Pawan Kalyan: ఆడు మగాడురా బుజ్జీ !
ABN, Publish Date - Jun 04 , 2024 | 03:22 PM
పవన్ కళ్యాణ్ చెప్పాడు, చేసి చూపించాడు, తాను అనుకున్న లక్ష్యం వైపుగా అడుగులు వేసాడు. ఇప్పుడు అతను నిజమైన పవర్ స్టార్ అయ్యాడు. పిఠాపురం నుండి సుమారు 70 వేలకి పైగా మెజారిటీ గెలుపొందటమే కాకుండా, మిత్రపక్షాలను కూడా గెలిపించాడు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేయాలనుకున్నారు. ఇంతకు ముందు రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో తన పార్టీ తరపున అసెంబ్లీలో ఎటువంటి ప్రాతినిధ్యం లేకపోయినా, నిరాశ పడకుండా, ప్రజల పక్షాన నిలబడి పోరు సాగిస్తాను అని చెప్పారు. ఈ 2024లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ని అధః పాతాళానికి తొక్కుతా అని ప్రతి ఎన్నికల సభలోనూ చెపుతూ వస్తున్నారు. బై బై జగన్ అనే స్లోగన్ మొదలుపెట్టి, అలసట లేకుండా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి ఊరూ తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు.
తన లక్ష్య సాధనకు భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం కలవాలని రెండు పార్టీ పెద్దలని ఒప్పించి, వాళ్ళతో తాను కూడా జత కలిసి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని నడుం కట్టారు. అందుకోసం ఎండనక, వాన అనక తన శాయశక్తులా ప్రచారం చేశారు. తనని ఎంతో మంది విమర్శిస్తున్నా, తన తోటి కళాకారులు సైతం టీవీల్లో ఏవేవో మాటలు అంటున్నా, కొన్ని మాధ్యమాల్లో వ్యక్తిగతంగా తనని టార్గెట్ చేసినా, ఎటువంటి ఆవేశాలకు పోకుండా, తనపై విమర్శించే వాళ్ళకి తన విజయంతో సమాధానం చెప్పాలని నిర్ణయించుకొని, తన ప్రచారాన్ని కొనసాగించిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్.
అందుకే ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుండి నామినేషన్ వేసి, అక్కడనుండి ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టి తనపై విమర్శించిన నోళ్లు మూయించాలని అనుకున్నారు. అహర్నిశలూ తిరుగుతూ ప్రజా సభల్లో పాల్గొంటూ తన భావాలను, తాను ప్రజలకి చేయదలచిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అందుకే ఈరోజు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ కి పట్టం కట్టారు. సుమారు 70 వేలకి పైగా ఓట్ల మెజారిటీ పవన్ కళ్యాణ్ గెలుపొందారు. తాను గెలవటమే కాకుండా, తన పార్టీ నుండి సుమారు 20మంది వరకు ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టేటట్టుగా చేశారు.
అదీ కాకుండా తన మిత్ర పక్షమైన తెలుగుదేశం పార్టీకి చారిత్రాత్మక విజయం లభించింది అంటే, అందులో పవన్ కళ్యాణ్ పాత్ర అనిర్వచనీయం. అలాగే తొలిసారిగా బీజేపీ కూడా ఆంధ్ర ప్రదేశ్ లో పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తోంది అంటే, అందులో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర వుంది. ఇలా అన్నీ తానే అయి, ఆంధ్ర ప్రదేశ్ ను రాక్షస పాలన నుండి విముక్తి చేసి, అధికారం మంచి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేట్టు చేసిన పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు ఒక్క పరిశ్రమలోని వారే కాదు, ప్రజలందరూ ప్రశంసిస్తున్నారు. ఆడు అసలైన మగాడురా బుజ్జి! చెప్పింది చేశాడు, మాట నిలబెట్టుకున్నాడు! ఠీవిగా, గౌరవంగా ఇప్పుడు అసెంబ్లీకి వెళుతున్నాడు, అని అంటున్నారు.