40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Padma Awards: కృషికి తగ్గ ప్రతిఫలం.. ప్రతిభకు పట్టం

ABN, Publish Date - Jan 26 , 2024 | 12:25 PM

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి పద్మ విభూషణ్‌కు ఎంపిక కాగా, తమిళనాడు నుంచి వైజయంతీ మాల బాలి పద్మ విభూషణ్‌కు ఎంపికయ్యారు. అలాగే మిథున చక్రవర్తి, దివంగత  నటుడు విజయ్‌కాంత్, గాయని ఉషా ఉతప్‌ పద్మ భూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను (Padma Awards 2024)ప్రకటించింది. టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి పద్మ విభూషణ్‌కు ఎంపిక కాగా, తమిళనాడు నుంచి వైజయంతీ మాల బాలి పద్మ విభూషణ్‌కు ఎంపికయ్యారు. అలాగే మిథున చక్రవర్తి, దివంగత  నటుడు విజయ్‌కాంత్, గాయని ఉషా ఉతప్‌ పద్మ భూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.

అలనాటి అందాలతార, అద్భుత నర్తకి, గొప్పనటి వైజయంతి మాలను పద్మవిభూషణ్‌ అవార్డు వరించింది. 1968లో పద్మశ్రీ అవార్డును అందుకున్న వైజయంతిమాల, 2011లో పద్మభూషణ్‌ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది గణతంత్రదినోత్సవ సందర్భంగా దేశంలోని రెండో అత్యుత్తమ పురస్కారమైన పద్మవిభూషణ్‌ పురస్కారానికి భారత ప్రభుత్వం వైజయంతిమాలను ఎంపిక చేసింది. భారతీయ సినీ పరిశ్రమలో తొలి మహిళా సూపర్‌స్టార్‌ కీర్తి గడించిన నటి ఆమె!  (Vyjayanti mala)

తమిళనాడు మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని ట్రిప్లికెనలో 1933లో జన్మించారు వైజయంతిమాల. ఆమె తల్లి వసుంధరదేవి శాస్త్రీయ నృత్య కళాకారిణి. కొన్ని సినిమాల్లో కూడా ఆమె నటించారు. తల్లి వారసత్వంగా వైజయంతిమాల కూడా చిన్నతనంలోనే శాస్త్రీయనృత్యం అభ్యసించి, ప్రావీణం సాధించారు.  కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆమెలోని కళాతృష్ణను గమనించిన తల్లి ఆమెను నటిగా ప్రొత్సహించారు. తమిళంలో ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మించిన ‘వళకై’(1949) వైజయంతిమాల తొలి చిత్రం. అదే సినిమా ‘జీవితం’(1950) పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. ఆ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు వైజయంతిమాల. 1954లో విడుదలైన ‘సంగం’ సినిమాలో ఎన్టీయార్‌తో కలిసి నటించారు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు వైజయంతిమాల. 1951లో ఏవీఎం సంస్థ నిర్మించిన ‘బహార్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన వైజయంతిమాల ‘లడ్కీ’, ‘నాగిన’ చిత్రాలతో అక్కడ తిరుగులేని సూపర్‌స్టార్‌గా ఎదిగారు. దిలీప్‌కుమార్‌ హీరోగా రూపొందిన ‘దేవదాస్‌’(1955) చిత్రంలో చంద్రముఖి పాత్ర నటిగా వైజయంతిమాల మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ పాత్రకు తొలి ఫిల్మ్‌ఫేర్‌ అందుకున్నారామె. ఆ వరుసలోనే కెరీర్‌ మొత్తంమీద 5 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు వైజయంతిమాల.

అందం, అభినయం, అబ్బురపరిచే నాట్యకౌశలంతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు వైజయంతిమాల. అప్పట్లో హీరోతో ప్రమేయం లేకుండా కేవలం ఆమె కోసమే టికెట్లు తెగేవి. ఓ విధంగా ఆమెది కూడా హీరో ఇమేజే. ఎంతటి నటులనైనా డామినేట్‌ చేయగల అద్భుతమైన సౌందర్యం వైజయంతిమాల సొంతం. హిందీ పరిశ్రమను ఉర్రూతలూగించిన కాంబినేషన్ దిలిప్‌కుమార్‌, వైజయంతిమాల. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మధుమతి, గంగజమున, నయాదౌర్‌ చిత్రాలు ఇండియన క్లాసిక్స్‌గా నిలిచాయి. అలాగే వైజయంతిమాల, రాజ్‌కపూర్‌ నటించిన ‘సంగం’ చిత్రం ప్రాంతాలకు అతీతమైన విజయాన్ని సాధించింది. కిశోర్‌కుమార్‌ కు జోడీగా ‘న్యూఢిల్లీ‘, దేవానంద్‌ ‘జ్యూయల్‌ థీఫ్‌’, హిస్టారికల్‌ మూవీ ‘ఆమ్రపాలీ’, ‘గంగా జమున’, ‘నాగిన్‌’, ‘దేవదాస్‌’  తదితర చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ‘సంఘం’, ‘వేగుచుక్క’, ‘విజయకోట వీరుడు’, ‘బాగ్దాద్‌ గజదొంగ’, ‘విరిసిన వెన్నెల’, ‘వీర సామ్రాజ్యం’, ‘చిత్తూరు రాణీపద్మిని’ తదితర చిత్రాల్లో నటించారు. చిత్రసీమకి దూరమైనా నృత్యకళాకారిణి కొనసాగిన వైజయంతీ మాల.. 1968లో చమన్‌లాల్‌ బాలిని పెళ్లి చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పురస్కారాలతో పాటు, 2008వ సంవత్సరానికి గాను అక్కినేని నాగేశ్వరరావు నేషనల్‌ అవార్డును కూడా అందుకున్నారామె. తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారాలు అందుకున్నారు. రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. సినీ, సంగీత రంగాలకు ఆమె చేసిన సేవలకు గానూ ఈ ఏడాది పద్మవిభూషణ్‌కు ఎంపికయ్యారు. 

కెప్టెన్ కు  పద్మభూషణ్‌ (vijaykanth)

తమిళ సినీ, రాజకీయరంగాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్‌ నటుడు విజయ్‌కాంత్. తమిళ సినీ, రాజకీయరంగాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన ఇటీవల కన్ను మూశారు. ‘కెప్టెన్’గా అభిమానుల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విజయకాంత్ కు   మరణానంతరం భారత ప్రభుత్వం ఆయనకు  దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్‌ను ప్రకటించింది. కెరీర్‌ బిగినింగ్‌లో సినిమాల్లోకే పనికి రాడని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆయన ఏకంగా 150కి పైగా చిత్రాల్లో నటించారు. ‘ఇనిక్కుం ఇలమై’ అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ‘కెప్టెన్‌’, ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’, ‘పోలీస్‌ అధికారి’, ‘సింధూర పువ్వు’, ‘నూరవరోజు’, ‘క్షత్రియుడు’, ‘సిటీ పోలీస్‌’, ‘ఇండియన్‌ పోలీస్‌’, ‘క్రోధం’, ‘సెక్యూరిటీ ఆఫీసర్‌’, ‘నేటి రాక్షసులు’, ‘రౌడీలకు రౌడీ’ తదితర చిత్రాలు తెలుగులోనూ భారీ విజయం సాధించాయి. 1990లో ఆంధ్రప్రదేశ్‌ను వరదలు ముంచెత్తినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని కలిసి రూ.లక్ష విరాళం అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు.

బాలీవుడ్‌పై బలమైన ముద్ర (Mithun Chakravarthy)

ఒకప్పుడు తన డాన్సులతో, అభినయంతో యువతరానికి అలరించిన బెంగాలీ బాబు మిథున్ చక్రవర్తి. ‘డిస్కో డాన్సర్‌’,  డాన్స్ డాన్స్’ వంటి చిత్రాల్లోమిథున్ డాన్స్ చూసి ఆనాటి అమ్మాయిలు వెర్రెత్తి పోయేవారు. ‘ఐయామే డిస్కో డాన్సర్‌’ అంటూ ఆయన తెరపై పాడుతుంటే థియేటర్లలో ప్రేక్షకులు ఆనందంతో గంతులు వేసేవారు. మిథున్ అసలు పేరు గౌరంగ చక్రవర్తి. 1976లో వచ్చిన ‘మృగయా’ ఆయన తొలి చిత్రం. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్‌ పొందారు. ప్రారంభంలో కొన్ని బెంగాలీ చిత్రాల్లో నటించిన మిథున ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి హీరోగా అక్కడ ఎంతో రాణించారు.. ముఖ్యంగా 80ల దశకంలో హిందీ సినిమాపై ఎంతో ప్రభావం చూపిన నటుడాయన.  పవనకల్యాణ్‌ నటించిన ‘గోపాల గోపాల’లో విలనగా ఆకట్టుకొన్నారు. ఆమధ్య వచ్చిన ‘కశ్మీరీ ఫైల్స్‌’ చిత్రంలో మిథున నటనని ప్రేక్షకులు మరువలేరు. రెండు సార్లు ఉత్తమ నటుడిగా, ఒకసారి సహాయ నటుడిగా మిథున జాతీయ అవార్డులు అందుకొన్నారు. హీరోగానే కాదు కేరెక్టర్‌ ఆర్టిస్టుగా  కూడా ఆయన రాణిస్తున్నారు.

జీరో నుంచి హీరోగా మారిన ఆయన ప్రయాణం ఓ స్ఫూర్తిదాయకం. అన్నం దొరక్క ఖాళీ కడుపుతో పుట్‌పాత్ పై కునుకు తీసిన రోజులు. అనుకున్నది సాధించలేనన్న భయంతో ప్రాణాలు తీసుకోవడానికి సిద్థపడ్డ సందర్భాలు ఇలా ఆయన జీవితాన్ని చూస్తే  మదిని బరువెక్కించే విషయాలు ఎన్నో ఉన్నాయి. మంచి పాత్రల కోసం ఇప్పటికీ పరితపించే ఆ విశిష్ట నటుడిని పద్మభూషణ్‌ పురస్కరంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. 

క్వీన్ ఆఫ్ పాప్‌.. (Usha Uthup)

అల్లు అర్జున్  నటించిన ‘రేసుగుర్రం’ చిత్రంలో టైటిల్‌ సాంగ్‌ గుర్తుంది కదూ! హస్కీ వాయిస్‌తో ఆ పాట పాడిన గాయని ఉషా ఊతప్‌. ‘క్వీన్  ఆఫ్‌ పాప్‌’గా పేరు తెచ్చుకున్న ఉష భారతీయ సంప్రదాయ సంగీతం, పాశ్చాత్య సంగీతం, జాజ్‌ సంగీతంలో నిష్ణ్ణాతురాలు. సినీ పాటల ఆలాపనతోపాటు సంగీత ప్రదర్శనలతో కళారంగానికి ఎనలేని సేవలందించారు.1947 నవంబరు 8న ముంబయిలో తమిళ కుటుంబంలో జన్మించిన ఉషా ఉతుప్‌ అసలు పేరు ఉషా అయ్యర్‌. తొమ్మిదేళ్ల వయసులోనే సంగీత ప్రదర్శన చేశారు. బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్‌, పంజాబీ, తెలుగు, తమిళ, కన్నడ తదితర 15 భారతీయ భాషలతోపాటు  విదేశీ భాషల్లోనూ పాడారు. తెలుగులో ‘కీచురాళ్లు’, ‘చిత్రం భళారే విచిత్రం’, ‘తిక్క’, ‘ఆహా కళ్యాణం’లోని పాటలతోపాటు ‘రేసుగుర్రం’ చిత్రంలోని టైటిల్‌ గీతాన్ని పాడి అలరించారు. నటిగానూ ఆమె ప్రేక్షకులకు పరిచయమే. మలయాళ చిత్రం ‘పోతన్‌ వావా’లో నటించారు. ‘బాంబే టు గోవా’ అనే హిందీ చిత్రంలో గెస్ట్‌ రోల్‌లో అలరించారు. 2011లో పద్మశ్రీ అందుకున్న ఆమెను తాజాగా పద్మ భూషణ్‌ వరించింది. 


Updated Date - Jan 26 , 2024 | 12:25 PM