2019 నాటి సబ్ కమిటీ నివేదికను బయటపెట్టండి
ABN, Publish Date - Sep 02 , 2024 | 04:19 AM
లింగవివక్ష, మహిళలపై లైంగిక వేధింపులపై మాలీవుడ్ చిత్ర పరిశ్రమ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రకంపనలు క్రమంగా తెలుగు చిత్రపరిశ్రమను కూడా తాకుతున్నాయి...
తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన సమంత
మద్దతు పలికి న సినీ ప్రముఖులు
లింగవివక్ష, మహిళలపై లైంగిక వేధింపులపై మాలీవుడ్ చిత్ర పరిశ్రమ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రకంపనలు క్రమంగా తెలుగు చిత్రపరిశ్రమను కూడా తాకుతున్నాయి. జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో చిత్ర పరిశ్రమలోని మహిళలపై వేధింపులను నిరసిస్తూ టాలీవుడ్ కథానాయిక సమంత మరోసారి గళం విప్పారు. టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న వేధింపులపై 2019లో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదికను ఇప్పుడు బయటపెట్టాలని ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దాన్ని బహిర్గతం చేయడం వల్ల తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. వాయిస్ ఆఫ్ ఉమెన్ ఇన్ టీఎ్‌ఫఐ పేరుతో ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఇండస్ట్రీలో మహిళా సమానత్వం, సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యం అని సమంత అభిప్రాయపడ్డారు. ఆ దిశగా అందరూ కలసి కృషి చేయాలని కోరారు. నటి మంచు లక్ష్మి, దర్శకురాలు నందినిరెడ్డి, గాయని చిన్మయి శ్రీపాద యాంకర్ సుమ కనకాల సహా పలువురు నటీనటులు సమంత సందేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఆమెకు మద్దతు తెలిపారు.
ఆ నివేదికలో ఏముంది?
2018లో నటి శ్రీరెడ్డి మహిళల పట్ల ఇండస్ట్రీ వివక్ష చూపుతోందంటూ ఫిల్మ్ ఛాంబర్ వద్ద నగ్నంగా నిరసన ప్రదర్శనకు దిగారు. ఆ ఘటన నేపథ్యంలో 2019లో సీనియర్ ప్రభుత్వ అధికారులు, పోలీసులు, పౌర సమాజ ప్రతినిధులతో ప్రభుత్వం ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. లైంగిక వే ధింపులు, లింగ వివక్ష, వేతనాలు సహా పలు సమస్యలపై ఇండస్ట్రీలోని సంఘాలతో చర్చించిన కమిటీ 2022లో ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అయితే ఇప్పటివరకూ దాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. కానీ మీడియాలో ప్రచారం జరిగిన దాని ప్రకారం... మహిళలను వేధించడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించడం ఇండస్ట్రీలో సాధారణంగా మారింది. అలాగే నైట్ షిఫ్ట్స్‌లో పనిచేసేవారికి రవాణా సదుపాయం కల్పించడం లేదు. వేధింపులపై నోరు విప్పిన వారిని దోషుల్లా చూస్తున్నారు. యూనియన్ సభ్యత్వాల విషయంలో మహిళల పట్ల వివక్ష చూపుతున్నారు. చాలా యూనియన్లలో మహిళల సభ్యత్వం నాలుగు శాతానికి మించలేదు. దళారీ వ్యవస్థను ఉపయోగించుకొని నిర్మాతలు తక్కువ పారితోషికాలతో పని చేయించుకుంటున్నారు. డాన్స్, యాక్టింగ్ స్కూల్స్ నుంచి వచ్చే అమ్మాయిలను దళారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పని ప్రదేశాల్లో మహిళల సంరక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలను పరిశ్రమలోని సంస్థలు అమలు చేయడం లేదు, ఫిర్యాదుల స్వీకరణకు అంతర్గతంగా కమిటీలను ఏర్పాట చేయాలని, అందులో మహిళలు సభ్యులుగా ఉండేలా చూడాలని కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు అప్పట్లో మీడియాలో ప్రచారం జరిగింది.
ఆ దిశగా ముందడుగు వేద్దాం
ఇండస్ట్రీలో మహిళల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం, పరిశ్రమ సంఘాలు కలసి రావాలని సమంత అభ్యర్థించారు. సినీ ఇండస్ట్రీలోని పని ప్రదేశాల్లో లింగ వివక్ష ఏ రూపంలో ఉన్నా అరికట్టాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. హేమ కమిటీ నివేదికను ఉదహరిస్తూ పలు సూచనలు చేశారు. ఆ నివేదిక వచ్చాక చిత్ర పరిశ్రమలోని మహిళల్లో ధైర్యం వచ్చిందన్నారు. పని ప్రదేశాల్లో తాము ఎదుర్కొంటున్న వివక్ష, దోపిడీని ప్రశ్నించేందుకు మరింత మంది మహిళలు తమ మౌనం వీడి ముందుకు రావడం మంచి పరిణామం అని చెప్పారు. లింగ అసమానతను అరికట్టేందుకు పారదర్శకమైన వ్యవస్థను కమిటీ సిఫారసు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తదనుగుణంగా లింగ వివక్ష లేని వాతావరణాన్ని పరిశ్రమలో కల్పించేందుకు ప్రభుత్వం, మూవీ ఆర్గనైజేషన్లు కలసి పనిచేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఆ దిశగా పునరాలోచిద్దాం, పునర్నిర్మిద్దాం, ముందడుగు వేద్దాం అని సమంత చెప్పారు.