Daniel Balaji: తెలుగు, తమిళ నటుడు బాలాజీ హఠాన్మరణం
ABN, Publish Date - Mar 30 , 2024 | 09:39 AM
తెలుగు, తమిళ నటుడు డేనియల్ బాలాజీ హాఠాత్తుగా శుక్రవారం అర్థరాత్రి చెన్నైలో కన్నుమూశారు. 48 సంవత్సరాల బాలాజీ అనేక తమిళ సినిమాలతో పాటు ఎన్ఠీఆర్ నటించిన 'సాంబ' సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసి చాలా తెలుగు సినిమాలలో కూడా నటించారు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాలలో నటించిన నటుడు డేనియల్ బాలాజీ శుక్రవారం రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. 48 సంవత్సరాల వయసున్న డేనియల్ బాలాజీ నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే అతన్ని చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించేలోపే గుండెపోటుతో మరణించారు. బాలాజీ హఠాన్మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
డేనియల్ బాలాజీ తెలుగులో సాంబ, చిరుత, టక్ జగదీష్‌తో పాటు చాలా సినిమాలలో నటించారు. బాలాజీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో సుమారు 50కి పైగా సినిమాలు చేశారు. బాలాజీ ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రలలోనే కనిపించేవారు. 'చిట్టి' అనే తమిళ సీరియల్‌తో డేనియల్ బాలాజీ తన నటనకి శ్రీకారం చుట్టారు. అదే సీరియల్ తెలుగులో 'పిన్ని' పేరుతో స్ట్రీమింగ్ అయి ఎంతో ప్రజాదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 'ఏప్రిల్ మదాతిల్', 'కాదల్ కొండెన్' సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు బాలాజీ.
కమల్‌హాసన్, గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో వచ్చిన 'వెట్టయ్యాడు విలయాడు'లో సైకో క్యారెక్టర్‌లో తన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా ప్రసంశలు కూడా పొందారు బాలాజీ. ఈ సినిమా నటుడిగా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తమిళంలో 'పొల్లవదన్', 'జ్ఞానకిరుక్కన్', 'అచ్చం యెన్‌బదు మదమైయదా', 'బిగిల్'తో పాటు చాలా సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలే ఎక్కువ చేశారు. అలాగే పోలీస్ పాత్రల్లో కూడా అతను కొన్ని సినిమాలలో కనిపించారు, అవి కూడా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
చివరగా గత ఏడాది 'అరియవాన్' అనే తమిళ సినిమాలో కనిపించాడు డేనియల్ బాలాజీ. తెలుగులో ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన 'సాంబ' సినిమాలో నటించి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన 'ఘర్షణ' సినిమాలో, కథానాయకుడి స్నేహితుల్లో ఒకరిగా కనిపించారు. రామ్‌చరణ్ మొదటి సినిమా 'చిరుత', నాగచైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేశారు బాలాజీ. నాని కథానాయకుడిగా 2021లో విడుదలైన 'టక్ జగదీష్'లో ప్రధాన ప్రతినాయకుడిగా డానియల్ బాలాజీ కనిపించారు. ఇదే అతడి చివరి తెలుగు సినిమా.