Tollywood producers met Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి టాలీవుడ్ పెద్దలను ఎందుకు కలిసారంటే...

ABN, Publish Date - Jun 25 , 2024 | 12:35 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన నిర్మాతలని కలిశారు. చాలామంది అనుకుంటున్నట్టుగా ఇది తమ సినిమా టికెట్ రేట్స్ పెంచమని అడగటానికి కాదు, దీని వెనకాల పవన్ కళ్యాణ్ ఒక బృహత్తరమైన ఆలోచనతో ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగ యువకులకు సంబంధించి ఒక మంచి కార్యక్రమం చెయ్యడానికి వీలుగా కలిసినట్టుగా తెలుస్తోంది.

Tollywood producers with AP Deputy Chief Minister Pawan Kalyan

నిన్న తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన చాలామంది నిర్మాతలు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిశారు. కలిసిన వారిలో ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, సూర్యదేవర రాధాకృష్ణ, యార్లగడ్డ సుప్రియ ఇలా చాలామంది పవన్ కళ్యాణ్ ని కలిశారు. అయితే చాలామంది ఆంధ్రాలో సినిమా టికెట్ రేట్స్ పెంచడానికి ఈ నిర్మాతలు పవన్ కళ్యాణి ని కలిసినట్టుగా అనుకుంటున్నారు. కానీ అది కాదు, ఆంధ్ర యువకుల మేలు కోరే ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ కలిసినట్టుగా తెలిసింది.

ప్రస్తుత ప్రభుత్వం కొన్ని లక్షల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. "అందుకని మమ్మల్ని పిలిచి ఆంధ్రాలో యువకులకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, పరిశ్రమ నుండి మీరు ఎలా సాయపడతారు," అనే విషయంపై ఎక్కువ దృష్టి పెట్టారు అని చెప్పారు నిర్మాత సురేష్ బాబు. పదిమందికైనా, లేదా వందలమందికైనా అక్కడ ఉద్యోగ అవకాశం కల్పించే విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పారు.

పరిశ్రమ తరపున మేము అక్కడ ఒక స్టూడియో నిర్మిచినా, లేదా చిత్రీకరణలు జరిపినా, లేదా ఇంకేమైనా పరిశ్రమకి సంబంధించి ఆంధ్రాలో మొదలు పెడితే, అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఆ విధంగా నిర్మాతలు, పరిశ్రమకి సంబందించిన పెద్దలు అలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని వస్తే, అవి అమలు అయేట్టు చూస్తామని చెప్పారని సురేష్ బాబు చెప్పారు. అందుకని చిత్ర పరిశ్రమలోని అందరూ కలిసి చర్చింది తగు నిర్ణయాలు తీసుకొని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందుంచుతారని తెలుస్తోంది.

ఇది ఒక మంచి ఆలోచన అని, నిరుద్యోగ సమస్య ఇప్పుడు చాలా ప్రధానమైనదని, ఆ సమస్యపై ఎక్కువ దృష్టి పెట్టిన ప్రస్తుత ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని నిర్మాతలని కలవటంలో ముఖ్య ఉద్దేశం కూడా అదేనని తెలుస్తోంది. సురేష్ బాబుకి విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో వుంది, అక్కడ చాలా సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి. స్టూడియోలో ఒక్క చిత్రీకరణలే కాకుండా సురేష్ బాబు ఆ స్టూడియోలో గేమింగ్ జోన్, ఇంకా పిల్లలకు పనికొచ్చే ఆటలు, అలాగే స్టూడియోని ఒక పర్యాటక కేంద్రంగా కూడా తాయారు చేస్తున్నారు. దీనివలన చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి.

Updated Date - Jun 25 , 2024 | 12:35 PM