వారి మౌనం అంగీకారమే : నటి రాధిక

ABN, Publish Date - Sep 03 , 2024 | 05:48 AM

చిత్రపరిశ్రమలో నటీమణులపై జరుగుతున్న లైంగిక వేధింపులపై పలువురు సీనియర్‌ హీరోలు ‘నో కామెంట్‌’ అంటూ మౌనం దాల్చడంపై సీనియర్‌ నటి రాధిక ఘాటుగా స్పందించారు. వారి మౌనం అంగీకారంతో సమానమని వ్యాఖ్యానించారు. రాధిక సోమవారం సాయంత్రం విలేకరులతో

చిత్రపరిశ్రమలో నటీమణులపై జరుగుతున్న లైంగిక వేధింపులపై పలువురు సీనియర్‌ హీరోలు ‘నో కామెంట్‌’ అంటూ మౌనం దాల్చడంపై సీనియర్‌ నటి రాధిక ఘాటుగా స్పందించారు. వారి మౌనం అంగీకారంతో సమానమని వ్యాఖ్యానించారు. రాధిక సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.. ‘చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉన్న మాట నిజమే. నా కళ్ళ ఎదుటే పలు సంఘటనలు జరిగాయి. వాటిని నేను అక్కడే ఎదిరించాను. బాధితులకు అండగా నిలబడ్డాను. ప్రముఖ హీరోను పెళ్ళి చేసుకున్న ఒక హీరోయిన్‌కు ఈ తరహా వేధింపులు తప్పలేదు. ఆ సమయంలో ఆమెకు నేను అండగా ఉన్నాను. సినిమాలో నటించే హీరోయిన్‌తో పాటు జూనియర్‌ ఆర్టిస్టులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆయా చిత్ర నిర్మాతలు, ప్రొడక్షన్‌ యూనిట్‌ సభ్యులదే. ఒక సంఘటన జరిగితే బాధితురాలికి న్యాయం జరిగేందుకు కొన్నేళ్ళ పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది.. ఉదాహరణకు నిర్భయ కేసే తీసుకోండి. ఎనిమిదేళ్ళ సమయం పట్టింది. ఈ లోపు ఆ బాధితులురాలు ఎంతగానో మానసిక క్షోభకు గురవుతారు. సమాజ సేవ కోసం, ప్రజల తరపున పోరాటం చేసేందుకు రాజకీయ పార్టీలు స్థాపించాలని భావించే పెద్దపెద్ద హీరోలు తమ తోటి మహిళా కళాకారులకు అండగా నిలవడం నేర్చుకోవాల్సి వుంది. ఇలాంటి తరుణంలోనే హీరోలు స్పందించాలి. కొందరి మౌనం అంగీకారంతో సమానం’ అని ఆమె వ్యాఖ్యానించారు. మాలీవుడ్‌ కేరవాన్‌లలో సీక్రెట్‌ కెమెరాలు పెట్టారంటూ రాధిక చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేరళ పోలీసులు.. సోమవారం ఆమె వద్ద ఆరా తీశారు. దీని గురించి రాధిక మాట్లాడుతూ.. తనకు తెలిసిన విషయాలనే చెప్పాను తప్ప, తాను ఎవ్వరిపైనా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. మాలీవుడ్‌ హేమా కమిటీ నివేదిక అంశాల వెల్లడిపై ప్రస్తుతమున్న టాప్‌ హీరోలు తమ అభిప్రాయాలు చెబితే తమలాంటి నటీమణులకు ఓదార్పు కలుగుతుందన్నారు. ఎవరు తప్పు చేసినా తాను చూస్తూ ఊరుకోబోనని, హేమాకమిటీలా కోలీవుడ్‌కు కూడా ఓ కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాధిక పేర్కొన్నారు.


మీటూ పార్ట్‌ 2 వచ్చింది అంతే

మహిళల పట్ల మాలీవుడ్‌లో ఉన్న పరిస్థితులు తమిళ పరిశ్రమలో లేవన్నారు హీరో జీవా. ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ‘మీటూ’ పార్ట్‌ 1 వచ్చింది. ఇప్పుడు పార్ట్‌ 2 చూస్తున్నామన్నారు. రిపోర్టర్లు వరుస ప్రశ్నలు సంధించడంతో ఆయన వారిపై కోపగించుకొని వెళ్లిపోయారు. జీవా వ్యాఖ్యలను గాయని చిన్మయి శ్రీపాద ఖండించారు. కోలీవుడ్‌లో లైంగిక వేధింపులు లేవని ఆయన ఎలా చెబుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. హేమ కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న విచారణను సీబీఐకి అప్పగించాలని న్యాయవాదులు జన్నత్‌, ప్రేమ్‌జిత్‌లు హైకోర్టును ఆశ్ర యించారు. హేమ కమిటీ ముందు హాజరైన బాధితులకు రక్షణ కల్పించాలనీ, ఈ తరహా కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని వారు కోరారు. మహిళలపై వేధింపులు ఒక్క సినిమా రంగానికి పరిమితం కాదు, ఇతర రంగాల్లోనూ ఉన్నాయి, కాబట్టి అక్కడ కూడా హేమ కమిటీ లాంటివి ఏర్పాటు చేయాలని దర్శకుడు వెంకట్‌ప్రభు అన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 05:48 AM