మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Premalu: మలయాళం హిట్ సినిమాలో తెలుగు నటుడు సంచలనం

ABN, Publish Date - Mar 15 , 2024 | 03:39 PM

తెలుగు సినిమాలలో ఇతర భాషా నటులు కనపడటం సర్వ సాధారణం, కానీ ఇతర భాషా సినిమాలలో తెలుగు నటులు కనపడటం తక్కువ. అందులోకి మలయాళం సినిమాలో అయితే తెలుగు నటులు కనిపించడం బహు తక్కువ, కానీ ఈమధ్యనే విడుదలైన మలయాళం సినిమా 'ప్రేమలు' లో తెలుగు నటుడు ఒక ముఖ్యపాత్ర పోషించాడు. ఇంతకీ అతనెవరంటే..

Kalyan Palagummi with Premalu film lead pair Mamitha Baiju and Naslen

గత వారం తెలుగులో 'ప్రేమలు' అనే మలయాళం సినిమా డబ్బింగ్ చేసి అదే పేరుతో విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ తెలుగు హక్కులను తీసుకున్నారు. అంతకు ముందు ఈ చిన్న సినిమా మలయాళంలో విడుదలై వందకోట్లు కలెక్టు చేసిందని వార్తలు వచ్చాయి. అయితే ఇది మలయాళం సినిమా అయినా, హైదరాబాదులో ఎక్కువభాగం షూటింగ్ చేశారు. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇది పూర్తిగా మలయాళం నటీనటులతో నిర్మించే సినిమా అయినా, ఈ సినిమాలో ఒక తెలుగు నటుడు కూడా కీలక పాత్ర పోషించి సంచలనం సృష్టించాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా, ఎవరో కాదు ఆర్జే గా అందరికీ సుపరిచితం అయిన కళ్యాణ్ పాలగుమ్మి. ఈ 'ప్రేమలు' సినిమాలో అతను శ్రీనివాస్ అలియాస్ శ్రీని గా టీము లీడర్ పాత్రలో కనపడతాడు.

ముందు ఆర్జే గా కెరీర్ ని ప్రారంభించిన కళ్యాణ్ తరువాత యాంకర్ గా కూడా చేశాడు. ఆ తరువాత చిన్న చిన్న పాత్రల్లో పలు సినిమాల్లో కనిపించిన కళ్యాణ్ పండగకి విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం'లో కూడా కనపడతాడు. అందులో రమ్యకృష్ణ సెక్రటరీ పాత్రలో కళ్యాణ్ కనపడతాడు. ఆ సినిమాకి మొదట్లో మిశ్రమ స్పందన లభించినా చివరికి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

అలాగే 'సేవ్ ది టైగెర్స్' వెబ్ సిరీస్ మొదటి సీజన్ లో కూడా కళ్యాణ్ పాలగుమ్మి కనపడతాడు. అందులో ఒక సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ పాత్ర చేసాడు. ఇలా చేస్తూ ఇప్పుడు 'ప్రేమలు' సినిమాలో టీము లీడర్ పాత్రలో మంచి ప్రతిభ కనపరిచాడు. ఒక మలయాళం సినిమాలో తెలుగు నటుడు కనిపించడం అరుదు, కానీ ఈ 'ప్రేమలు' మలయాళం సినిమాలో కళ్యాణ్ ఒక ముఖ్య పాత్ర చెయ్యడం, అది అందరికీ నచ్చటం ఆసక్తికరం.

ఇప్పుడు తెలుగులోనే కాకుండా మలయాళం కూడా ఈ 'ప్రేమలు' సినిమాతో కొంచెం పాపులర్ అయ్యాడు కళ్యాణ్ పాలగుమ్మి. ఈ సినిమాతో అటు మలయాళంలోనూ, ఇటు తెలుగులోనూ ఇప్పుడు మంచి పాత్రలు వస్తాయని అనుకుంటున్నాడు కళ్యాణ్.

Updated Date - Mar 15 , 2024 | 03:39 PM