తమిళ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూత
ABN, Publish Date - Nov 11 , 2024 | 03:17 AM
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు ఢిల్లీ గణేశ్ (80) శనివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన స్థానిక రామాపురంలోని తన...
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు ఢిల్లీ గణేశ్ (80) శనివారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన స్థానిక రామాపురంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. సోమవారం ఉదయం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగనున్నాయి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ తదితర భాషల్లో 400లకు పైగా చిత్రాల్లో నటించిన ఢిల్లీ గణేశ్.. క్యారెక్టర్ ఆర్టి్‌స్టగా, కమెడియన్‌గా, విలన్‌గా, హీరోగా, డబ్బింగ్ ఆర్టి్‌స్టగా రాణించారు. అగ్ర నటుడు కమల్ హాసన్ ఆస్థాన నటుల్లో ఢిల్లీ గణేశ్ ఒకరు. తిరునల్వేలికి చెందిన ఢిల్లీ గణేశ్.. సినిమాల్లోకి రాకముందు ఢిల్లీలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతోద్యోగిగా వున్నారు. నటనపై ఉన్న ఆసక్తితో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి, సినీపరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆయన అసలు పేరు గణేశన్ మహదేవన్. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘పట్టిన ప్రవేశం’ చిత్రంలో ఆయన తొలిసారి వెండితెరపై కనిపించారు. ఆయన నటించిన చివరి చిత్రం కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్-2’. మెగాస్టార్ చిరంజీవి, కన్నడ నటుడు విష్ణువర్థన్‌కు చెందిన తమిళ చిత్రాలకు ఆయనే డబ్బింగ్ చెప్పారు.
1981లో తమిళంలో కె.బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘147 నాట్గల్’, 1990లో ఘన విజయం సాధించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తమిళ వెర్షన్ (కాదల్ దేవదై) చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. అలాగే, విష్ణువర్థన్ నటించి 1980లో విడుదలైన ‘మళలై పట్టాలం’ చిత్రానికి ఆయన డబ్బింగ్ చెప్పారు. ఢిల్లీ గణేశ్ మృతి పట్ల సీఎం స్టాలిన్, అగ్రహీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, సూర్య, కార్తీ, శివకార్తికేయన్‌లతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నడిగర్ సంఘం నిర్వాహకులు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)