Sundeep Kishan: చిరంజీవి చెయ్యాల్సిన సినిమా, సందీప్ కిషన్ కి...
ABN, Publish Date - Mar 12 , 2024 | 02:59 PM
సందీప్ కిషన్ 30 అంటూ ఈరోజు ఒక సినిమా అధికారికంగా ప్రకటించారు. బెజవాడ ప్రసన్న కుమార్ కథ, నక్కిన త్రినాథ రావు దర్శకుడు. అయితే ఇదే కథని చిరంజీవి, సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్ లో చెయ్యాలని ఇంతకు ముందు అనుకున్నారని ఒక టాక్. ఇప్పుడు అదే కథ మళ్ళీ వెనక్కి వచ్చింది అని ఇంకో టాక్...
బెజవాడ ప్రసన్నకుమార్ కథ తిరిగి తిరిగి చివరికి చేరవలసిన చోటుకే చేరింది. ప్రసన్న కుమార్ తండ్రి, కుమారుడు మధ్య జరిగే ఒక కథని వినోదాత్మకంగా రాసుకున్నారు. ముందుగా ఆ కథని శ్రీవిష్ణు, రావు రమేష్ చెయ్యాల్సి వుంది అని తెలిసింది. అయితే 'సామజవరగమన' సినిమా విడుదలవడం, అందులో శ్రీవిష్ణు, నరేష్ ఇద్దరూ కూడా తండ్రీ కొడుకులుగా చెయ్యడం ఆ సినిమా విజయవంతం అవ్వటం తెలిసిన విషయమే. అందుకని శ్రీవిష్ణు మళ్ళీ తండ్రీకొడుకుల కథ, ఇది కూడా వినోదాత్మకంగా ఉండటంతో వెంటనే అలాంటిదే ఎందుకు చెయ్యడం అని అతను ప్రసన్నకుమార్ కథని చెయ్యలేదు అని తెలిసింది.
ప్రసన్నకుమార్ మరో శ్రీవిష్ణు చెయ్యను అనగానే, అతని స్థానంలో ఇంకొక నటుడు కోసం చూస్తూ ఈకథని తనకి సన్నితులైన వారికి చెప్పారు. ఆ వ్యక్తి ఈ కథని చిరంజీవి కుమార్తె సుష్మిత కి వినిపించారు, ఆమె వెంటనే కథ బాగుంది అని తన తండ్రి చిరంజీవితో ఈ సినిమా చెయ్యాలని భావించింది. ప్రసన్న కుమార్ ని పిలిపించి చిరంజీవి కి కథ చెప్పించింది అని, చిరంజీవికి బాగా నచ్చిందని ఒక వార్త అప్పట్లో హల్ చల్ చేసింది. అప్పుడే ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు అనుకున్నారన్న వార్త కూడా వైరల్ అయింది. ఆ కథకి సిద్ధు జొన్నలగడ్డ చిరంజీవి కుమారుడుగా ఇందులో నటించనున్నాడు అన్న వార్త కూడా అప్పట్లో వైరల్ అయిన సంగతి అందరికి తెలిసిన విషయమే.
ఏమైందేమో ఏమో సిద్ధు తనకి వేరే సినిమాలతో చాలా బిజీగా ఉండటంతో ఈ చిరంజీవి సినిమా చెయ్యడానికి అవలేదు. చిరంజీవి కూడా ముందుగా ఫాంటసీ సినిమా అయిన 'విశ్వంభర' చేద్దాం అని దర్శకుడు మల్లిడి వసిష్ఠతో చేస్తున్నారు. దానికితోడు సిద్ధు ప్లేస్ లో వేరే నటుల పేర్లు వినిపించినా, ఎందుకో చిరంజీవి ఈ ప్రాజెక్ట్ మీద అంతగా దృష్టి పెట్టలేదు. ఆలా చిరంజీవి తన కుమార్తెతో ప్రకటించిన ఈ సినిమా పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే కథ తిరిగి తిరిగి సందీప్ కిషన్ దగ్గరికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఈరోజు సందీప్ కిషన్, నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో ఎస్కె 30 అంటూ ఒక సినిమాని అధికారికంగా ప్రకటించారు. దీనికి బెజవాడ ప్రసన్న కుమార్ కథ ఇవ్వగా, రాజేష్ దందా నిర్మాత. అప్పుడు చిరంజీవి, సిద్ధు చెయ్యాల్సిన సినిమా, దానికి ముందు రావు రమేష్, శ్రీవిష్ణు చెయ్యాల్సిన సినిమా, ఇప్పుడు ఇలా సందీప్ కిషన్ ని వరించింది అని ఒక టాక్ నడుస్తోంది. చాలామంది ఇది మలయాళం సినిమా 'బ్రో డాడీ' కి కాపీ అని అనుకుంటున్నారు, కానీ ఈ కథకి ఆ కథకి సంబంధం లేదని తెలిసింది. ఈ కథని ప్రసన్న కుమార్ 'బ్రో డాడీ' విడుదలకి ముందే రాసుకున్నది అని తెలుస్తోంది. ఇప్పుడు ఇందులో తండ్రిగా మరి రావు రమేష్ చేస్తున్నారా? అన్నదే ప్రశ్న?