Shivani Rajasekhar: రాజశేఖర్ కుమార్తె శివాని స్పెషల్ ఏంటో తెలుసా...
ABN, Publish Date - May 16 , 2024 | 12:34 PM
జీవిత రాజశేఖర్ ల కుమార్తె శివాని కథానాయకురాలిగా నటించిన 'విద్యా వాసుల అహం' సినిమా నేరుగా అహా ఓటిటి లో మే 17న ప్రసారం కానుంది. శివాని చేసిన సినిమాలు ఎక్కువగా ఓటిటి లో ప్రసారం కావటం ఆసక్తికరం
రాజశేఖర్, జీవిత దంపతుల ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిక తమ తల్లిదండ్రుల బాటలోనే నడుస్తూ సినిమాలు కెరీర్ గా మలుచుకున్నారు. వారిద్దరూ కొన్ని సినిమాలలో నటించారు కూడా. తాజాగా శివాని నటించిన 'విద్యా వాసుల అహం' అనే సినిమా ఓటిటి లో నేరుగా ప్రసారం కానుంది. ఇది ఆహా ఓటిటి లో మే 17న ప్రసారం అవుతుంది. ఇందులో రాహుల్ విజయ్ కథానాయకుడు.
మణికాంత్ గెల్లి ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని పై కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు కూడా వున్నాయి. సినిమా అంతా సరదాగా సాగుతూ, ఎక్కడా బోర్ కొట్టకుండా చూపించాడు దర్శకుడు. ఈ సినిమా కేవలం ఓటిటి కోసమే తీసింది అని తెలుస్తోంది.
సినిమా శ్రీమహా విష్ణువు, లక్ష్మి దేవి, నారదుడు మధ్య జరిగే సరదా సంభాషణల సన్నివేశాలతో మొదలవుతుంది. ఈ సన్నివేశాలు దర్శకుడు బాపు సినిమా 'మిష్టర్ పెళ్ళాం' సినిమాలో సన్నివేశాలకి అనుగుణంగా వున్నట్టుగా అనిపించింది. ఈ సినిమా నిడివి కూడా తక్కువే, సుమారు ఒక గంట 48 నిముషాలు ఉంటుంది.
శివాని, రాహుల్ విజయ్ ఇంతకు ముందు 'కోటబొమ్మాళి పీఎస్' అనే సినిమాలో కూడా కలిసి నటించారు. ఆ సినిమాలో 'లింగిడి లింగిడి' పాట వైరల్ అయింది, కానీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. 'కోటబొమ్మాళి పీఎస్' మలయాళం సినిమా 'నయట్టు' కి రీమేక్.
ఆసక్తికరం ఏంటంటే శివాని కథానాయకురాలిగా నటించిన మొదటి సినిమా 'అద్భుతం' ఓటిటి లో నేరుగా విడుదలైంది. ఇందులో 'హనుమాన్' ఫేమ్ తేజ సజ్జ కథానాయకుడు. 'టిల్లు స్క్వేర్' ఫేమ్ దర్శకుడు మల్లిక్ రామ్ ఈ 'అద్భుతం' సినిమాకి దర్శకుడు అవటం విశేషం.
అలాగే ఆమె చేసిన రెండో సినిమా 'WWW' కూడా ఓటిటి లో విడుదలయింది, తమిళంలో ఆరంగేట్రం చేసిన 'అన్బరివు' కూడా నేరుగా ఓటిటి లో విడుదలవడం విశేషం. ఇలా శివాని చేసిన సినిమాలు ఎక్కువగా నేరుగా ఓటిటి లో విడుదలయ్యాయి.
శివాని 'అహ నా పెళ్ళంట' అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇందులో రాజ్ తరుణ్ కథానాయకుడు. ఇది జీ5 లో వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కి సంజీవ్ రెడ్డి దర్శకుడు. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. శివాని చేసిన సినిమాలు ఓటిటి లో ప్రసారం కావటం, ఆమె వెబ్ సిరీస్ చెయ్యడం, ఇలా ఎక్కువగా ఓటిటి కే పరిమితమై పోయింది శివాని.
అందుకే ఇంకా మెయిన్ స్ట్రీమ్ సినిమాలో శివునికి పెద్ద బ్రేక్ రాలేదు. ఒక్కటి మెచ్చుకోవాలి, ఏంటంటే మొదటి సినిమా 'అద్భుతం' నుండి ఆమె సినిమాలు చేస్తూనే వుంది, పని చేస్తూ ఉంటేనే, నటనలో పరిణితి కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన 'విద్యా వాసుల అహం' సినిమాలో ఆమె పరిణితి చెందిన నటనని ప్రదర్శించింది. విద్య పాత్రలో శివాని చాలా చక్కగా నటించింది.