నిజంగా స్మగ్లింగ్ చేస్తే తప్పు పట్టాలి
ABN, Publish Date - Aug 25 , 2024 | 05:02 AM
అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలతో మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయంటూ కొన్నాళ్లుగా మీడియాలో ఉధృతంగా ప్రచారం జరుగుతోన్న.. విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్పందించారు.
అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలతో మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయంటూ కొన్నాళ్లుగా మీడియాలో ఉధృతంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఇప్పటి దాకా మెగా, అల్లు కుటుంబాల నుంచి ఎవరూ నేరుగా పెదవి విప్పింది లేదు. కానీ ఇప్పుడు తొలిసారి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఈ విషయంపై స్పందించారు.
ఓ మీడియా ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇప్పుడు హీరోలు స్మగ్లర్ల వేషాలు వేస్తున్నారు’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ‘స్నేహితుల కోసం ఎక్కడిదాకా అయినా వస్తాను’ అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
కల్యాణ్ గారు ఏ సందర్భంలో అలా మాట్లాడారో తెలియదు. ఆయన మాటవరసకు అలా అని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. కానీ ప్రజల్లోకి తప్పుడు సందేశం పోతోంది. తర్వాతైనా ఆయన ‘నా ఉద్దేశం ఇది’ అని చెబితే బాగుండేది. ఆయనే స్వయంగా పూనుకొని సరిదిద్దితే బాగుండేదని నా అభిప్రాయం.
ఎన్టీఆర్ నటుడిగా రావణుడు, దుర్యోధనుడి పాత్రలు పోషించారు. అంటే దానర్థం మొత్తం స్త్రీ జాతిని ఆయన కించపరిచాడని కాదు కదా. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. పవన్ కల్యాణ్ కూడా నటుడిగా ఉండి రాజకీయ నాయకుడయ్యారు. సినిమా యాక్టర్‌ను యాక్టర్‌గానే చూడాలి. వారి వ్యక్తిత్వాలకు ఆ పాత్రల స్వభావాన్ని అంటగట్టే ప్రయత్నం చేయకూడదు. అల్లు అర్జున్ నిజంగా స్మగ్లింగ్ చేస్తే తప్పు పట్టాలి.
అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ వచ్చింది. 69 ఏళ్లలో ఎవరికీ రాని అవార్డ్ ఆయన్ను వరించింది. ఆయన మిత్రపక్షం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఎన్డీయే ప్రభుత్వమే అర్జున్‌కు ఉత్తమ నటుడు అవార్డ్ ఇచ్చింది. అది పవన్ కల్యాణ్‌కు తెలియదా? మంచీ చెడూ చూడకుండానే భారత ప్రభుత్వం ఆ పురస్కారాన్ని ఇవ్వలేదు కదా?. ఆయన అభిమానులేమో అల్లు అర్జున్‌నే అన్నాడు అని అనుకుంటున్నారు.
ఇప్పుడు ఈ వివాదానికి శుభం కార్డు పడాలంటే ‘ఇది నేను జనరల్‌గా అన్నాను’ అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేయాలి. లేదంటే ఆయన భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్లే. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వివాదాస్పదం చేస్తున్నట్లుగానే భావించాలి. చిరంజీవి గారు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌తో మాట్లాడి ఈ వివాదానికి ముగింపు పలకాలి.