Nani: ఈ సినిమాలో అసలు హీరో.. ఎస్‌జే సూర్య

ABN, Publish Date - Aug 20 , 2024 | 07:43 PM

ఈ సినిమాలో అసలు హీరో.. ఎస్‌జే సూర్య అని నాని అన్నారు. ఆయ‌న తాజాగా న‌టించిన చిత్రం స‌రిపోదా శ‌నివారం ఈ నెల 29న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది. ఈక్ర‌మంలో సినిమా తారాగ‌ణం త‌మిళనాట ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.

nani

చెన్నై వచ్చిన ప్రతిసారి తనపై తమిళ ప్రజలు ప్రేమ, ఆదరాభిమానాలు చూపిస్తున్నారని, ముఖ్యంగా ‘ఈగ’ సినిమా నుంచి తనను ఎంతగానో ఆదరిస్తున్నారని, అందుకు కృతజ్ఞ‌తల‌ని నేచురల్‌ స్టార్‌ నాని అన్నారు. ఆయన హీరోగా నటించిన నూత‌న చిత్రం స‌రిపోదా శ‌నివారం (Saripodhaa Sanivaaram). డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ (DVV Entertainment) పతాకంపై నిర్మాత డీవీవీ దానయ్య, కళ్యాణ్‌ దాసరి సంయుక్తంగా నిర్మించారు. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. అయితే ఈ చిత్రాన్ని ‘సూర్యాస్‌ సాటర్‌ డే’ పేరిట త‌మిళంలో విడుద‌ల చేస్తున్నారు. ఈక్ర‌మంలో చెన్నైలో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్రం న‌టీన‌టుల‌ బృందం నాని (Nani), ఎస్‌జే సూర్య (SJSurya), ప్రియాంక మోహన్ (Priyanka Mohan), అభిరామి, అదితి బాలన్‌ శనివారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా హీరో నాని మాట్లాడుతూ, ‘నగరానికి వచ్చిన ప్రతిసారి తమిళ ప్రజల ప్రేమను చూసి ఆశ్చర్యపోతున్నాను. తమిళ సినిమా నన్నెంతగానో ప్రభావితం చేసింది. కమల్‌ హాసన్‌, మణిరత్నం, శంకర్‌, భారతీరాజా సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ‘ఈగ’ సినిమా నుంచి మీరు ఆదరిస్తున్నారు. అందుకు కృతజ్ఞుడిని అన్నారు.


‘సూర్యాస్‌ సాటర్‌ డే’ ఇదొక స్పెషల్‌ మూవీ. సాధారణంగా నేటి జనరేషన్‌ యూత్‌కు ఒక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్తేజంగా, ఉత్సాహంగా ఉండాలి. ఆ తరహాలోనే ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. తమిళ సినిమాల తరహాలో ఇది ఒక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ. దర్శకుడు వివేక్‌.. అన్ని వర్గాల ప్రజల మనోభావాలను ప్రతిబింభించేలా రూపొందించారు.

ఈ సినిమాలో ఎస్‌జే సూర్య అసలు హీరో (నవ్వుతూ). ఈ టైటిల్‌ ఆయనకు సరిగ్గా సరిపోతుంది. అందుకే నేను ‘ఎస్‌జే సూర్య సాటర్‌ డే’ అంటాను’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత అదితి బాలన్‌, అభిరామి, ప్రియాంక మోహన్‌, ఎస్‌జే సూర్య, దర్శకుడు వివేక్‌ ఆత్రేయ తదితరులు మాట్లాడారు. ఈ నెల 29వ తేదీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Updated Date - Aug 20 , 2024 | 07:43 PM