Bangalore Rave Party: రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని కాదు నేను: నటుడు శ్రీకాంత్
ABN, Publish Date - May 20 , 2024 | 04:04 PM
తెలుగు నటుడు శ్రీకాంత్ లా పోలిన వ్యక్తిని చూసి అతను శ్రీకాంత్ అనుకొని ఇక శ్రీకాంత్ కూడా బెంగుళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీకి హాజరయినట్టుగా కొన్ని మీడియాలో కథలు రావటంతో, తాను అక్కడ లేనను, హైదరాబాదు ఇంట్లోనే వున్నానని వివరణ ఇచ్చుకున్న నటుడు శ్రీకాంత్.
బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీపై బెంగుళూరు పోలీసులు ఆకస్మిక దాడిలో తెలుగు పరిశ్రమకి చెందిన నటీనటులు వున్నారన్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పటికే నటి హేమ పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతోంది, కన్నడ మీడియాలో కూడా ఆమె ఫోటో దొరికింది అని అంటున్నారు. అలాగే శ్రీకాంత్ పేరును కూడా సామజిక మాధ్యమాల్లో రావటంతో, ఆ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదు అని శ్రీకాంత్ చెప్పారు. (Actor Srikanth explained that he is in Hyderabad at his home)
బెంగుళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తానసలు ఆ పార్టీకే వెళ్లలదేని తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేసి, ఇందులో వివరణ ఇచ్చారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు నాలు చాలామంది ఫోను చేస్తూ వున్నారు. వీడియో క్లిప్స్ కూడా చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవటంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం," అని చెప్పారు శ్రీకాంత్. (Senior actor Srikanth denies reports of him attended for the rave party at Benguluru)
ఈ వివాదంపై శ్రీకాంత్ మాట్లాడుతూ, "మొన్నమో నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లానని అన్నారు. ఇలాంటి వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అతడికి కాస్త గడ్డం ఉంది. ముఖం కవర్ చేసుకున్నాడు. నేనే షాకయ్యాను. దయచేసి ఎవరూ నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకు, పబ్స్ వెళ్లే వ్యక్తిని కాను నేను. ఎప్పుడైనా బర్త్ డే పార్టీలకు వెళ్లినా కొంత సేపు అక్కడి ఉండి వచ్చేస్తానంతే. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. మీడియా మిత్రులు సహా ఎవరూ నమ్మొద్దు. విషయం తెలుసుకోకుండా, చాలామంది సామాజిక మాధ్యమాల్లో 'రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్' అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడనే మీరు పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు’’ అన్నారు.