Tollywood: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంక్షోభం, ఆగిపోయిన షూటింగ్స్...
ABN, Publish Date - Mar 06 , 2024 | 04:36 PM
ఇంతకు ముందు మొదలుపెట్టిన సినిమాలు తప్పితే, కొత్తగా ఎటువంటి సినిమా షూటింగ్స్ మొదలవడం లేదని, తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు సంక్షోభంలో పడిందని టాక్ నడుస్తోంది. చాలామంది క్యారెక్టర్ నటులు పని లేక ఇంట్లో కూర్చుంటున్నారని తెలిసింది. దీనికి సినిమా వ్యాపారాలు అన్నీ పడిపోవటమే కారణం అని అంటున్నారు...
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇప్పుడు చాలా గడ్డు సమస్యని ఎదుర్కొంటోంది అని తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే తెలుగు సినిమాల థియేట్రికల్, ఓటిటి, శాటిలైట్, డిజిటల్ వ్యాపారం పడిపోయిందో అప్పటి నుండి తెలుగు పరిశ్రమలో ఒక చిన్న సంక్షోభం తలెత్తింది అని తెలుస్తోంది. ఇప్పుడు పరిశ్రమలో ఎక్కువగా షూటింగ్స్ నడవటం లేదని, ఇంతకు ముందు ఏ సినిమాలైతే షూటింగ్స్ మొదలెట్టారో ఆ సినిమాలే పూర్తి చెయ్యడానికి చూస్తున్నారు, తప్పితే ఇంతకు ముందులా సినిమా షూటింగ్స్ అయితే ఎక్కువ జరగటం లేదు అని తెలుస్తోంది. (Telugu film industry is in deep trouble)
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర', అల్లు అర్జున్ 'పుష్ప 2', ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898', చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ సినిమా 'విశ్వంభర', నాని నటిస్తున్న 'సరిపోదా శనివారం', రవితేజ, హరీష్ శంకర్ సినిమా 'మిస్టర్ బచ్చన్', ఇవి కాకుండా ఇంకా కొన్ని సినిమాలు తప్పితే కొత్తగా సినిమాలు ఏవీ షూటింగ్స్ మొదలెట్టలేదని తెలుస్తోంది. గత ఏడాది సుమారు 250కి పైగా తెలుగు సినిమాలు విడుదలయ్యాయి, డబ్బింగ్ సినిమాలతో కలిపి సుమారు 300 సినిమాలు ఉండొచ్చు. (Except the films that are started some time back, no new film shootings in Telugu film industry) గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం అన్ని సినిమాలు ఉండకపోవచ్చని అంటున్నారు. ఇలా అవటానికి ఓటిటి, శాటిలైట్ ఛానల్, డిజిటల్ వ్యాపారాలు బాగా తగ్గిపోవటమే కారణమని అంటున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ప్రతి సినిమా థియేట్రికల్ వ్యాపారం కాకుండా డిజిటల్ వ్యాపారం కూడా బాగుండటంతో సినిమాలు నడిచేవి. కానీ ఇప్పుడు డిజిటల్ వ్యాపారం కూడా బాగా పడిపోవటంతో నిర్మాతలు షూటింగ్స్ వెళ్ళడానికి జంకుతున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే అగ్ర నటుల పారితోషికం కూడా విపరీతంగా పెరిగిపోవటం ఇంకో కారణం అని అంటున్నారు. సినిమా బడ్జెట్ కన్నా కథానాయకుడి, కథానాయకురాలు పారితోషికాలు ఎక్కువగా ఉండటంతో, సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిందని, దానికి తోడు ఈ డిజిటల్, థియేట్రికల్ వ్యాపారం కూడా పడిపోవటంతో నిర్మాతలకు ఏమి చెయ్యాలో తెలియక ఒక అయోమయ పరిస్థితిలో వున్నారని తెలుస్తోంది. ప్రముఖ కేరక్టర్ నటులు బ్రహ్మాజీ, మురళి శర్మలు గత మూడు నెలలుగా పని లేక ఖాళీగా వున్నారని, సినిమా షూటింగ్స్ ఎక్కువ అవటం లేదు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని ఒక నిర్మాత చెప్పారు. అలాగే చాలామంది తెలుగు నటీనటులు పనిలేకుండా వున్నారని కూడా తెలుస్తోంది.
"ఇలాంటి సంక్షోభాలు ఇంతకు ముందు చాలా వచ్చాయి, సినిమా పరిశ్రమ ఇలాంటి వాటిని ఎదుర్కొని ఇంకా బలంగా అభివృద్ధిలోకి వెళ్ళింది. ఇప్పుడు కొంచెం వ్యాపార లావాదేవీల దృష్ట్యా కొత్త సినిమా షూటింగ్ లు ఎక్కువ జరగకపోవచ్చు కానీ, ముందు ముందు దీనికి పరిష్కారం లభించి ఇంతకన్నా ఎక్కువ సినిమాలు పరిశ్రమ నుండి వస్తాయి, అందులో సందేహం లేదు," అని చెప్పారు, దామోదర ప్రసాద్, తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కార్యదర్శి. (Telugu Film Chamber of Commerce General Secretary Damodara Prasad)
థియేట్రికల్, ఓటిటి, డిజిటల్, శాటిలైట్ హక్కుల వ్యాపారం ఇప్పుడు కొంచెం తగ్గిన మాట నిజమే కానీ ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఉండదని, త్వరలోనే వీటన్నిటికీ ఒక పరిష్కారం లభిస్తుందని దామోదర ప్రసాద్ చెప్పారు. గడచిన 90 ఏళ్లలో తెలుగు పరిశ్రమ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది, అలాగే వాటిని అధిగమించి ఈరోజు ప్రపంచ స్థాయి చిత్రాలను తీయగలుగుతున్నామని, అందుకని చిన్న చిన్న సంక్షోభాలు సహజమని, అవి తొందరగానే సమసిపోతాయని అన్నారు దామోదరప్రసాద్.