గురువారం నాడే విడుదల

ABN, Publish Date - Aug 13 , 2024 | 05:11 AM

సినిమాలకూ.. శుక్ర వారానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎన్నో ఆశలతో తెరకెక్కించిన సినిమాలను ఆ రోజున విడుదల చేసి బాక్సాఫీస్‌ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు చిత్ర ప్రముఖులు. పండగ సీజన్లలో...

సినిమాలకూ.. శుక్ర వారానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎన్నో ఆశలతో తెరకెక్కించిన సినిమాలను ఆ రోజున విడుదల చేసి బాక్సాఫీస్‌ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు చిత్ర ప్రముఖులు. పండగ సీజన్లలో లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్పించి శనివారం, గురువారం, బుధవారం వంటి ఇతర తేదీల్లో సినిమాలు విడుదలవ్వడం అరుదు. కానీ ఈ ఏడాది అనేక సినిమాలు శుక్రవారం ట్రెండ్‌ను బ్రేక్‌ చేసి.. గురువారాన్ని విడుదల తేదీగా మార్చుకున్నాయి.. ఆ చిత్రాలివే.

నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో విభిన్న కథాంశంతో తెరకెక్కిందీ చిత్రం. అధిక కోపం గల ఓ యువకుడు.. తన కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రతీ శనివారం ఏం చేశాడనేది ఈ సినిమా కథ. ఈ నెల 29న గురువారం విడుదవుతున్న ఈ చిత్రంలో నాని పాత్రలో అనేక రకాల షేడ్స్‌ ఉంటాయని మేకర్స్‌ తెలిపారు. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ‘అంటే సుందరానికీ’ సినిమా..కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించకపోయినా.. విమర్శకుల ప్రశంసలను పొందింది.


డ్యూయల్‌ రోల్‌లో...

తమిళ కథానాయకుడు విజయ్‌ డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘గోట్‌’ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). మీనాక్షీ చౌదరి కథానాయిక. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 5న గురువారం విడుదలవుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలకి అధిక ప్రాధాన్యం ఉండనుంది.

వేటగాడిగా రజనీ..

‘జై భీమ్‌’ ఫేమ్‌ టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, రానా దగ్గుబాటి, ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఓ రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రజనీ కనిపించనున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబరు 10న గురువారం ప్రేక్షకులను పలకరించనుంది. ‘జైలర్‌’తో సూపర్‌ హిట్‌ కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న రజనీకాంత్‌కు ఈ సినిమా అంతకుమించిన సక్సెస్‌ ఇస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మాస్‌ ఎంటర్టైనర్‌

విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాస్‌ ఎంటర్టైనర్‌ ‘మెకానిక్‌ రాకీ’. సమాజంలో జరుగుతున్న ఓ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగనుంది. ఇందులో విశ్వక్‌ సరసన మీనాక్షీ చౌదరి, శ్రద్థా శ్రీనాథ్‌ నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబరు 31న గురువారం విడుదల కానుంది.


బయోపిక్‌లో శివకార్తీకేయన్‌

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించే తమిళ నటుడు శివ కార్తీకేయన్‌. రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న బయోపిక్‌ ‘అమరన్‌’ వహిస్తున్నారు. ఈ సినిమా అమరులైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. సాయిపల్లవి హీరోయన్‌గా నటిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబరు 31 గురువారం విడుదలవుతోంది.

‘కల్కి’ కూడా..

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏ.డీ’ చిత్రం గురువారం రిలీజై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ గురువారం (ఆగస్టు 15)న కూడా డజనుకు పైగా చిత్రాలు సందడి చేయనున్నాయి. గురువారం సెంటిమెంటు ఈ సినిమాలకు కలసి వస్తుందేమో చూడాలి.

Updated Date - Aug 13 , 2024 | 05:11 AM