RamNavami: ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు.. వెండితెర శ్రీరామచంద్రులు
ABN, Publish Date - Apr 17 , 2024 | 12:55 PM
‘శ్రీరామనవమి’ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణాన్ని అంగరంగవైభవంగా భక్తులు జరుపుకుంటున్నారు. ‘లవకుశ’ సినిమాలో లవకుశలు చెప్పినట్లుగా.. రామకథ మధురం. రామచరిత అద్భుతం. ఆ పురుషోత్తముడి చరితను వెండితెరపై ఎందరో హీరోలు తెలియజేసే ప్రయత్నం చేశారు. నందమూరి తారక రామారావు నుంచి నిన్నటి ప్రభాస్ వరకు ఆ పురాణపురుషుడి పాత్రలో మెప్పించిన హీరోలు వీరే..
RamNavami: మనిషిగా జన్మించినందుకు ఎలా బతకాలి? ఎలాంటి జీవితాన్ని సాగించాలి? వ్యక్తిత్వం ఎలా ఉండాలి? కుటుంబంపై ఎంత ప్రేమ ఉండాలి? ఎలాంటివారిని స్నేహితులుగా స్వీకరించాలి? కష్టసుఖాలను స్వీకరిస్తూ ఎలా ముందుకు సాగాలి? అసలు పరిపూర్ణమైన వ్యక్తిలా ఎలా ఉండాలి?.. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం శ్రీరాముడు (Sri Ramudu). రామచంద్రుడి జీవితం ఆదర్శప్రాయం. నేడు (ఏప్రిల్ 17) ‘శ్రీరామనవమి’ (Srirama Navami). ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణాన్ని అంగరంగవైభవంగా భక్తులు జరుపుకుంటున్నారు. ‘లవకుశ’ (LavaKusa) సినిమాలో లవకుశలు చెప్పినట్లుగా.. రామకథ మధురం. రామచరిత అద్భుతం. ఆ పురుషోత్తముడి చరితను వెండితెరపై ఎందరో హీరోలు తెలియజేసే ప్రయత్నం చేశారు. నందమూరి తారక రామారావు (NT Ramarao) నుంచి నిన్నటి ప్రభాస్ (Prabhas) వరకు ఆ పురాణపురుషుడి పాత్రలో మెప్పించిన హీరోలెవరెవరంటే..
*ఎన్టీఆర్ మొట్టమొదట రాముడి వేషం వేసింది తెలుగు సినిమాలో కాదు, తెలుసా!
శ్రీరాముడు అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే పేరు లెజెండ్ నందమూరి తారక రామారావు. అయితే ఆయన కంటే ముందే రాముడి పాత్రను వెండితెరపై వేరొక నటుడు పోషించారు. రంగస్థల కళాకారుడైన యడవల్లి సూర్యనారాయణ (Yadavalli Suryanarayana) మొట్టమొదటిసారి శ్రీరాముని పాత్రలో నటించారు. ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’ (1932) సినిమాలో శ్రీరాముని పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఎందరో నటీనటులు శ్రీరాముని పాత్రలో కనిపించారు.. కానీ శ్రీరాముడి పాత్రలో తెలుగు ప్రేక్షకులు ఆరాధ్యదైవంగా భావించింది మాత్రం నందమూరి తారక రామారావే (NTR) అంటే.. ఆ పాత్రకు ఎన్టీఆర్ ఎంత వన్నెతెచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి కాదు, ఒక్క సినిమా కాదు. ఎన్నో పౌరాణిక సినిమాలలో తారక రాముడు.. శ్రీరాముడిగా కనిపించారు. ముఖ్యంగా ‘లవకుశ’ సినిమాలో ఎన్టీఆర్ అభినయం చూసిన వారంతా.. శ్రీరాముడు అంటే ఇలానే ఉంటాడేమో అనుకునే స్థాయికి రాముడి పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. ‘సంపూర్ణ రామాయణం’, ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘రామాంజనేయ యుద్ధం’ వంటి సినిమాలలో ఎన్టీఆర్ శ్రీరాముడిగా ప్రేక్షకులకు దర్శనమిచ్చారు.
నందమూరి తారక రామారావు తర్వాత శ్రీరాముడి పాత్రలో మెప్పించిన నటుడు హరనాధ్ (Haranath). ‘సీతారామ కల్యాణం’, ‘శ్రీరామకథ’ వంటి చిత్రాలలో హరనాధ్ శ్రీరాముని పాత్రను అద్భుతంగా పోషించారు. ‘సీతారామ జననం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao), ‘వీరాంజనేయ’ సినిమాలో కాంతారావు (Kantha Rao), ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో శోభన్‌బాబు (Sobhan Babu), బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సీతా కల్యాణం’ సినిమాలో మళయాల నటుడు రవి (Ravi), ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో ఒక సన్నివేశంలో సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna), ‘శ్రీరామదాసు’ సినిమాలో సుమన్ (Suman), ‘దేవుళ్లు’ సినిమాలో శ్రీకాంత్ (Srikanth), ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో బాలకృష్ణ (Balakrishna), గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘రామాయణం’ సినిమాలో బాలరామునిగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఒక సన్నివేశంలో రామ్ చరణ్ (Ram Charan), గ్రాఫిక్స్ నేపథ్యంలో వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ (Prabhas) వంటి హీరోలందరూ శ్రీరాముని పాత్రలో కనిపించి.. ప్రేక్షకులను మెప్పించారు. త్వరలోనే ‘రామాయణం’ పేరుతో మరో గ్రాండియర్ మూవీ రానుంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా కనిపించనుండగా.. సాయిపల్లవి సీత పాత్రలో కనిపించనుంది.