Hi Nanna: నాని సినిమా ఈ హిందీ సినిమాకి కాపీ
ABN, Publish Date - Jun 17 , 2024 | 01:49 PM
'హాయ్ నాన్న' సినిమా ఏ సినిమాకి కాపీ కాదని, ఈ సినిమాలో పాయింట్ ఇంతవరకు ఎక్కడా రాలేదని ఆ సినిమా కథానాయకుడు, దర్శకుడు చెప్పారు. కానీ ఇది ఒక పాత హిందీ సినిమాకి కాపీ అని, ఆ హిందీ సినిమా తెలుగులో కూడా అప్పట్లో 'మంచి మనుషులు' గా వచ్చిందని తెలిసింది. 50 ఏళ్ల క్రితం వచ్చిన ఒక సినిమా కథని కాపీ కొట్టి ఇప్పుడు తీసి కొత్త పాయింట్ అనటం కొసమెరుపు!
ఈమధ్య నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్! నాన్న' సినిమా గురించే ఎక్కువ చర్చ నడిచింది. శౌర్యవ్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమా డిసెంబర్ 7, 2023 న విడుదలైంది. ఈ సినిమా విడుదలకి ముందు ఈ చిత్ర కథానాయకుడు నాని, దర్శకుడు శౌర్యవ్ ఈ సినిమా వేరే సినిమాకి కాపీ కాదని, అలాగే స్ఫూర్తిగా కూడా తీసుకోలేదని డంకా బనాయించి మరీ చెప్పారు. తీరా విడుదలయ్యాక ఈ సినిమా ఒక ఆంగ్ల చిత్రానికి కాపీ అని తెలిసింది. (Hi Nanna movie is a copy of Hindi film Aa Gale Lag Jaa)
ఒక్క ఆంగ్ల చిత్రమే కాదు, ఈ సినిమా ఒక పాత హిందీ సినిమా 'ఆ గలే లగ్ జా' కి కాపీ అని కూడా తెలిసింది. ఈ హిందీ సినిమా 1973లో వచ్చింది, ఇందులో శశి కపూర్, షర్మిల ఠాగూర్, శత్రుఘన్ సిన్హా ప్రధాన తారాగణంగా వేశారు. మన్ మోహన్ దేశాయ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషనల్ హిట్ అయింది. పాటలు కూడా అప్పట్లో చాలా పాపులర్ అయ్యాయి. ఈ హిందీ సినిమా కథ, నాని నటించిన 'హాయ్! నాన్న' సినిమా కథ ఒక్కటే. చిన్న చిన్న మార్పులతో హిందీ సినిమాలో కథ ఎలా అయితే ఉందొ, 'హాయ్ నాన్న' కథ కూడా అలాగే ఉంటుంది. దీనికి తోడు 'హాయ్ నాన్న' దర్శకుడు, కథానాయకుడు నాని, తమ సినిమా ఇంతకు ముందు ఎక్కడా రాలేదని, ఇదొక కొత్త కథ అని, కొత్త పాయింట్ తో తీసుకున్నామని విడుదలకి ముందు చెప్పారు. ఈ సినిమాకి కొన్ని అవార్డులు కూడా వచ్చాయి. (Nani starrer Hi Nanna lifts the story from the Hindi film Aa Gale Lag Jaa)
ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే, ఆ హిందీ సినిమా 'ఆ గలే లగ్ జా' ని 1974లో దర్శకుడు, నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ తెలుగులో 'మంచి మనుషులు' పేరిట నిర్మించారు. శోభన్ బాబు, మంజుల ప్రధాన జంట కాగా, జగ్గయ్య, నాగభూషణం, అంజలి, రాజబాబు లాంటి నటులు ఇందులో చేశారు. తెలుగు సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించటమే కాకుండా, ఇందులో పాటలు కూడా చాలా పెద్ద హిట్. ఈ 'మంచి మనుషులు' సినిమా ఆ హిందీ సినిమాకి రీమేక్. శోభన్ బాబు, మంజుల ఈ సినిమాల అద్భుత నటనని ప్రదర్శించడమే కాకుండా, అప్పట్లో చాలా సెంటర్స్ లో ఈ సినిమా వందరోజులు కూడా ఆడింది.
ఇలా రెండు భాషల్లో వచ్చిన సినిమాని సుమారు 50 సంవత్సరాల తరువాత అదే కథతో దర్శకుడు శౌర్యవ్ 'హాయ్! నాన్న' గా తెరకెక్కించారు. ఇప్పుడు చాల వరకు వస్తున్న సినిమాలు ఒకప్పుడు తెలుగు, హిందీ భాషల్లో వచ్చినవే అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఎందుకంటే అప్పటి ఈ సినిమాలను టీవీ చానెల్స్ లో ప్రసారం చేస్తూ ఉండటం, అవి చూసి, 'అరె! ఇలాంటి సినిమానే ఈమధ్యనే విడుదలైంది, చూశాము కదా!' అని ప్రేక్షకులు చర్చించుకోవటం కూడా పరిపాటి అయిపొయింది. ఒక సినిమా కథ రాసుకున్నప్పుడు, పలానా సినిమా నుండి స్ఫూర్తి పొంది కథ రాసుకున్నాం, అని చెప్పడంలో తప్పు లేదు, కానీ నేరుగా ఆ సినిమా కథనే వాడి, మళ్ళీ అది ఇంతవరకు తెలుగు తెరపై రాని ఒక పాయింట్ అని చెప్పడం విడ్డూరం!