సరదాగా రానా.. ఘాటుగా హరీశ్‌శంకర్!
ABN, Publish Date - Nov 07 , 2024 | 04:18 AM
రానా మంచి నటుడే కాదు మంచి వ్యాఖ్యాత కూడా. తనదైన శైలిలో జోక్స్, పంచెస్ వేస్తూ ఆసక్తికరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆయనకు అలవాటు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకకు...
రానా మంచి నటుడే కాదు మంచి వ్యాఖ్యాత కూడా. తనదైన శైలిలో జోక్స్, పంచెస్ వేస్తూ ఆసక్తికరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆయనకు అలవాటు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకకు రానా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆయనకు యువ హీరో తేజా సజ్జా తోడయ్యారు. ఇద్దరూ కలసి చాలా సరదాగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోల చిత్రాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ డిలే గురించి, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కాదు.. ‘పుష్ప టూ లేట్’ అంటూ రానా, తేజ సరదాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. అలాగే ఈ కార్యక్రమంలోనే రానా మాట్లాడుతూ ‘ఈ ఏడాది అమితాబ్ కెరీర్‌లోనే అతి పెద్ద ఎత్తుని, లోతును చూశా’ అని అనగానే, ఎత్తు ఏమిటని తేజ ప్రశ్నించారు. ‘కల్కి’ అని సమాధానం చెప్పారు రానా.
మరి లోతు అని తేజా అడగ్గానే ‘ రీసెంట్‌గా రిలీజ్ అయింది కదా.. అదే ‘మిస్టర్..’ అని రానా ఏదో చెప్పబోతుంటే ‘ఇప్పుడొద్దులే’ అని తేజ మాట దాటేశారు. తమ హీరో రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమానే ఉద్దేశించే ఇలా అన్నారని హర్ట్ అయిన ఓ అభిమాని రానా మాట్లాడిన వీడియోని జత చేస్తూ ట్వీట్ చేశాడు. దర్శకుడు హరీశ్‌శంకర్‌కి ట్యాగ్ చేశాడు. వెంటనే ఆయన స్పందించి ‘ఎన్నో విన్నాను తమ్ముడు.. అందులో ఇదొకటి. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. నాకైనా.. ఎవరికైనా’ అంటూ రిప్లై ఇచ్చారు.