ఇళయరాజాకు అవమానం?
ABN, Publish Date - Dec 17 , 2024 | 06:00 AM
తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ ఆలయంలో సంగీత దర్శకుడు ఇళయరాజాకు అవమానం జరిగినట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అవి నిజం కావని ఆలయ అధికారులు...
తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ ఆలయంలో సంగీత దర్శకుడు ఇళయరాజాకు అవమానం జరిగినట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అవి నిజం కావని ఆలయ అధికారులు, శడగోప రామానుజ జీయర్ స్వామి స్పష్టం చేశారు. ఆలయంలో మార్గశిర మాస వేడుకల్లో భాగంగా దివ్య పాశుర సంగీత కచ్చేరి, భరతనాట్య కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఇందులో శ్రీవిల్లిపుత్తూరు శడగోప రామానుజ జీయర్, త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ ముఖ్య అతిథులుగా హాజరుకాగా, ప్రత్యేక అతిథిగా ఇళయరాజా పాల్గొన్నారు. ఆండాళ్ సన్నిధి, నందవనం, పెరియ పెరుమాళ్ సన్నిధిలను రామానుజ జీయర్, త్రిదండి చిన్న శ్రీమన్నారాయణలతో కలసి ఇళయరాజా దర్శనం చేసుకున్నారు. ఈ ముగ్గురు వసంతమండపం దాటి అర్థమండపం ద్వారం వద్ద నిలుచున్నారు. దీన్ని గమనించిన పూజారులు వసంత మండపంలో నిల్చొని అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పడంతో ఇళయరాజా అలాగే చేశారు.
ఆత్మగౌరవాన్ని వదులుకోను: ఇళయరాజా
శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో తనకు అవమానం జరిగినట్టు సాగుతున్న ప్రచారంపై ఇళయరాజా స్పందించారు ‘నేను ఎప్పుడైనా.. ఎక్కడైనా ఆత్మగౌరవాన్ని వదులుకునే వ్యక్తిని కాదు. వదంతుల్ని నమ్మవద్దు’ అని పేర్కొన్నారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)