Ram Mandir - Ram Charan: ఎన్నో ఏళ్లగా ఎదురుచూసిన వేళ ఇది!
ABN, Publish Date - Jan 22 , 2024 | 01:10 PM
అయోధ్య శ్రీరామ మందిరంలో శ్రీరామచంద్రమూర్తి కొలుదీరారు. రామ్‌లల్లా ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠను కనులారా వీక్షించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు ఆహ్వానాల మేరకు అయోధ్యకు చేరుకున్నారు. చిరంజీవి కుటుంబ సభ్యులు సోమవారం ఉదయాన్నే అయోధ్యకు బయలుదేరారు
అయోధ్య శ్రీరామ మందిరంలో శ్రీరామచంద్రమూర్తి కొలుదీరారు. రామ్‌లల్లా ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠను కనులారా వీక్షించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు ఆహ్వానాల మేరకు అయోధ్యకు చేరుకున్నారు. చిరంజీవి కుటుంబ సభ్యులు సోమవారం ఉదయాన్నే అయోధ్యకు బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌లో రామ్‌చరణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ రోజు కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ఈ మహత్తర కార్యంలో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. అలాగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందడంపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఇందులో భాగం కావడం అరుదైన అవకాశంగా భావిస్తున్నాను అని చెప్పారు. నేను ఆంజనేయుడి భక్తుడిని. ఆయనే స్వయంగా నాకు ఆహ్వానం పంపినట్లుగా అనిపించింది’’ అని అన్నారు.
అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘రామ మందిరానికి వెళ్లే ముందు హనుమంతుడిని దర్శించుకోవడం ముఖ్యం. అయోధ్యలో వాతావరణం రమణీయంగా ఉంది. ఎక్కడ చూసినా ‘జై శ్రీరామ్’ అనే నినాదం మార్మోగుతోంది. దీపావళి మళ్లీ వచ్చినట్లుంది’’ అని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
‘‘ఇది చరిత్రాత్మక రోజు. దేశం అంతటా ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. శ్రీరాముడు అయోధ్యకు వస్తున్నాడని నినదించే శతకోటి స్వరాల్లో నేను భాగమైనందుకు గర్విస్తున్నా’’ అని నటి జెనీలియా పేర్కొన్నారు.