Pawan Kalyan: గెలవగానే మొక్కు తీర్చుకున్న జనసేనాని
ABN, Publish Date - Jun 10 , 2024 | 02:13 PM
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీ చేసి 161 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని అధికారం చేజిక్కించుకుంది. అయితే అధికారంలోకి వస్తే అనకాపల్లిలో నూకాంబికా అమ్మవారిని దర్శిచుకుంటాను అని పవన్ కళ్యాణ్ మొక్కుకున్నారు, ఆ మొక్కుని ఈరోజు తీర్చుకున్నారు.
ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. తన పార్టీ నుండి పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో అందరినీ గెలిపించుకొని వందశాతం రికార్డు నెలకొల్పి తన పవర్ ఏంటో చూపించారు పవన్ కళ్యాణ్. మోడీ అందుకే పవన్ కళ్యాణ్ ని తూఫాన్ అంటూ పోల్చారు. తను పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి మంచి మెజారీటీతో ప్రత్యర్థి వంగా
గీత పై గెలిచారు.
తను గెలవటమే కాకుండా తన మిత్ర పక్షాలైన తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం కూడా అవిశ్రాంత కృషి చేశారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచార సమయంలోనే గెలిచి అధికారంలోకి వస్తే అనకాపల్లిలో చాలా ప్రాచుర్యం పొందిన నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటాను అని పవన్ కళ్యాణ్ మొక్కుకున్నారు.
ఆ మొక్కు ఈరోజు తీర్చుకున్నారు పవన్ కళ్యాణ్. ఈరోజు ఉదయమే విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్, అక్కడ నుండి కారులో అనకాపల్లి వెళ్లి నూకాంబికా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అతను అనుకున్నట్టుగానే కూటమి అధికారంలోకి రావటంతో, పవన్ కళ్యాణ్ ఇక ఆలస్యం చెయ్యకుండా తన మొక్కు వెంటనే చెల్లించాలని అనుకున్నారు. అందుకే అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శనానికి ఈరోజు వెళ్లారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చి పవన్ కళ్యాణ్ కి స్వాగతం చెప్పారు. అనకాపల్లి ఈరోజు ఉదయం నుండి పవన్ కళ్యాణ్ అభిమానులతో కిటకిటలాడుదుతోంది అని అంటున్నారు.