పశుపాలకుడిగా ప్రణవ్‌

ABN, Publish Date - Nov 18 , 2024 | 04:00 AM

వెండితెరపైన సాదా సీదా పాత్రలను అద్భుతంగా పోషించే తారలు నిజ జీవితంలో అలా జీవించగలరా? అంటే ‘కష్టమే’ అని చెప్పాలి. కానీ మలయాళ మెగాస్టార్‌ మోహన్‌లాల్‌ కొడుకు ప్రణవ్‌ మాత్రం స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి దేశం కాని దేశంలో...

వెండితెరపైన సాదా సీదా పాత్రలను అద్భుతంగా పోషించే తారలు నిజ జీవితంలో అలా జీవించగలరా? అంటే ‘కష్టమే’ అని చెప్పాలి. కానీ మలయాళ మెగాస్టార్‌ మోహన్‌లాల్‌ కొడుకు ప్రణవ్‌ మాత్రం స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి దేశం కాని దేశంలో అనామకంగా జీవిస్తున్నాడు. ప్రస్తుతం స్పెయిన్‌లో ‘వర్క్‌ అవే’ అనే కార్యక్రమంలో భాగంగా ఆయన ఓ పొలంలో కష్టపడి పనిచేస్తున్నారు. పశుపాలకుడిగా గొర్రె లు, మేకలు, గుర్రాలను కాస్తున్నారు ప్రణవ్‌. నటుడిగా పోషించాల్సిన విభిన్న పాత్రల్ని తన కొడుకు నిజజీవితంలో పోషిస్తున్నారని ప్రణవ్‌ తల్లి సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఒక సూపర్‌స్టార్‌కి కొడుకు, ఆగర్భ శ్రీమంతుడు అయినా విలాసవంతమైన జీవన శైలిని వదిలి ఇలా సాదాసీదాగా గడుపుతున్న ప్రణవ్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. 2002లో ‘ఒన్నమన్‌’ అనే సినిమాతో బాలనటుడిగా అరంగేట్రం చేసిన ప్రణవ్‌.. ‘పునర్జనీ’ చిత్రంతో ఉత్తమ బాలనటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్నారు. 2018లో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో ‘ఆది’ అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా నిలవడమే కాకుండా ప్రణవ్‌కు ఉత్తమ నటుడిగా సైమా అవార్డునూ తెచ్చిపెట్టింది. ప్రణవ్‌ కేవలం నటుడిగానే కాకుండా ప్లేబ్యాక్‌ సింగర్‌గా, పాటల రచయితగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Updated Date - Nov 18 , 2024 | 04:00 AM