భారతీయుడు 2' సినిమాకూడా చిత్రీకరణ చెయ్యాల్సి రావటంవలన ఈ సినిమా చిత్రీకరణలో జాప్యం జరిగింది అని అంటున్నారు. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు, అతని నిర్మాణంలో చిత్రీకరణ కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్న సినిమా ఈ 'గేమ్ చేంజర్' మాత్రమే అని అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.300 కోట్లు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా వ్యాపారం ఇంకా ముగియలేదని, ఈ సినిమా విడుదల తేదీ ఖరారైతే అప్పుడు వ్యాపారలావాదేవీలు పూర్తవచ్చు అని అంటున్నారు.

సినిమా: గేమ్ చేంజర్

నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్

దర్శకుడు: శంకర్

నిర్మాత: దిల్ రాజు

బడ్జెట్: సుమారు రూ.300 కోట్లు

ఈ నాలుగు పెద్ద సినిమాలు ఈ సంవత్సరమే విడుదలవుతున్నాయి, ఈ సినిమాలపై వేలకోట్ల రూపాయల వ్యాపారం జరగబోతోంది. అలాగే పరిశ్రమ మనుగడ కూడా ఈ నాలుగు సినిమాలపై వుంది. ఇవన్నీ భారత దేశంలోనే కాకుండా, విదేశీ మార్కెట్టుని సైతం ప్రభావితం చెయ్యగల సినిమాలు అని చెపుతున్నారు. ముందుగా జూన్ 27 న విడుదలవబోతున్న 'కల్కి 2898 ఏడి' సినిమాపైనే అందరి దృష్టి వుంది.

Updated Date - May 02 , 2024 | 11:45 AM