Pawan Kalyan: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే!
ABN, Publish Date - Jun 06 , 2024 | 06:08 PM
కొడుకు సాధించిన ఘన కార్యాలు చూసి తల్లి మురిసిపోతుంది, అది సహజం. మరి ఆ కొడుకు భారతదేశం గర్వించే దిశగా ఒక అపూర్వ విజయాన్ని అందిస్తే, ఆ తల్లి ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడు భారతదేశం చూపు అంతా పవన్ కళ్యాణ్ వైపే ఉంటే, ఆ పవన్ కళ్యాణ్, తన తల్లి, అన్నయ్య, వదినమ్మ ఆశీర్వాదాలు తీసుకోవడానికి అన్నయ్య చిరంజీవి ఇంటికి వచ్చారు.
నిజజీవితంలో పవన్ కళ్యాణ్ హీరో అనిపించుకున్నారు. తన జనసేన పార్టీ తరపున పోటీ చేసిన అన్ని స్థానాల్లో, అంటే 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో అందరినీ గెలిపించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇది వందకి వంద శాతం ట్రాక్ రికార్డు. తన పార్టీ సభ్యులనే కాకుండా, తెలుగుదేశం, బీజేపీ సభ్యులను కూడా గెలిపించారు పవన్ కళ్యాణ్. ఇన్ని గెలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారతదేశంలో ఒక పవర్ ఫుల్ నాయకుడిగా ఎదిగారు, అందరి దృష్టి అతనిపైనే వుంది.
చేతికి పవర్ వచ్చినా, తాను మాత్రం ఇంతకు ముందు ఎలా వున్నారో అంతే వినమ్రతతో వుండి తనకి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వారినందరినీ పలకరించారు. నిన్న ఢిల్లీకి వెళ్లి మోదీ ని కలిశారు, ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోదీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చేరవచ్చు అని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం 12న చేయబోతున్నారు, ఇక్కడ ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం అవుతారు అని అంటున్నారు.
తను ఎంఎల్ఏ గా జీతం తీసుకుంటాను అని, అయితే ప్రతి పైసాకి లెక్క చెపుతాను అని, దానికి తగ్గ పని చేసి చూపిస్తాను అని చెప్పారు. గెలిచిన తరువాత ఢిల్లీ కి వెళ్లి రెండు రోజులు విరామం లేకుండా సమావేశాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్, తన అన్నయ్య, వదినల ఆశీర్వాదం తీసుకోవటానికి, తన తల్లి ఆశీర్వాదం తీసుకోవటానికి అన్నయ్య ఇంటికి వెళ్లారు. తాను ఢిల్లీ కి రాజైనా తల్లికి కొడుకునే అని నిరూపించుకున్నారు. అందుకే తల్లి అంజనాదేవి కాళ్ళకి మొక్కి ఆశీర్వదాం తీసుకున్నారు. అలాగే తల్లి లాంటి వదినమ్మ సురేఖ కాళ్ళకి కూడా మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అది పవన్ కళ్యాణ్ అంటే! అందుకు కదా అతనికి అభిమానులు లక్షల్లో వుండి, పవన్ వెంట ఎప్పుడూ వెన్నంటే వుంటారు.