Kalki 2898AD Review: మహాభారత యుద్ధం తరువాత ఏమి జరిగిందో ఊహాత్మకంగా...
ABN, Publish Date - Jun 26 , 2024 | 11:33 AM
అశ్వద్ధామ, కలి, కాశీ నగరం, కల్కి, భైరవ ఇంకా చాలా పాత్రలు పౌరాణికాలనుండి వచ్చినవే. అటువంటి పౌరాణికాలని చదివి, విని ఒక కల్పిత కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడి' అనే సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ పౌరాణిక పాత్రలు ఎవరు, వాటి గురించి విశేషాలు. నాగ్ అశ్విన్ సినిమా మహాభారత యుద్ధం తరువాత ఏమి జరిగింది, కలియుగ ప్రారంభం, తరువాత ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేవి ఉంటాయా...
నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, మాళవిక నాయర్, శోభన తదితరులు
మాటలు: నాగ్ అశ్విన్, సాయి మాధవ్ బుర్రా
సంగీతం: సంతోష్ నారాయణన్
కథ, దర్శకత్వం: నాగ్ అశ్విన్
నిర్మాతలు: సి అశ్విని దత్
విడుదల తేదీ: జూన్ 27, 2024
ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న 'కల్కి 2898 ఏడి' రేపు ఉదయం విడుదల కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రియులు అందరూ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాలో ఏమి చూపించబోతున్నారు, ఎలా వుండబోతోంది అనే ఆసక్తి అందరిలో ఉండటం సహజం.
ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని లాంటి దిగ్గజ నటీనటులు వున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, సినిమాపై మరింత ఉత్కంఠని పెంచింది. ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా పురాణాల ఆధారంగా కల్పిత కథని తీశానని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుని నిర్యాణంతో ద్వాపరయుగం తరువాత కలియుగం ప్రారంభం అవుతుంది.
అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో కనపడనున్నారు. ఇప్పటికే చాలామంది అశ్వద్ధామ గురించి తెలుసుకోవడానికి అంతర్జాలంలో వెతుకుతున్నారు. అడిగి తెలుసుకుంటున్నారు. కమల్ హాసన్ కలి పాత్రలో కనపడనున్నారని అంటున్నారు. ఇప్పుడు నడుస్తున్నది కలియుగం! కలి ప్రభావం గురించి భాగవతంలో వ్యాస మహర్షి చెపుతారు. పోతన గారు ఆ భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు. కలి అంటే ఎవరు, అతని ప్రభావం ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు ఇప్పుడున్న యువకులు తమ సందేహాల్ని అడిగి తెలుసుకుంటున్నారు.
అశ్వద్ధామ పాత్ర వేసిన అమితాబ్ బచ్చన్ ఎందుకు ఒంటికి గుడ్డలు చుట్టుకొని కనపడ్డారు, మామూలుగా అశ్వద్ధామకి శ్రీకృష్ణుడు ఎందుకు శాపం ఇచ్చారు, ఇవన్నీ సందేహాలు అడుగుతున్నారు. మరి నాగ్ అశ్విన్ అశ్వద్ధామతో మొదలుపెట్టి కలియుగ అంతం ఎలా అవబోతోంది అని కూడా చూపిస్తారా, లేక ద్వాపరయుగం చివర్లో ఏమి జరిగింది, కలియుగం ఎలా మొదలైంది, ఎలా వుండబోతోంది, చివర్లో ఏమవుతుంది ఈ విషయాలను చూపిస్తారా, కథ ఎలా వుండబోతోంది అనే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి అని అంటున్నారు.
ప్రచార చిత్రాలు చూస్తే అందులో అమితాబ్ బచ్చన్ ఒక ప్రధాన పాత్రలో కనపడితే, ఇంకో ప్రధాన పాత్ర భైరవ పాత్ర అయిన ప్రభాస్. భైరవ అంటే ఈశ్వరుడు అని కూడా ఒక అర్ధం వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే, నేపాల్ దేశంలో పాండవులలో అతి బలసంపన్నుడు అయిన భీముడిని దేవుడుగా కొలుస్తారు. అక్కడ భీమునికి అనేక దేవాలయాలు వున్నాయి. అక్కడ భీముడిని భైరవుడు అని కూడా పిలుస్తారు. మరి నాగ్ అశ్విన్ తీసుకున్న భైరవ పాత్ర నేపాల్ లో పూజించే భీముడి కి స్ఫూర్తిగా ఏమైనా తీసుకున్నారా. ఇవన్నీ సినిమా చూస్తే కానీ తెలియదు.
కలియుగంలో కలి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కలి ఎలా ఉంటాడు అనే విషయంలో అతని వర్ణన కూడా చాలా ఏహ్యంగా ఉంటుంది. నల్లగా, పెద్ద కడుపుతో, నూనె కారుతున్న శరీరంతో, వికృతమైన మొహంతో, భయంకరమైన రూపంతో, కలియుగంలో ఎక్కడ చెయ్యకూడని పనులు చేస్తూ వుంటారో అక్కడ కలి ప్రత్యక్షమవుతాడు. అధర్మమైన, చెడ్డ పనులు జరుగుతున్న సమాజంలో, చేస్తున్న మనుషుల్లో కలి తనవంతుగా వాటిని మరింత రాజేసి ఘర్షణలకి, గొడవలకి కారణం అవుతాడు. పురాణాల్లోనూ కలియుగంలో ప్రజలు ఎలా ఉండబోతున్నారు, ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే విషయాల గురించి వ్యాస మహర్షి చెప్పారు. కలియుగం అంతం అవుతున్న కొద్దీ, సమాజంలో అధర్మం పూర్తిగా నశిస్తుంది, మానవుని ఆయుః ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోతాయి, దోపిడీలు, దొంగతనాలు, బలవంతుడిదే రాజ్యం అనే విధంగా ఉంటుంది అని చెప్పారు. తండ్రి, కుమారుడు ఇద్దరూ ఒకే అమ్మాయిని వివాహం చేసుకునే స్థితికి వస్తుంది, అంటే అధర్మం అంతగా ప్రబలుతుంది అని చెప్పారు వ్యాస మహర్షి. ధర్మం అనేది పూర్తిగా నశించిపోయిన శంభాలా అనే గ్రామంలో రోజు విష్ణుయశుడు, సుమతి అనే దంపతులకు కల్కి అవతారంగా భగవానుడు జన్మిస్తానని చెబుతారు. ఇప్పుడు 'కల్కి 2898 ఏడి' అని పేరు పెట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ ని ఏవిధంగా చూపించబోతున్నారు అనేది ఆసక్తికరం.
దీపికా పదుకోన్ కి పుట్టబోయే బిడ్డ గురించి ప్రచార చిత్రాల్లో చూపించారు. ఆమెని అశ్వద్ధామ కాపాడుతూ ఉంటాడు, ఆ బిడ్డ గురించి గొప్పగా చెపుతాడు కూడా. అశ్వద్ధామ ఎందుకు ఆ బిడ్డని కాపాడాలి అనుకుంటాడు? ఇందులో అశ్వద్ధామ పాత్ర ఒక్కటే ఉంటుందా, లేక అర్జునుడు, శ్రీకృష్ణుడు లను కూడా చూపిస్తారా అనేది కూడా ఆసక్తికరం. ఎందుకంటే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి ఇంకా చాలామంది నటులు కూడా వున్నారని అంటున్నారు. మరి వాళ్ళని ఎటువంటి పాత్రల్లో చూపించబోతున్నారు దర్శకుడు.
అలాగే ఈ సినిమాలో మూడు నగరాలూ శంబాలా, కంప్లెక్స్ తో పాటుగా కాశీ నగరం కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. కాశీకి పురాణాల్లో ఎంతో ప్రత్యేకత వుంది. ఈ నగరం గురించి చాలా గొప్పగా చెపుతారు. యుగాంతం అయిపోయి ప్రళయం వచ్చినప్పుడు, ప్రపంచం అంతా నీటితో మునిగిపోయి, చిమ్మ చీకటితో నిండి ఉంటే, ఒక్క కాశీ నగరం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది అని పురాణాల్లో చెపుతారు. ఈశ్వరుడు కాశీ నగరంలో తపస్సు చేసాడని అతను సృష్టించిన నగరమే ఇది, అందుకని ఎంత ప్రళయం వచ్చినా ఈ కాశీ నగరం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని అంటారు. 'కాశ్యాన్తు మరణాన్ ముక్తి: అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని విశ్వాసం. అటువంటి కాశీ నగరాన్ని ఒక ప్రధాన పాత్ర చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్.
ఇలా పురాణాల ప్రాతిపదికగా ఒక కల్పిత కథతో ప్రేక్షకుల ముందుకు 'కల్కి 2898ఏడి' అనే సినిమా వస్తోంది. ఇందులో నాగ్ అశ్విన్ తన కల్పిత పాత్రలతో ఎటువంటి కథని ప్రేక్షకులకి అందించబోతున్నారు అనే విషయం రేపు ఉదయం తెలుస్తుంది. అయితే ఒక్క విషయంలో మాత్రం నాగ్ అశ్విన్ ని మెచ్చుకోవాలి. అతను చదివిన, విన్న పురాణాల ప్రకారం రాసుకున్న కథ ఈ 'కల్కి 2898 ఏడి', ప్రచార చిత్రంలో అశ్వద్ధామ లాంటి పాత్రలని ప్రవేశపెట్టడంతో ఈరోజు చాలామంది యువత పురాణాల గురించి ఆయా పాత్రల గురించి తెలుసుకోవటం కోసం అంతర్జాలంలో వెతుకుతున్నారు, సందేహాల్ని వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు.