Minister Pawan Kalyan: విజయవాడలో మంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి సినిమా టచ్
ABN, Publish Date - Jun 18 , 2024 | 03:36 PM
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ వెళ్లి తన క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా రేపటినుండి భాద్యతలు తీసుకోనున్న పవన్ కళ్యాణ్, తన నివాసం కోసం జలవనరులశాఖ భవనాన్ని ఎంచుకున్నారు. తన ప్రియ మిత్రుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ని కూడా తనతో పాటుగా పవన్ కళ్యాణ్ తీసుకువెళ్లారు. ఈ భవనాన్ని తనకనుగుణంగా రూపకల్పన చెయ్యడంలో ఆనంద్ సాయి సహాయం తీసుకోనున్నారని తెలిసింది.
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ ఈరోజు విజయవాడ వెళ్లి తన క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. విజయవాడలోని జలవనరుల శాఖ అతిధి గృహం వద్దకు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా వెళ్లారు. అక్కడ పవన్ కళ్యాణ్ కి ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు, అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.
ఉప ముఖ్యమంత్రి గా ఉంటూనే, పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, అటవీ పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక మంత్రిగా కూడా భాద్యతలను చేపడతారు. జూన్ 19, అంటే బుధవారం నుండి పవన్ కళ్యాణ్ తన బాధ్యతలు తీసుకుంటారని ఒక ప్రకటనలో ఇంతకు ముందే తెలియచేసారు.
అయితే పవన్ కళ్యాణ్ తన వెంట తన మిత్రుడు, చలన చిత్ర పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ గా మంచి పేరున్న ఆనంద్ సాయి ని కూడా తీసుకువెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి. ఆనంద్ సాయి, పవన్ కళ్యాణ్ కి ఎంతో సన్నిహితులు, ఎన్నోసార్లు ఆనంద్ సాయి గురించి పవన్ కళ్యాణ్ చెప్పారు కూడా. ఇప్పుడు ఆనంద్ సాయిని తన వెంట తీసుకువెళ్లారు అంటే, తన కొత్త కార్యాలయానికి కొంచెం సినిమా టచ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణంలో ఆనంద్ సాయి కీలకపాత్ర వహించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆనంద్ సాయి చాలా సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సంగతి కూడా తెలిసిందే. అందులో పవన్ కళ్యాణ్ సినిమాలు 'తొలి ప్రేమ', 'గుడుంబా శంకర్', 'బాలు' లకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు.
అదే సమయంలో చినజీయర్ స్వామి నుంచి ఆనంద్ సాయికి పిలుపు రావటంతో అతనితో రెండున్నరేళ్ళ పాటు దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ ఆనంద్ సాయి సందర్శించాడు. యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణానికి రూపకల్పన చెయ్యడంలో ఆనంద్ సాయి పాత్ర ఎంతో వుంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీసు కూడా ఆనంద్ సాయి తనదైన రీతిలో మార్పులు చేర్పులు చేస్తారని తెలుస్తోంది. పైన పవన్ కళ్యాణ్ నివాసం, కింద ఆఫీసు వుండేటట్టుగా ఈ భవనం రూపు దిద్దుకుంటున్నట్టుగా తెలుస్తోంది.