సోషల్‌మీడియా టు సినిమా

ABN, Publish Date - Aug 25 , 2024 | 04:59 AM

ఒకప్పుడు సినిమాల్లోకి రావాలంటే చాలా తతంగం ఉండేది. ఫొటోల ఆల్బమ్‌ చేత్తో పట్టుకుని ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. ఫొటోలు నచ్చితే ఆడిషన్స్‌కు పిలుపు వచ్చేది. ఆడిషన్స్‌లో ఓకే అనిపించుకున్నా...

ఒకప్పుడు సినిమాల్లోకి రావాలంటే చాలా తతంగం ఉండేది. ఫొటోల ఆల్బమ్‌ చేత్తో పట్టుకుని ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. ఫొటోలు నచ్చితే ఆడిషన్స్‌కు పిలుపు వచ్చేది. ఆడిషన్స్‌లో ఓకే అనిపించుకున్నా అవకాశం వస్తుందో రాదో తెలియని పరిస్థితి.. అయితే ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఆర్టిస్టులను ఎంపిక చేసే విధానమూ మారింది. సోషల్‌మీడియాలో కొంత హల్‌చల్‌ చేస్తే చాలు సినిమాల్లో అవకాశాలు వెదుక్కుంటూ వచ్చేస్తున్నాయి. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ లే వేదికగా తమ టాలెంట్‌ ప్రదర్శించి, సినిమాల్లోకి ఎంట్రీ సంపాదించిన నటీమణులు కొందరున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్‌ రీళ్లతో అదరగొడుతూ లక్షలాది మందిని ఆకర్షించారు ఇమాన్‌ ఇస్మాయెల్‌ (ఇమాన్వీ). రీల్స్‌ చేయడమే కాకుండా ఆమె ఓ షార్ట్‌ ఫిల్మ్‌లోనూ నటించారు. యూట్యూబ్‌లో దాదాపు రెండు మిలియన్ల సబ్‌స్ర్కైబర్లు.. ఇన్‌స్టాలో దాదాపు తొమ్మిది లక్షల ఫాలోవర్లు ఆమెకు ఉన్నారు. దాంతో ఇప్పుడీ ఢిల్లీ భామ ఏకంగా ప్రభాస్‌ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ పొందింది. తొలి సినిమానే పాన్‌ ఇండియా ఫిల్మ్‌ కావడం గ్రేట్‌ కదా! 1940ల నేపథ్యంలో హిస్టారికల్‌ డ్రామాగా ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు.


గీతా ఆర్ట్స్‌లో..

యూట్యూబ్‌, ఇన్‌సాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీడియోలు, రీల్స్‌ ద్వారా ఫేమస్‌ అయిన మరో కంటెంట్‌ క్రియేటర్‌ నిహారిక ఎన్‌.ఎమ్‌. ఆమె కూడా నటిగా టాలీవుడ్‌లోనూ.. కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టనున్నారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో అల్లు అరవింద్‌ నిర్మించే ఓ తెలుగు చిత్రంలో.. ఆకాశ్‌భాస్కర్‌ దర్శకత్వంలో అధర్వ హీరోగా ఓ తమిళ సినిమాలోనూ నటిస్తున్నారు. నిహారిక ఇటీవలే అమెరికన్‌ యానిమేటెడ్‌ కామెడీ టెలివిజన్‌ సిరీస్‌ ‘బిగ్‌ మౌత్‌’ సీజన్‌ 7లో ఓ క్యారెక్టర్‌కు వాయిస్‌ కూడా అందించడం విశేషం. పలు సామాజిక సమస్యలపై సోషల్‌ మీడియాలో అవగాహన వీడియోలు చేసే నిహారికకు యూట్యూబ్‌ సబ్‌స్ర్కైబర్లు... ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల్లు మిలియన్లలో ఉన్నారు.

‘బేబీ’ కాంబోలో..

సోషల్‌ మీడియాను తెలివిగా వాడుకుని సినిమాల్లో ఎంట్రీ కార్డ్‌ దక్కించుకున్న తెలుగమ్మాయి అలేఖ్య హారిక (దేత్తడి హారిక). యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిల్మ్స్‌.. కవర్‌ సాంగ్స్‌.. వెబ్‌ సిరీస్‌లలో నటించి పాపులర్‌ అయ్యారు. ఆమె ప్రస్తుతం సంతోష్‌ శోభన్‌ హీరోగా సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఎస్‌.కే.ఎన్‌ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు.


వరుసగా నాలుగో చిత్రం

సోషల్‌ మీడియాతో వరుస అవకాశాలు తెచ్చుకున్నారు కేరళకు చెందిన అనంతిక సనీల్‌కుమార్‌. కంటెంట్‌ క్రియేటర్‌గా ఓ వైపు రాణిస్తూనే.. క్లాసికల్‌ డ్యాన్సర్‌గా.. కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ హోల్డర్‌గా పలు రంగాల్లో పట్టు తెచ్చుకున్నారు. ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించారు. ‘రాజమండ్రి రోజ్‌మిల్క్‌’ చిత్రంతో తెరంగేట్రం చేసి.. ‘మ్యాడ్‌’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ప్రస్తుతం ‘మను’ ఫేమ్‌ ఫణీంద్ర నార్సెట్టీ దర్శకత్వం వహిస్తున్న ‘ఎనిమిది వసంతాలు’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.


వీళ్లతో పాటు సోషల్‌మీడియాను కేరాఫ్‌ అడ్రస్‌గా వాడుకుని ఇప్పటికే ఎంతో మంది తారలు సినిమాల్లో అవకాశాలు పట్టేశారు. వారిలో ‘బేబీ’ ఫేమ్‌ వైష్ణవి చైతన్య ఒకరు. షార్ట్‌ ఫిల్మ్స్‌.. సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించిన ఆమె కెరీర్‌ను ‘బేబీ’ సినిమా సక్సెస్‌ ఒక్కసారిగా మార్చేసింది. వైష్ణవిని ఓవర్‌నైట్‌ స్టార్‌ను చేసి వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది. మరో నాయిక రుహాని శర్మ కూడా సోషల్‌ మీడియా నుంచి వెండితెర ప్రయాణం చేసి ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ ‘చి.ల.సౌ. స్రవంతి’ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మోడల్‌గా ట్రయిల్స్‌ దశలో ఉన్న సాక్షి వైద్య సోషల్‌మీడియాలో తన ఫొటోల ద్వారా సినిమా అవకాశాలు దొరకబుచ్చుకున్నారు. అలా ఆమె ‘ఏజెంట్‌’ చిత్రంలో తళుక్కుమన్నారు. ఆ సినిమా సక్సెస్‌ కాకపోయినా.. ఈ అమ్మడుకు మాత్రం మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ లైన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ కోవలోకి చెందిన వారే.. ‘బీస్ట్‌’ ఫేమ్‌ అపర్ణా దాస్‌, ‘రొమాంటిక్‌’, ‘అంగరంగ వైభవంగా’ ఫేమ్‌ కేతిక శర్మ, ‘టాక్సీవాలా’ ఫేమ్‌ ప్రియాంక జవాల్కర్‌. ఇలా ఎంతో మంది సోషల్‌ మీడియా స్టార్స్‌కు సినిమా తలుపులు తెరుస్తూనే ఉంది. మరి వీరిలో ఎంత మంది హీరోయిన్లుగా నిలబడతారో వేచి చూడాలి.

Updated Date - Aug 25 , 2024 | 04:59 AM