14న ఎన్టీఆర్‌ సినీ ప్రస్థాన వజ్రోత్సవం

ABN, Publish Date - Dec 09 , 2024 | 03:24 AM

నందమూరి తారకరామారావు సినీ ప్రస్థాన వజ్రోత్సవం ఈ నెల 14న పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో జరుగుతుందని ఆయన కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల చైర్మన్‌ టీడీ జనార్ధన్‌ పేర్కొన్నారు...

నందమూరి తారకరామారావు సినీ ప్రస్థాన వజ్రోత్సవం ఈ నెల 14న పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో జరుగుతుందని ఆయన కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల చైర్మన్‌ టీడీ జనార్ధన్‌ పేర్కొన్నారు. గాంధీనగర్‌లోని ఫిల్మ్‌ చాంబర్‌ హాల్లో ఆదివారం ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో టీడీ జనార్థన్‌ మాట్లాడుతూ ‘‘సినీ, రాజకీయ రంగంలో ఎన్టీఆర్‌కు సాటి లేదు. కృష్ణుడిగా, రాముడిగా నటించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన తొలిసారి నటించిన ‘మనదేశం’ చిత్రం 75 ఏళ్లు అయిన సందర్భంగా ఈ వేడుకను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ‘మనదేశం’ చిత్ర నిర్మాత కృష్ణవేణి, దర్శకుడు ఎల్వీ ప్రసాద్‌ కుమారుడు రమేశ్‌ ప్రసాద్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు పలువురు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పాల్గొంటారు.


తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌తో పాటు 24 క్రాప్ట్స్‌తో పాటు తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది’’ అని అన్నారు. తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు భరత్‌భూషణ్‌, సెక్రటరీ దామోదర్‌ ప్రసాద్‌, ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు అనుపమరెడ్డి, ఈసీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

ధర్నాచౌక్‌, విజయవాడ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Dec 09 , 2024 | 03:24 AM